కళ్యాణం కమనీయం మూవీ రివ్యూ – Kalyanam Kamaneeyam Movie Review
సంతోష్ శోభన్ హీరోగా నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ళ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా మూవీ కళ్యాణం కమనీయం. ప్రముఖ సంస్థ యువి కాన్సెప్ట్స్ బ్యానర్ పై నిర్మితం అయిన ఈ మూవీకి శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందించగా దేవీప్రసాద్, సత్యం రాజేష్, పవిత్ర లోకేష్, కేదార్ శంకర్ వంటి వారు కీలక పాత్రలు చేసారు. సాంగ్స్, టీజర్, ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ మూవీ నేడు ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చింది. మరి ఈ మూవీ యొక్క సమీక్ష ఇప్పుడు చూద్దాం.
కథ :
ఉద్యోగం లేకుండా తన తల్లితండ్రుల మీద ఆధారపడి జీవిస్తూ లైఫ్ ని లీడ్ చేస్తున్న శివ (సంతోష్ శోభన్), ఒకానొక సందర్భంలో జాబ్ చేస్తూ లైఫ్ లో సెటిల్ అయిన శృతి (ప్రియా భవాని శంకర్) ని చూసి ప్రేమించడం, అనంతరం ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అయితే మొదట్లో చక్కగా ఒకరినొకరు అర్ధం చేసుకుని సాగుతున్న వారి లైఫ్ లో చుట్టుప్రక్కల వారి మాటలు, కొన్ని పరిస్థితుల వలన సమస్యలు తలెత్తుతాయి. ఆపైన ఒక ఒకానొక అనుకోని ఘటన వలన వారిద్దరూ విడిపోతారు. అయితే వారిద్దరూ ఎందుకు విడిపోవలసి వచ్చింది, మళ్ళి వాళ్లిద్దరూ కలిసారా లేదా ? కలిస్తే ఎలా కలిశారు అనేది మిగతా కథ.
ప్లస్ పాయింట్స్ :
ముఖ్యంగా కళ్యాణం కమనీయం మూవీకి పెద్ద ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవాల్సింది హీరో సంతోష్ శోభన్, హీరోయిన్ గా ఈ మూవీతో టాలీవుడ్ కి పరిచయం అయిన ప్రియా భవానీశంకర్. భార్య భర్తలుగా వారిద్దరూ తమ తమ పాత్రల్లో ఎంతో బాగా పెర్ఫార్మ్ చేసారు. కొన్ని కీలక ఎమోషనల్ సన్నివేశాల్లో ఇద్దరి నటన ఎంతో సహజంగా ఉండడంతో పాటు రియలిస్టిక్ ఫీల్ ని ఆడియన్స్ కి అందిస్తుంది.
ఇక యువ దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ళ తీసుకున్న స్టోరీ లైన్ డీసెంట్ గా ఉంది. దానిపై అల్లుకున్న కొన్ని భార్యాభర్తల సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇక మెయిన్ లీడ్ తో పాటుగా కీలక క్యారెక్టర్స్ లో కనిపించిన దేవీప్రసాద్, సత్యం రాజేష్, పవిత్ర లోకేష్, కేదార్ శంకర్ ల పాత్రలు కూడా ఆకట్టుకుంటాయి. ఇక శ్రావణ్ భరద్వాజ్ అందించిన సాంగ్స్ లో రెండు సాంగ్స్ విజువల్ గా బాగున్నాయి.
మైనస్ పాయింట్స్ :
ముఖ్యంగా ఈ మూవీలో పెద్ద మైనస్ ఏమన్నా ఉంది అంటే అది దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ళ ఈ కథని తెరకెక్కించిన విధానం అని చెప్పాలి. నిజానికి ఈ పాయింట్ పాతదే అయినా, కథనాన్ని కూడా అదే విధంగా మూస పాత పద్దతిలో తెరక్కించారు. కథనంలో ఏ మాత్రం కొత్తదనం ఆసక్తికర అంశాలు లేకపోవడంతో పాటు చాలా సన్నివేశాలు ఆడియన్స్ కి గత సినిమాలను గుర్తు చేస్తూ నీరసం తెప్పిస్తాయి.
