విరాటపర్వం మూవీ రివ్యూ – Virata Parvam Movie Review
రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “విరాటపర్వం”. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదాపడుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు నేడు ఈ సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. మరీ ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం రండి.
కథ :
ఈ చిత్రం నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇక కథలోకి వెళితే.. తెలంగాణలో 70వ దశకం చివరలో నక్సల్స్ ఉద్యమం ఉధృతంగా ఉన్న నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. నిమ్న కులానికి చెందిన వెన్నెల (సాయి పల్లవి) ఆ సమయంలో కామ్రెడ్ అరణ్య అలియాస్ రవన్న (రానా దగ్గుబాటి) రాసిన విప్లవ కవిత్వం నుండి చాలా ప్రేరణ చెంది అతడిపై ఒక రకమైన గౌరవంతో ప్రేమను పెంచుకుంటుంది. అయితే దళనాయకుడైన రవన్నను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలిస్తుంటారు. ఆ సమయంలోనే మరోపక్క వెన్నెల కూడా కొన్ని కీలక పరిణామాల తర్వాత రవన్నను వెతుక్కుంటూ చివరకు వెన్నెల కూడా దళంలో చేరుతుంది. ఆ తర్వాత వెన్నెల ఎలాంటి ఇబ్బందులు ఎదురుకుంది? చివరకు ఆమెకు ఏమయ్యింది? అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
మొట్టమొదటిగా ఇలాంటి ఒక రా సబ్జెక్టు ని వెండితెరపై అత్యద్భుతంగా చూపించే ప్రయత్నం చేసినందుకు మూవీ ప్రొడక్షన్ ని మెచ్చుకొని తీరాలి. అవ్వడానికి ఇది ఒక నక్సల్ బ్యాక్ డ్రాప్ చిత్రం అయినా ఇది వరకు వచ్చిన పలు సినిమాలకి మాత్రం డెఫినిట్ గా ఇది డిఫరెంట్ గా ఆడియెన్స్ కి కొత్త రకం ఫీల్ ని ఒక హార్డ్ హిట్టింగ్ ఎమోషన్ ని కలిగిస్తుంది.
ఇలాంటి సినిమాల్లో కంటెంట్ అంత బలంగా పండాలి అంటే నటీనటుల ఇంటెన్స్ యాక్టింగ్ కూడా అంతే కీలకం. అందుకు తగ్గట్టుగానే చిత్రంలో ప్రతి ఒక్క నటి, నటుడు చాలా మెచ్యూర్ పెర్ఫామెన్స్ ని అందించారు. మొదటగా రవన్న గా కనిపించిన రానా కోసం చెప్పుకున్నట్టయితే రానా ఎంతటి పొటెన్షియల్ కలిగిన నటుడో అందరికీ తెలుసు. కానీ ఇటువంటి పాత్ర చేయడానికి చాలా శ్రద్దగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే సినిమాలో ఎక్కడెక్కడ తన వంతు ప్రమేయం ఉందో ఆ ప్రతి చోట తనలోని నటుడుని ప్రదర్శించి సినిమాలో బిగ్గెస్ట్ హైలైట్ గా నిలిచాడు. తన స్క్రీన్ ప్రెజెన్స్ గాని తన ఫిజిక్ గాని సినిమాలో చాలా బాగున్నాయి.
ఇక ఈ చిత్రంలో మరో హైలైట్ గా రీసెంట్ టైమ్స్ లో బాగా హీరోయిన్ సాయి పల్లవి కోసం చెప్తూ వచ్చారు మేకర్స్. మరి అంతలా సాయి పల్లవి చేసిందా అంటే అవునని చెప్పాల్సిందే. ఈ చిత్రంలో రానా తరహాలోనే ఒక కొత్త సాయి పల్లవిని చూస్తాం. ఇలాంటి రోల్ లో సాయి పల్లవి ఎప్పుడు కనిపించలేదు దానిని ఆమె మాత్రం తనలోని సహజత్వంతో మరింత ప్రాణం పోసి మరో పెద్ద హైలైట్ గా నిలిచింది. ముఖ్యంగా పలు ఎమోషనల్ సన్నివేశాల్లో సాయి పల్లవి కనబరిచిన నటన అలాగే రానాతో పలు సన్నివేశాల్లో అయితే సాయి పల్లవి ఆ సీన్స్ ని మరో స్థాయికి తీసుకెళ్తుంది. మరో మాటలో చెప్పాలి అంటే రీసెంట్ గా వెంకీ మామ చెప్పినట్టుగా అవార్డు విన్నింగ్ పెర్ఫామెన్స్ ని ఆమె అందించింది అని చెప్పాలి.
