Taramani 2019 Telugu Movie Review

Taramani

తారామణి మూవీ రివ్యూ ఆడియో – Taramani Movie Review Audio




 

ఆండ్రియా జర్మియా ప్రధాన పాత్రలో తెరకెక్కిన తమిళ చిత్రం తారామణి. ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో డబ్ చేసి విడుదల చేయడం జరిగింది. కాగా నేడు ఈ చిత్రం విడుదలైన నేపథ్యంలో మూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం.

కథ :

అథియా(ఆండ్రియా) స్వతంత్ర్య భావాలు కలిగిన ఉద్యోగిని. ఆమె ఒక రోజు అనుకోకుండా ప్రేమలో విఫలమై డిప్రెషన్ లోఉన్న ప్రభు( వసంత రవి)ని కలవడం జరుగుతుంది. ఆ పరిచయం కాస్తా పెద్దదై వారు కలిసి సహజీవనం చేసే వరకు వెళుతుంది. మరి ఆ కొత్త బంధంలో ఏర్పడిన సమస్యలేమిటి? వారు వారి జీవితాలను ఎలా బ్యాలన్స్ చేశారు? వారి బంధం చివరికి ఎలా ముగిసింది? అనేది మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :

మూవీలో ప్రధాన పాత్రలు పోషించిన ఆండ్రియా మరియు వసంత రవిల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. వారిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు ఆసక్తికరంగా సాగాయి. అలాగే ప్రత్యేక పాత్రలో కనిపించిన అంజలి నటన ఉన్న కొద్దినిమిషాలు పర్వాలేదనిపించింది.

ఆత్మాభిమానం,స్వతంత్ర్య భావాలు కలిగిన అమ్మాయి పాత్రలో ఆండ్రియా పాత్ర అద్భుతంగా ఉంది. సాఫ్ట్వేర్ అమ్మాయి పాత్రలో ఆమె చక్కగా సరిపోయారు. ఇక మూవీ ప్రథమార్థంలో వచ్చిన రెండు పాటలు బాగున్నాయి. అలాగే వసంత రవి కూడా లవ్ ఫెయిల్యూర్ అబ్బాయిగా అలరించాడు. ఆయన నటన ఆకట్టుకుంటుంది. తాము ప్రేమించిన వారి ప్రేమ, ఆప్యాయతలు తమకు మాత్రమే చెందాలని భావించే నేటి యువతలో ఉండే తత్వాన్ని సహజంగా చక్కగా చెప్పారు.




మైనస్ పాయింట్స్ :

ఆసక్తికరంగా సాగిన ఫస్ట్ హాఫ్ తరువాత మూవీ వేగం తగ్గింది. రెండవ భాగంలో నిజజీవితంలో జరిగే అనేక వాస్తవ సంఘటనలు చూపించినా, నెమ్మదిగా సాగే స్క్రీన్ ప్లే విసుగు పుట్టిస్తుంది.

గత చిత్రాలలో వలే ఆండ్రియా నుండి కొంచెం గ్లామర్, ఎక్స్ పోజింగ్ ఆశించి వెళ్లిన వారికీ నిరాశ తప్పదు. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర కావడంతో ఆమె పాత్రకు గ్లామర్ షో కి ఆస్కారం లేకుండా పోయింది. పూర్తిగా సహజత్వానికి దగ్గరగా తెరకెక్కిన ఈ చిత్రంలో కమర్షియల్ అంశాలైన కామెడీ, డ్యూయెట్స్ లాంటివి మిస్సయ్యాయి. ఇక మూవీ క్లైమాక్స్లో కథలోని విభిన్న కోణాలను వివరించే క్రమంగా సరిగా కుదరలేదు.

సాంకేతిక విభాగం :

ఎంచుకున్న కాన్సెప్ట్ ని వాస్తవికతకు దగ్గరగా తీయడంపై ఎక్కువ శ్రద్ద పెట్టిన దర్శకుడు రామ్ కమర్షియల్ అంశాలును పూర్తిగా విస్మరించారు. దీనితో తారమణి అంతగా ఆకర్షణీయత సంతరించుకోలేదు. అలాగే చిత్రంలో ఎడిటింగ్ వైఫల్యం కూడా బాగా కనిపిస్తుంది. 20నిమిషాల నిడివి తగ్గిస్తే బాగుండును అనే భావన కలిగింది. ఇక తేని ఈశ్వర్ అందించిన సినిమాటోగ్రఫీ పర్వాలేదు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. ఆయన అందించిన బీజీఎమ్ కూడా చాలా బాగుంది. ఇక చిత్ర బడ్జెట్ పరిధిలో నిర్మాణ విలువలు కూడా పర్వాలేదు అన్నట్లుగా ఉన్నాయి.

తీర్పు :

తాము ప్రేమించిన వారి ప్రేమ. ఆప్యాయతలు తమకు మాత్రమే చెందాలి అనే భావాలు కలిగిన నేటి యువత ఆలోచనగా ధోరణిని తారామణి చిత్రంలో సహజంగా వాస్తవానికి దగ్గరగా చెప్పడానికి ప్రయత్నించారు. ఐతే మొదటి సగం చిత్రం ఆహ్లదంగా సాగిన, రెండవ భాగం కథనం నెమ్మదించడంతో బోరింగ్ భావన కలుగుతుంది. అలాగే అసలు కమర్షియల్ అంశాలు లేకపోవడం ఈ చిత్రాన్ని దెబ్బతీసింది. ఈ వారాంతం ఓ మంచి చిత్రంతో ముగించాలని భావించేవారికి, తారామణి బెటర్ ఛాయిస్ కాదని చెప్పవచ్చు.

English Review