పలాస 1978 మూవీ రివ్యూ – Palasa 1978 Movie Review
రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘పలాస 1978′. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
1978 ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాలోని పలాస నేపథ్యంలో ఈ కథ జరుగుతుంది. అప్పట్లో పలాసా ప్రాంతంలో తక్కువ జాతి అని పిలుస్తూ దిగువ కులాలను విపరీతమైన వివక్షకు గురి చేస్తూ.. ఉన్నత కులంవారు తమ స్వార్ధంతో తమ రాజకీయ బలంతో తక్కువ జాతి అని పిలవబడుతున్న వారిని పూర్తిగా అణిచివేస్తారు. అలాంటి తక్కువ జాతిలో పుట్టిన మోహన్రావ్ (రక్షిత్) మరియు అతని అన్నయ్య రంగారావ్ (తిరువీర్) ఆ అన్యాయానికి ఎదురుతిరుగుతారు.
అయితే పెద్దకులం వారుగా షావుకార్లుగా చలామణి అవుతున్న గురుమూర్తి (రఘు కుంచె) అతని అన్నయ్య పెద్ద షావుకారు ఎవరికి వారు వేరుగా పోటీగా దురాగతాలు చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో పెద్ద షావుకారుకు వ్యతిరేకంగా మోహన్రావ్, రంగారావ్ తిరుగుబాటును ప్రారంభిస్తారు. దాంతో చిన్న షావుకారు గురుమూర్తి వారిని దగ్గరకి చేరతీయడం, ఆ తరువాత ఇద్దరు సోదరులు మోహన్ రంగా మద్యే మనస్పర్థలు రావడం.. రంగారావ్ తమ్ముడిని వదిలేసి పెద్ద షావుకారు దగ్గరికే వెళ్లిపోవడం.. ఇలా కథ చాలా మలుపులు తీసుకుంటూ సాగుతోంది. ఈ క్రమంలో వాళ్ళను చంపడానికి ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి ? మళ్ళీ అన్నదమ్ములు ఒక్కటయ్యారా ? తమ పోరాటంలో విజయం సాధించారా లేక ప్రాణాలు కోల్పోయారా ? చివరకి కథ ఎలా ముగిసింది ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్స్… ఈ కథ జరిగిన నేపథ్యం, సహజంగా సాగే పాత్రలు, సినిమా చూస్తున్నంత సేపు పలాస అనే ప్రాంతానికి వెళ్లి ఆ పాత్రలను మనం దగ్గరనుండి చూస్తున్న ఫీలింగ్ కలగడం, అలాగే డైరెక్టర్ రాసుకున్న సున్నితమైన భావోద్వేగాలు కొన్ని చోట్ల అబ్బురపరుస్తాయి. ఈ మధ్య చాలామంది డైరెక్టర్స్ డైలాగ్స్ ను జస్ట్ సీన్ ను కమ్యూనికేట్ చేయటానికే తప్ప, డైలాగ్స్ మీదే డిపెండ్ అవ్వట్లేదు. కానీ, డైలాగ్స్ సినిమాని నిలబెట్టగలవని గతంలో చాలా సినిమాలు రుజువు చేశాయి. ఇప్పుడు ఈ సినిమాతో అది మరొక సారి రుజువు అయింది. డైలాగ్స్ ఈ సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్లాయి. నిజానికి సినిమా నేపథ్యం తప్ప.. పాత్రలు వాటి సంఘర్షణ.. ఆ సంఘర్షణకి కారణమైన పరిస్తితులు రొటీన్ గానే మరియు కొన్ని చోట్ల బోర్ గానే సాగినా.. సినిమా పై ఆసక్తి తగ్గకపోవడానికి కారణం ఒక్క డైలాగ్స్ మాత్రమే. విషయం లేని చాలా సీన్స్ లో డైలాగ్ లు బాగుండటంతో ఆ సీన్స్ బాగా పేలాయి. ముఖ్యంగా పెద్ద షావుకారు చెప్పిన డైలాగ్స్, క్లైమాక్స్ లో హీరో పలికే ఏకలవ్య డైలాగ్స్ సినిమా మొత్తంలోనే హైలైట్ గా నిలిచాయి.