ఇంకా వీరితో పాటుగా కీలక పాత్రల్లో నటించిన నవీన్ చంద్ర, ప్రియమణిలు తమ పాత్రల్లో ఉన్న కొద్ది సీన్స్ లో మంచి నటనతో ఆకట్టుకున్నారు. ఇంకా ఈ చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ లు ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సినిమా మరింత ఎఫెక్టీవ్ గా అనిపిస్తుంది.
మైనస్ పాయింట్స్ :
ఈ చిత్రం నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే ఈ తరహా చిత్రాల్లో ఎంతోకొంత సృజనాత్మకత కూడా యాడ్ చెయ్యాల్సి ఉంటుంది. కానీ ఈ చిత్రం మొదటి నుంచి కూడా ఒకటే సీరియస్ టన్న లో నడుస్తుంది. దీనితో అన్ని వర్గాల ప్రేక్షకులనీ ఈ చిత్రం ఆకట్టుకుంటుంటుందా అంటే చెప్పలేం.
అలాగే చాలా వరకు నక్సల్ నేపథ్యపు సీన్స్ బాగా ఎక్కువగా రిపీటెడ్ గా వస్తున్నట్టు ఆడియెన్స్ కి అనిపిస్తుంది. దీనితో కొంత బోర్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా సెకండాఫ్ కొద్దిగా స్లో అయ్యినట్టు అనిపిస్తుంది. వీటితో పాటుగా క్లైమాక్స్ మరింత బలమైన ఎమోషన్స్ తో తీసి ఉంటే బాగుండు అనిపిస్తుంది.
సాంకేతిక విభాగం :
మొదట చెప్పుకున్నట్టుగా ఈ సినిమాలో నిర్మాణ విలువలు అయితే ఎక్కడా తగ్గకుండా చాలా అత్యున్నతంగా అనిపిస్తాయి. కేవలం ప్రొడక్షన్ వాల్యూస్ లోనే కాకుండా టెక్నీకల్ టీం నుంచి కూడా మేకర్స్ సాలిడ్ అవుట్ పుట్ ని రాబట్టారు. ఈ తరహా చిత్రాలకి సినిమాటోగ్రఫీ చాలా కీలకం ఈ వర్క్ ని డానీ శాంచెజ్ లోపేజ్ సూపర్బ్ అవుట్ పుట్ ఇచ్చారు. అడవుల్లో సీన్స్ గాని యాక్షన్ సీన్స్ గాని చాలా నాచురల్ విజువల్స్ తో చూపించారు. అలాగే సురేష్ బొబ్బిలి ఇచ్చిన పాటలు ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి చాలా ప్లస్ అయ్యింది. ఇంకా వీటితో పాటుగా సినిమాలో డైలాగ్స్, కాస్ట్యూమ్స్, చాలా బాగున్నాయి.
ఇక దర్శకుడు వేణు ఊడుగుల విషయానికి వస్తే ఈ సినిమాను ఆకట్టుకునే విధంగా చూపించడంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ముఖ్యంగా ఇది రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిందే అయినా ఇలాంటి చిత్రాల్లో ఎక్కడా బ్యాలన్స్ తప్పకుండా మరీ ముఖ్యంగా ఇంటెన్స్ ఎమోషన్స్ ని మిస్సవ్వకుండా తీయడం అనేది హర్షణీయం. నటీనటుల నుంచి ప్రతి క్రాఫ్ట్ లో తనకి కావాల్సిన అవుట్ పుట్ రాబట్టడంలో తాను ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఒక దర్శకునిగా ఇది మంచి లక్షణం. అయితే చిన్న చిన్న మిస్టేక్స్ పక్కన పెడితే దర్శకునిగా తన వంతు కృషి తప్పక ఫలిస్తుంది.
తీర్పు :
ఇక మొత్తంగా చూసుకున్నట్టైతే “విరాట పర్వం” ఒక విప్లవం అందులో మిళితమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ చిత్రం వెండితెరపై ఆకట్టుకుంటుంది. సినిమాలో సాలిడ్ ఎమోషన్స్, నటీనటుల లైఫ్ టైం పెర్ఫామెన్స్ లు ఆడియెన్స్ ని థియేటర్స్ లో కట్టి పడేస్తాయి. రానా – సాయి పల్లవిల నటన కోసం అయితే ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అంతకు మించి వేణు ఉడుగుల డైరెక్షన్ కూడా బాగుంది. కాకపోతే సెకండాఫ్ లో అక్కడక్కడా కాస్త డౌన్ అవ్వడం అనేది సినిమా ఓవరాల్ ఫలితాన్ని మారుస్తుంది. కూడా పక్కన పెడితే ఈ చిత్రాన్ని ఈ వారాంతంకి థియేటర్స్ లో చూడొచ్చు.