కురుక్షేత్రం మూవీ రివ్యూ ఆడియో – Kurukshetram Movie Review Audio
మహాభారతం లాంటి అత్యద్భుత దృశ్య కావ్యాన్ని తొలిసారిగా ఇండియన్ స్క్రీన్ మీద 3డిలో నాగన్న దర్శకత్వంలో అర్జున్, దర్శన్, నిఖిల్ గౌడ్ ప్రధాన పాత్రలుగా అత్యధిక బడ్జెట్‌తో ‘కురుక్షేత్రం’ సినిమాను తెరకెక్కించాడు. కాగా ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ :
మహాభారతంలో దాయాదులైన కౌరవులకు పాండవులకు మధ్య హస్తినాపుర సింహాసనం కోసం జరిగిన కురుక్షేత్ర యుద్ధం గురించి.. అలాగే మహాభారత ఇతివృత్తం గురించి అందరికీ తెలిసినదే. అయితే ఈ సినిమా ధర్మరాజును రాజుగా ప్రతిపాదిస్తుండగా దుర్యోధనుడు (దర్శన్) .. ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తాడు. ఆ తరువాత జరిగిన సంఘటనల అనంతరం కర్ణుడు(అర్జున్)ని దుర్యోధనుడు (దర్శన్) రాజుగా ప్రకటించి ఆప్తమిత్రుడిగా చేసుకుంటాడు. అయితే అప్పటికే శకుని తన వంశానికి జరిగిన అన్యాయానికి బదులుగా తన కపట నాటకాలతో కుట్రలతో కౌరవులకు పాండవులకు మధ్య యుద్దాన్ని సృష్టిస్తాడు. అసలు శకుని అలా చేయడానికి గల కారణాలు ఏమిటి ? కర్ణుడు మరియు దుర్యోధనుడు మధ్య స్నేహం ఎంత గొప్పది ? చివరికీ కౌరవుల మీద పాండవులు ఎలా గెలిచారు ? ఆ గెలుపుకు శ్రీ కృష్ణుడు ఎలా కారణమయ్యాడు ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ద నేపథ్యంలో పూర్తి 3డ్లో తెరకెక్కించడమే ఈ సినిమా ప్రధాన ప్లస్ పాయింట్. పైగా అన్ని ముఖ్య పాత్రలకు అగ్ర కన్నడ నటీనటులు నటించడం.. యాక్షన్ కింగ్ అర్జున్ కర్ణుడుగా దర్శన్ దుర్యోధనుడిగా, సోనూసూద్ అర్జునుడిగా, అభిమన్యుడిగా నిఖిల్ గౌడ్, కృష్ణుడిగా రవిచంద్రన్ ద్రౌపదిగా స్నేహ.. ఇలా ప్రతి ఒక్కరూ తమ పాత్రల్లో చాల బాగా నటించారు.
కర్ణుడు పాత్రలో నటించిన అర్జున్, ఆ పాత్రకు తగ్గట్లు హావభావాలతో.. అభిమన్యుడిని చావుకు కారణమయ్యే సన్నివేశం.. అలాగే కుంతీదేవి పుత్ర భిక్ష పెట్టమని అడిగే సన్నివేశం లాంటి కొన్ని కీలకమైన సన్నివేశాల్లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో నటించి అర్జున్ సినిమాకి హైలెట్ గా నిలచారు. అదేవిధంగా దుర్యోధనుడిగా నటించిన దర్శన్ కూడా అద్భుతంగా నటించాడు. మయసభలో దర్శన్ మీద వచ్చే సాంగ్ కూడా చాల బాగుంది. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాకి ప్రధాన మైనస్ పాయింట్ అంటే కథనమే. ముఖ్యంగా ఈ సినిమా చూస్తున్నంత సేపూ సీనియర్ ఎన్టీఆర్ నటించి మెప్పించిన ‘దాన వీర శూర కర్ణ’నే గుర్తుకువస్తోంది. ముగింపు కూడా సేమ్ ‘దాన వీర శూర కర్ణ’లోని ముగుంపే ఇవ్వడం తెలుగు ప్రేక్షకులకు నిరాశను కలిగిస్తోంది.
దర్శకుడు నాగన్న 3డి విజువల్స్ మీద పెట్టినంత కాన్సన్ట్రేషన్ కథాకథనాలు మీద అసలు పెట్టలేదనిపిస్తుంది. సినిమాలోని ఒక్కో సన్నివేశం వీడిగా చూస్తే, ఆ సన్నివేశాలన్నీ పాత సినిమాల్లో చూసిన ఫీలింగే కలుగుతుంది. పైగా ఆ గ్రాఫిక్ విజువల్స్ కూడా తేలిపోయాయి. దీనికి తోడు సినిమా మొత్తం చాలా స్లోగా సాగుతూ ఉండటం వల్ల..ప్రేక్షకులు కొంత అసహనానికి గురి అవుతారు.
ముఖ్యంగా కొన్ని సన్నివేశాలను అనవసరంగా లాగడం వల్ల ఆ సాగ తీత సన్నివేశాల్లో ఇంట్రస్ట్ మిస్ అయింది. ఇంకా టైట్ స్క్రీన్ ప్లే మరియు ఎంగేజింగ్ ఎలిమెంట్స్ ఉండి ఉంటే ఈ సినిమా.. ఇలాంటి సినిమాలను ఇష్టపడే వర్గం ప్రేక్షకులకైనా నచ్చేది. కానీ కథాకథనాలు వల్ల వాళ్ళను కూడా ఈ సినిమా మెప్పించదు.
సాంకేతిక విభాగం :
దర్శకుడు నాగన్న 3డిలో భారీ విజువల్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినా.. సినిమా చూస్తున్నంతసేపూ పాత సినిమాలు చూస్తున్న ఫీల్ తెచ్చాడు. మెయిన్ గా కథనం బాగా నిరాశ పరుస్తోంది. సంగీత దర్శకుడు అందించిన సంగీతం బాగాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. ఉన్న విజువల్స్ ను కూడా సరిగ్గా ఎలివేట్ చేయలేకపోయింది. ఇక సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని భారీ విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ పర్వాలేదు. అక్కడక్కడా ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను తగ్గించాల్సింది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.
తీర్పు :
మహాభారతం లాంటి అత్యద్బత దృశ్య కావ్యం 3డిలో నాగన్న దర్శకత్వంలో అర్జున్, దర్శన్, నిఖిల్ గౌడ్ ప్రధాన పాత్రలుగా వచ్చిన ఈ ‘కురుక్షేత్రం’ పాత సినిమాల సమ్మేళనంగా అనిపిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా చూస్తున్నంతసేపూ ‘దాన వీర శూర కర్ణ’నే గుర్తుకువస్తోంది. దానికి తోడు దర్శకుడు నాగన్న 3డి విజువల్స్ మీద పెట్టినంత కాన్సన్ట్రేషన్ కథాకథనాలు మీద అసలు పెట్టలేదనిపిస్తుంది. మొత్తానికి ఆసక్తికరంగా సాగని ఈ ‘కురుక్షేత్రం’ ప్రేక్షకులను మెప్పించదు. అయితే ఇలాంటి నేపథ్యంలోని సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను ఈ సినిమా కొంతమేరకు మెప్పించొచ్చు.