ఇక క్యారెక్టర్స్ మధ్య ఎమోషన్ అండ్ ప్రయారిటీస్ మారిపోవడంతో పాటు ఆయా క్యారెక్టర్స్ మధ్య కాన్ ఫిల్ట్ కూడా చేంజ్ అవుతూ ప్లే సాగడంతో.. తరువాత ఏం జరగబోతుందని ఆలోచించే ప్రేక్షకులకు థ్రిల్లింగ్ గా అనిపిస్తోంది. దీనికితోడు సినిమాలోని సహజత్వం.. నటీనటుల హావభావాలు, వాళ్ళు పలికిన యాస బాగుండటంతో సినిమాలోని ఎమోషన్ కి బాగా కనెక్ట్ అవుతాము. నటీనటులు కూడా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సినిమాలో నాలుగు వేరియేషన్స్ గల పాత్రలో కనపడిన హీరో రక్షిత్ చాల బాగా చేశాడు. ముఖ్యంగా 60 యేళ్ళ వృద్దుడి గెటెప్ లో కూడా హీరో నటన బాగుంది. ఇక తన పాత్రకి తగ్గట్లు బరువు తగ్గుతూ పెరుగుతూ నాలుగు రకాల గెటప్స్ లో రక్షిత్ తీసుకున్న కేర్ పెట్టిన ఎఫెక్ట్స్ స్క్రీన్ మీద స్పష్టంగా కనిపిస్తాయి. నటుడిగా ఇలాంటి అవకాశం అరుదుగా వస్తుంది. దాన్ని రక్షిత్ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. అతని కెరీర్ లోనే ఈ పాత్ర మంచి పాత్రగా నిలిచిపోతుంది.
ఇక రక్షిత్ సరసన కథానాయకిగా నటించిన నక్షత్ర తన స్క్రీన్ ప్రెజెన్స్ మరియు తన గ్లామర్ తో పాటుగా తన నటనతోనూ మెప్పించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో మరియు ప్రేమ సన్నివేశాల్లో ఆమె బాగానే నటించింది. హీరోహీరోయిన్ల మధ్య సీన్లు, వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే అలరిస్తుంది. అలాగే హీరోకి వదిన పాత్రలో నటించిన నటి.. అన్నయ్యగా నటించిన తిరువీర్ కూడా చాల బాగా నటించారు. ఇక ఇతర కీలక పాత్రల్లో కనిపించిన రఘు కుంచె, జనార్థన్, లక్ష్మణ్, జగదీష్ లతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.
మైనస్ పాయింట్స్ :
సినిమాలో సస్పెన్స్ అండ్ వాట్ నెక్స్ట్ అనే ఒక ఇంట్రస్ట్ క్రియేట్ చెయ్యడానికి డైరెక్టర్ రాసుకున్న స్క్రీన్ ప్లే సింపుల్ గానే సాగింది. వాసు అనే వ్యక్తిని చంపింది ఎవరు అనే పాయింటాఫ్ వ్యూతో మొదలైన సినిమా.. మోహన్రావే (హీరో) అని అతనే చంపింది.. ఎందుకు చంపాడు కారణం ఏమిటి అని అతని జీవితకథను దర్శకుడు మంచి ట్రీట్మెంట్ తో చెప్పుకుంటూ వెళ్లినా.. సినిమాలో మెయిన్ పెయిన్ అండ్ ఎమోషన్ అంతా చివర్లో హీరో చేత చెప్పించి.. అందుకే ఎదురుతిరిగాను, చంపాను అని హీరో పాత్ర తన బాధను వెళ్లగగ్గినప్పటికీ.. అతనిలో అంత కసి, అంత విరక్తి కలగడానికి గల కారణాలను ముందే విజువల్ గా ఇంకా బలంగా చూపించి.. ఎట్టిపరిస్థితుల్లో వాళ్ళను చంపాల్సిందే అనే ఫీల్ ని ఎలివేట్ అయ్యేలా డైరెక్టర్ చూసుకుని ఉండి ఉంటే, అసలు హీరో వాళ్ళను ఎందుకు చంపుతున్నాడు అనే యాంగిల్ లో ఆడియన్స్ ఇంకా పూర్తిగా ఇన్ వాల్వ్ అయ్యేవాళ్ళు.
