వదలడు మూవీ రివ్యూ ఆడియో – Vadaladu Movie Review Audio
సాయిశేఖర్ దర్శకత్వంలో హీరో సిద్దార్ధ, క్యాథరిన్ థెరిస్సా హీరో హీరోయిన్స్ గా పారిజాత మూవీ క్రియేషన్స్, ట్రైడెంట్ ఆర్ట్స్ పతాకంపై టి.అంజయ్య సమర్పిస్తున్న చిత్రం ‘వదలడు’. ఈ చిత్రానికి టి. నరేష్‌కుమార్, టి.శ్రీధర్ నిర్మాతలుగా వ్యవహరించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ :
జగన్ (సిద్దార్ధ) ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్. తన జాబ్ లో వెరీ సిన్సియర్ గా ఉంటాడు. ఫుడ్ లో క్వాలిటీ లేకపోయినా.. కల్తీ జరిగినా వెంటనే వాళ్ళ పై యాక్షన్ తీసుకుంటాడు. అలాంటి జగన్, స్కూల్ టీచర్ జ్యోతి (క్యాథరిన్ థెరిస్సా )ను చూడగానే ప్రేమిస్తాడు. కానీ జ్యోతికి పెళ్లి చేసుకోవాలనే ఇంట్రస్ట్ ఉండదు. ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటనల అనంతరం జ్యోతి జగన్ తో పెళ్లికి ఒప్పుకుంటుంది. అప్పుడే జగన్ గురించి ఒక నిజం తెలుస్తోంది. ఇక అప్పటి నుండి జగన్ సిన్సియారిటీ వల్ల నష్టపోయిన బిజినెస్ మేన్స్ అంతా వరుసగా చనిపోతుంటారు. ఇంతకీ వాళ్ళను చంపుతుంది జగనేనా? అసలు జగన్ కి ఏం జరిగింది? జగన్ ఏమైపోయాడు? చనిపోయాడా? బతికి ఉన్నాడా? కల్తీ ఆహారాన్ని అమ్ముతున్న వారే ఎందుకు చనిపోతున్నారు? ఈ హత్యలకు జ్యోతికి సంబంధం ఏమిటి? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
కల్తీ ఆహారాన్ని తీసుకోవడం వల్లే వచ్చే రోగాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, క్యాన్సర్ బారిన పడుతున్నారన్న కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆకట్టుకునే అంశాలతో మంచి మెసేజ్ అలాగే ఇంట్రస్ట్ గా సాగే లవ్ స్టోరీ ఉంది. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన సిద్దార్ధ తన పాత్రకు తగ్గట్లు చాల బాగా నటించాడు. ముఖ్యంగా ఆహారంలో ఎలా కల్తీ చేస్తున్నారు అని వివరించే సీక్వెన్స్ లో అలాగే హీరోయిన్ ను సేవ్ చేసే సీన్ లో మరియు కొన్ని హారర్ అండ్ ఎమోషనల్ సన్నివేశాల్లో చక్కని పెర్ఫార్మెన్స్ కనబర్చాడు.
స్మెలింగ్ సెన్స్ లేని జ్యోతి క్యారెక్టర్ లో నటించిన క్యాథరిన్ చాల బాగా నటించింది. క్లిష్టమైన కొన్ని హారర్ యాక్షన్ సన్నివేశాల్లో మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో తన నటనతో ఆకట్టుకుంది. అలాగే విలన్ గా నటించిన కబీర్ సింగ్ ఎప్పటిలాగే తన గంబీరమైన నటనతో పర్వాలేదనిపిస్తాడు. అదేవిధంగా ఇతర కీలక పాత్రల్లో నటించిన నరేన్, మధు సూధనరావు, సతీష్ లు మరియు మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో మెప్పిస్తారు.