సినిమాలో చాలా సీన్స్ ఆల్రెడీ చూసిన తెలిసిన భావన ఆడియెన్స్ కి కలుగక మానదు. అలాగే రన్ టైం తక్కువ అయినప్పటికీ సినిమా సీన్స్ ఇంకా ఆకట్టుకునే విధంగా మరింత మంచి ఎమోషన్స్ ని చూపించి ఉంటే ఓ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ చిత్రం అయ్యేది. కానీ సినిమాలో చాలా అంశాలు చాలా డల్ గా అనిపిస్తాయి.
సాంకేతిక వర్గం :
చిత్ర నిర్మాతలైన యువి కాన్సెప్ట్స్ వారి నుండి వచ్చిన ఈ మూవీ యొక్క నిర్మాణ విలువలు బాగున్నాయి. చిన్న సినిమా అయినా లుక్స్, నిర్మాణం విషయంలో రాజీపడకుండా నిర్మించారు. కెమెరా మ్యాన్ గా వర్క్ చేసిన కార్తీక్ ఘట్టమనేని పనితనం ఎంతో బాగుంది. సాంగ్స్ తో పాటు అక్కడక్కడా కొన్ని సీన్స్ లో ఫొటోగ్రఫీ మరింత బాగా ఆకట్టుకుంది. సంగీతం పరంగా శ్రావణ్ భరద్వాజ్ అందించిన రెండు సాంగ్స్ పర్వాలేదనిపించడం మూవీకి ఒకింత బలాలు. ఎడిటింగ్ విభాగం పనితీరు బాగుంది, అందుకే పక్కాగా లెంగ్త్ ని కట్ చేసి సీన్స్ సెట్ చేసారు. ఎడిటింగ్ విభాగం బాగానే వర్క్ చేసారు.
ఇక దర్శకుడు అనిల్ కుమార్ విషయానికి వస్తే.. తాను తెలిసిందే అయినా మంచి లైన్ ని పట్టుకున్నారు. కానీ కథనాన్ని మాత్రం మరింత ఆసక్తికరంగా రాసుకుని ఉంటే బాగుండేది. ఏవో కొన్ని సీన్స్ మినహా తాను మిగతా సినిమా నరేషన్ అంతా చాలా ఫ్లాట్ గా అనిపిస్తుంది. డైరెక్టర్ ఇంకా మెప్పించేలా నరేషన్ ని ఎంగేజింగ్ గా చూపించి ఉంటే బెటర్ రిజల్ట్ వచ్చి ఉండేది. ఈ సినిమాకి మాత్రం తన వర్క్ బిలో యావరేజ్ గా ఉంటుంది.
తీర్పు :
ఇక మొత్తంగా చెప్పుకోవాలి అంటే సంతోష్ శోభన్, ప్రియా భవానీశంకర్ ల కళ్యాణం కమనీయం మూవీ పూర్తి స్థాయిలో ఆడియన్స్ ని ఆకట్టుకోదు. హీరో హీరోయిన్స్ తో పాటు కీలక పాత్రధారుల పెర్ఫార్మన్స్, రెండు సాంగ్స్, కొన్ని సీన్స్ లో విజువల్స్, తక్కువ రన్ టైం లు సినిమాలో కాస్త మెప్పించే అంశాలు కాగా.. అసలు ప్రధానంగా తీసుకున్న కథని ఆడియన్స్ కి నీరసం తెప్పించేలా దర్శకుడు అనిల్ కుమార్ నడిపిన విధానం పెద్ద మైనస్ గా మారింది. తాను ఇంకా మంచి సన్నివేశాలతో చిత్రాన్ని ప్రెజెంట్ చేసి ఉంటే ఈ వారాంతనికి ఇది కూడా మంచి ట్రీట్ ఇచ్చి ఉండేది కానీ దురదృష్టవశాత్తు ఈ చిత్రం జస్ట్ యావరేజ్ నుంచి బిలో యావరేజ్ ఫ్లిక్ గా నిలిచిపోయింది.