అలాగే మొదటి సీన్ లో హీరో పాత్రని రివీల్ చెయ్యకుండా ఉండి ఉంటే.. అసలు హీరో పాత్ర బతికి ఉందా చనిపోయిందా అనే ఉత్సుకత చివరివరకూ ఉండేది. కానీ, హీరో బతికి ఉన్నాడు అనే క్లారిటీ ఆడియన్స్ కి ఇచ్చేసి… ఇక అతను బతికి ఉన్నాడా చనిపోయాడా అనే సిల్లీ డౌట్ ఎందుకో వ్యక్తపరచడం. ఫస్ట్ హాఫ్ లో స్టార్టింగ్ సీన్స్ అండ్ సెకెండ్ హాఫ్ లో అన్నదమ్ములు కలిసాక సాగే సన్నివేశాలు జస్ట్ ఒకే అనిపిస్తాయి. అయితే సినిమా బోర్ కొడుతుందనుకునేలోపే క్యారెక్టర్స్ మధ్య కాన్ ఫ్లిట్ ను చేంజ్ చేస్తూ.. ఆడియన్స్ ఊహకి అందని వేరియేషన్స్ తో దర్శకుడు రాసుకున్న కొన్ని సన్నివేశాలు సినిమాని నిలబెట్టాయి. ఇక మ్యూజిక్ సినిమా స్థాయికి తగ్గట్లు లేదు. ఇలాంటి సహజమైన నేపథ్యంలో కావాల్సినన్నీ ఎమోషన్స్ ఉన్నా.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా పూర్తిస్థాయిలో ఆకట్టుకోదు.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగం విషయానికి వస్తే..డైరెక్టర్ కరుణ కుమార్ ఈ కథను చాల సహజంగా రాసుకున్నారు.కొన్ని సన్నివేశాలను ఎమోషనల్ గా బాగా తెరకెక్కించారు. అయితే ఆయన కథనాన్ని ఇంకా బాగా రాసుకోని ఉండి ఉంటే సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకునేది. అయితే కుల వ్యవస్థ మీద ఆయన తీసుకున్న కథాంశం, ఇచ్చిన మెసేజ్ చాలా బాగుంది. అలాగే ఈ కుల బలహీనత వల్ల.. భాద పడిన వ్యక్తుల గురించి, నలిగిపోయిన జీవితాలను దర్శకుడు చాల బలంగా చూపించారు. రఘు కుంచె అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆయన అందించిన పాటలు జస్ట్ ఒకే అనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది.. అయితే సార్టింగ్ సీన్స్ లో కెమెరా వర్క్ ఇంకా ఎఫెక్టివ్ గా ఉండాల్సింది. కానీ, సినిమాలోని చాలా సన్నివేశాలను కెమెరామెన్ అరుల్ విన్సెంట్ చాలా నేచురల్ గా చిత్రీకరించారు. కోటగిరి ఎడిటింగ్ బాగుంది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే నిర్మాణ విలువులు ఇంకా బెటర్ గా ఉంటే.. విజువల్ గా అవుట్ ఫుట్ ఇంకా బాగా వచ్చేది.
తీర్పు :
రెగ్యులర్ సినిమాల పరంపరలో నలిగిపోతున్న ఆడియన్స్ కి చాల రోజుల తరువాత అర్ధవంతమైన కంటెంట్ తో, విలువైన మెసేజ్ తో పాటు సహజమైన పాత్రలు, ఆ పాత్రాల తాలూకు బలమైన సంఘర్షణలతో మరియు సున్నితమైన భావోద్వేగాలతో సాగే ఈ సినిమా… కచ్చితంగా నచ్చుతుంది. అయితే, కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగడం, మోటివ్ సీన్స్ ఇంకా బలంగా ఉండాల్సిందనే ఫీలింగ్ కలగడం, అందరూ నూతన నటినటులతోనే(మార్కెట్ పరంగా) సినిమాని తెరకెక్కించడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి. అయినప్పటికీ ఉత్తరాంధ్రలో ఒక ప్రాంతంలో జరిగిన ఈ సినిమా ప్రత్యేక ముద్రను వేస్తోంది. మంచి చిత్రాలని కోరుకునే ప్రేక్షకులకు, ఈ సినిమా మంచి చాయిస్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.