కాగా దర్శకుడు మంచి పాయింట్ తో తెరకెక్కించిన ఈ సినిమాలో నేటి సమాజంలో కల్తీ ఆహారం ఎలా తయారవుతుంది.. ఆ ఆహారం తింటే వచ్చే ఎన్నో రోగాలను సమస్యలను కళ్లకు కట్టినట్లు చూపించారు. మెయిన్ గా ఒక కల్తీ వ్యాపారానికి మరో కల్తీ వ్యాపారానికి మధ్య మంచి కనెక్షన్ చూపిస్తూ.. ప్రతి పాత్రను కథలో కలిసిపోయేలా ప్లే రాసుకోవటం బాగుంది.
మైనస్ పాయింట్స్ :
దర్శకుడు మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నా.. ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లేని రాసుకోలేకపోయారు. సినిమాని ఇంట్రస్టింగ్ గా మొదలు పెట్టి.. ఆ తరువాత ఆసక్తి కరంగా సాగని హీరో లవ్ లో పడే సీన్స్ తో కథను డైవర్ట్ చేశారు. పైగా అనవసరమైన సన్నివేశాలు కూడా ఎక్కువైపోయాయి. పైగా ఆ సీన్స్ అన్ని కూడా.. ఒకేలా సాగుతాయి. ఇంటర్వెల్ కి గాని కథ ముందుకు కదలదు.
అయితే సెకెండ్ హాఫ్ లో కల్తీ ఫుడ్ సీన్స్ అన్ని ఆసక్తికరంగా సాగిన, కొన్ని హారర్ సన్నివేశాలు మాత్రం జస్ట్ పర్వాలేదనిపిస్తాయి. ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ లాంటి యాక్షన్ హారర్ సీక్వెన్స్ స్ బాగున్నా.. కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే సాగతీసినట్లు చాల స్లోగా సాగుతుంది. పైగా సీరియస్ గా ఎమోషనల్ గా సాగే కథ కావడంతో బిసి ప్రేక్షకుల ఆశించే ఎలిమెంట్స్, ట్విస్టులు సినిమాలో (ఒక్క ఇంటర్వెల్ తప్ప) పెద్దగా లేవు.. ఉన్నవి కూడా ఆకట్టుకునేలా అనిపించవు.
సాంకేతిక విభాగం :
ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. ఎస్ ఎస్ థమన్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను కెమెరామెన్ ఎంతో రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. అయితే ఎడిటర్ ప్రవీణ్ కె ఎల్ సినిమాలోని సాగతీత సన్నివేశాలను తగ్గించి ఉంటే.. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ మరియు లవ్ సీన్స్ లోని కొన్ని సీన్స్ ను ట్రీమ్ చేసి ఉంటే సినిమాకి బాగా ప్లస్ అయ్యేది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి. ఇక దర్శకుడు సాయి శేఖర్ మంచి స్టోరీ లైన్ తో అలాగే మంచి మెసేజ్ తో మరియు కొన్ని హారర్ సీన్స్ తో ఆకట్టుకున్నా, సరైన కథనాన్ని మాత్రం రాసుకోలేకపోయారు.
తీర్పు :
కల్తీ లేని ఆహారమే నా కల.. దాని కోసం ఎవర్ని ‘వదలడు’ అంటూ వచ్చిన ఈ చిత్రంలో ఆకట్టుకునే అంశాలతో పాటు మంచి మెసేజ్ మరియు ఇంట్రస్ట్ గా సాగే హీరో ట్రాక్ అలాగే లవ్ స్టోరీ మరియు కొన్ని హారర్ సీన్స్ సినిమాలో ఆకట్టుకుంటాయి. కాకపోతే రెగ్యులర్ కామెడీ, రొటీన్ హర్రర్ ఎలిమెంట్స్ మరియు అక్కడక్కడ ప్లే ఇబ్బంది పెట్టినప్పటికీ.. ఓవరాల్ గా ఆడియన్స్ ను మాత్రం ఈ సినిమా నిరుత్సాహ పరచదు. మరి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది చూడాలి.