వినరో భాగ్యము విష్ణు కథ మూవీ రివ్యూ – Vinaro Bhagyamu Vishnu Katha Movie Review
కిరణ్ అబ్బవరం హీరోగా కాశ్మీరా పరదేశి హీరోయిన్ గా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన మూవీ వినరోభాగ్యము విష్ణుకథ. కాగా ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!
కథ :
విష్ణు(కిరణ్ అబ్బవరం) చిన్నతనంలోనే అతని తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుని చనిపోతారు. అయినా ఆ ఊరు ప్రజలు మాత్రం ఎలాంటి స్పందన లేకుండా నవ్వుతూ ఉంటారు. వారు నోరు మంచిది కాదు కాబట్టి, గ్రామ ప్రజలు వారికీ ఎలాంటి సాయం చేయరు. అనంతరం జరిగిన కొన్ని సంఘటనల అనంతరం నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనే సామెతను బాగా వంట పట్టించుకుని, చిన్ననాటి నుంచే తన చుట్టుపక్కల వారికి సాయం చేయడం అలవాటు చేసుకుంటాడు విష్ణు. ఇలాంటి విష్ణుకి నెంబర్ నైబర్ అనే కాన్సెప్ట్ తో విష్ణు జీవితంలోకి ప్రవేశిస్తుంది దర్శన (కాశ్మీరీ పరదేశి). ఫేమస్ యూట్యూబర్ అయిపోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తోంది దర్శన. ఈ క్రమంలో శర్మ (మురళీ శర్మ) కూడా నెంబర్ నైబర్ అనే కాన్సెప్ట్ లోకి ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల క్రమంలో దర్శన ఎందుకు జైలుకు వెళ్లాల్సి వస్తోంది?, అసలు శర్మ ఎవరు?, ఈ మొత్తం కథలో విష్ణు ఏం చేశాడు? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
‘వినరో భాగ్యము విష్ణు కథ’ అంటూ సాగిన ఈ సినిమాలో కొన్ని కామెడీ అండ్ లవ్ సీన్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. హీరోగా కిరణ్ అబ్బవరం విష్ణు పాత్ర.. ఆ పాత్రకి సంబంధించిన ట్రాక్, అలాగే ఆ పాత్రతో ముడి పడిన మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్.. ఇలా మొత్తానికి ‘వినరో భాగ్యము విష్ణు కథ’ కొన్ని చోట్ల ఆకట్టుకుంది.
కిరణ్ అబ్బవరం కూడా తన ఈజ్ యాక్టింగ్ తో అండ్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. విష్ణు పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. ఎదుటి వ్యక్తికి సహాయం చేసే గుణం ఉన్న మంచి కుర్రాడు, తన ప్రేయసి కోసం ఏం చేశాడు? అనే కోణంలో వచ్చే కొన్ని సీన్స్ బాగానే ఉన్నాయి. ఇక హీరోయిన్ గా నటించిన కశ్మీరా పర్ధేశీ తన లుక్స్ తో ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమాలో నటించడానికి ఆమె బాగానే తాపత్రయ పడింది.
మరో కీలక పాత్రలో మురళీ శర్మ చాలా బాగా నటించాడు. అలాగే ‘కె.జి.యఫ్’ లక్కీ, పమ్మి సాయి, దేవి ప్రసాద్, ఆమని చాలా బాగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు నటించారు. సినిమాలో చైతన్ భరద్వాజ్ అందించిన సంగీతం సినిమాకి బాగా ప్లస్ అయింది.
మైనస్ పాయింట్స్ :
దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి హెల్పింగ్ కి, హ్యూమన్ ఎమోషన్స్ కి సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు, కానీ.. ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లేను రాసుకోలేదు. హీరో- హీరోయిన్ మధ్య సాగే సీన్స్ కూడా బాగా స్లోగా సాగుతాయి. అలాగే వారి ప్రేమకు బలమైన సంఘర్షణ కూడా లేదు. అసలు హీరోయిన్ కశ్మీరా పర్ధేశీ క్యారెక్టర్ చాలా సిల్లీగా ఉంటే.. మురళీ శర్మ ట్రాక్ మరీ సినిమాటిక్ గా సాగింది.
ఇక హీరో పాత్ర కూడా సాయం చేయడానికే ఉంది అన్నట్టు ప్రతి సన్నివేశంలో అదే సాయం గోలను ఇరికించారు. ప్రీ ఇంటర్వెల్ దాకా హీరో సాయం అనే అంశం తప్ప, సినిమాలో మరో కంటెంట్ దర్శకుడు ఎలివేట్ చేయలేకపోయాడు. దీనికితోడు అనవసరమైన ల్యాగ్ సీన్స్ ఎక్కువైపోయాయి. పైగా సినిమా ఈ స్లో నేరేషన్ తో పాటు బోరింగ్ ట్రీట్మెంట్ అండ్ ఫేక్ ఎమోషన్స్ తో సాగుతుంది.
ఫస్ట్ హాఫ్ లో కొన్ని కామెడీ సీన్స్ మరియు ఇంటర్వెల్ సీన్ మినహా మిగతా సీన్స్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. ఇక సెకండాఫ్ ని కాస్త ఎమోషనల్ గా నడుపుదామని దర్శకుడు బాగానే ప్రయత్నం చేశాడు, కానీ ఎక్కడా ఆ ఎమోషన్ వర్కౌట్ కాలేదు. పైగా సిల్లీ ఎమోషన్స్ చుట్టూ పేలవమైన సీన్స్ తో సినిమాని సాగదీశారు.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగం గురించి చెప్పుకుంటే.. సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ అందించిన పాటల్లో రెండు బాగున్నాయి. అలాగే కొన్ని సన్నివేశాల్లో ఆయన అందించిన నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. బోర్ కొట్టించే కొన్ని సన్నివేశాలను ఎడిటర్ తన ఎడిటింగ్ తో మ్యానెజ్ చేయలేకపోయారు. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ చాలా అందంగా చూపించారు. ముందే చెప్పుకున్నట్లు దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లేను రాసుకోలేకపోయారు. ఇక సినిమాలోని ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.
తీర్పు :
నెంబర్ నైబర్ అంటూ ఎమోషనల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమా.. అటు లవ్ అండ్ ఫన్ డ్రామాలా సాగుతూనే.. ఇటు సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ టైపులో ఎండ్ అవుతుంది. ఐతే, స్లో నేరేషన్, బోరింగ్ ట్రీట్మెంట్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. కాకపోతే, లవర్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమాలోని కొన్ని అంశాలు కనెక్ట్ అవుతాయి.