జానే జాన్ మూవీ రివ్యూ
నటీనటులు: కరీనా కపూర్, జైదీప్ అహ్లావత్, విజయ్ వర్మ, సౌరభ్ సచ్‌దేవా, నైషా ఖన్నా తదితరులు
దర్శకుడు : సుజోయ్ ఘోష్
నిర్మాతలు: : జే శేవక్రమణి, అక్షయ్ పూరి, హ్యున్వూ థామస్ కిమ్, శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్
సంగీత దర్శకులు: సచిన్ జిగర్, షోర్ పోలీస్
సినిమాటోగ్రఫీ: అవిక్ ముఖోపాధ్యాయ్
ఎడిటర్: ఊర్వశి సక్సేనా
కరీనా కపూర్ లేటెస్ట్ మూవీ జానే జాన్ నేడు ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. హెయిగో హిగాషినో రాసిన జపనీస్ నావెల్ ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్ ని బేస్ చేసుకుని ఇది తెరకెక్కింది. జైదీప్ అహ్లావత్, విజయ్ వర్మ ఇందులో కీలక పాత్రలు చేసారు. సుజోయ్ ఘోష్ తెరకెక్కించిన ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమ్ అవుతోంది. మరి ఈ మూవీ యొక్క సమీక్ష ఇప్పుడు చూద్దాం.
కథ :
కలింపాంగ్ లో జీవించే ఒంటరి తల్లి మాయ డిసౌజా అలియాస్ సోనియా డిసౌజా (కరీనా కపూర్) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తన కూతురు తారా డిసౌజా (నైషా ఖన్నా) బాధ్యతని చూసుకోవడానికి ఆమె ఒక కేఫ్ లో పని చేస్తూ ఉంటుంది. అయితే మయా కి తన భర్త అజిత్ మాత్రే (సౌరభ్ సచ్‌దేవా) అంటే ఇష్టం ఉండదు. అందుకే తారా పుట్టకముందే అతడి నుండి విడిపోతుంది. అయితే మాయ ఇంటి ప్రక్కన ఉండే నరేన్ వ్యాస్ (జైదీప్ అహ్లావత్) ఆమెని సీక్రెట్ గా ప్రేమిస్తూ ఉంటాడు. బ్లూ మూన్ నుండి అజిత్ మ్హత్రే సడన్ గా కాలింపాంగ్ కి వస్తాడు మరియు మాయ ఇంటిని సందర్శిస్తాడు. కాగా అజిత్ డబ్బు కోసం వచ్చాడని మాయా అనుకుంటుంది కానీ అతడికి వేరే ప్లాన్స్ ఉంటాయి.
ఆ సమయంలో తన కూతురు తారా సహాయంతో భర్త అజిత్ ని మాయా చంపేస్తుంది. అయితే ఆ మర్డర్ ని దాచడానికి మాయాకి నరేన్ హెల్ప్ చేస్తాడు. అసలు మయా ఎందుకు తన భర్త ని చంపింది, మరి మాయా, నరేన్ ఈ హత్యతో పోలీసులకు చిక్కుతారా, ఆపైన కథ ఏవిధంగా మలుపు తిరిగింది అనేది మొత్తం మూవీలో చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
జైదీప్ అహ్లావత్ తన ఆకట్టుకునే నటనతో ఆడియన్స్ ని అలరించారు. ముఖ్యంగా ఇందులో కీలకమైన అతడి పాత్ర ఆడియన్స్ ని అలరిస్తుంది. ఇక ఎప్పటి మాదిరిగా కరీనా కపూర్ మాయ పాత్ర ద్వారా ఆడియన్స్ మనసు దోచారు. కీలక సన్నివేశాలతో పాటు లాస్ట్ 40 నిమిషాల్లో ఆమె నటన టోటల్ సినిమాకి ప్రధాన హైలైట్ గా చెప్పుకోవాలి. ఇటువంటి క్రైమ్ థ్రిల్లర్ కి చిన్న టౌన్ సెటప్ తో వేసిన సెట్ ఎంతో బాగుంది. పోలీస్ ఆఫీసర్ గా విజయ్ వర్మ సూపర్ గా పెర్ఫార్మన్స్ చేసారు. ఈ సినిమాలో ఆయన విభిన్న పాత్ర ఆడియన్స్ ని అలరిస్తుంది.
మైనస్ పాయింట్స్ :
హెయిగో హిగాషినో రాసిన జపనీస్ నావెల్ ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్ ని బేస్ చేసుకుని జానే జాన్ తెరకెక్కినప్పటికీ ఇది గతంలో వచ్చిన క్రైమ్ యాక్షన్ మలయాళం మూవీ దృశ్యం కి కొంత ఇన్స్పిరేషన్ గా అనిపిస్తుంది. ముఖ్యంగా మర్డర్ ని దాచిపెట్టే సీన్స్ ని చూస్తే మనకు దృశ్యం సినిమా గుర్తుకు వస్తుంది. అందుకే మొదటి గంట సినిమా కొంతవరకు ఆ సినిమాని గుర్తు చేస్తుంది. మిగతా భాషల్లో కూడా దృశ్యం రీమేక్ కావడంతో ఇతర భాషల ఆడియన్స్ కి కూడా అదే గుర్తుకు వస్తుంది. కానీ జాన్ జాన్ లో పాత్రల యొక్క ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ తో పాటు చివరి పోర్షన్ సీన్స్ మాత్రం భిన్నంగా ఉంటాయి.
ఫస్ట్ హాఫ్ స్లో గా సాగుతుంది, ఎడిటింగ్ టీమ్ కొన్ని సీన్స్ ని కట్ చేస్తే బాగుండేదనిపిస్తుంది. అయితే కొన్ని ప్రశ్నలకు సమాధానం లేకుండానే సినిమా ముగుస్తుంది. అయితే అజిత్ మాత్రే పాత్ర మరింత డిటైల్డ్ గా రాసుకుని ఉంటె బాగుండేది.
సాంకేతిక వర్గం :
షోర్ పోలీస్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. అవిక్ ముఖోపాధ్యాయ్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. డైలాగ్స్ తో పాటు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. అయితే ఎడిటింగ్ డిపార్ట్ మెంట్ మాత్రం మరింత బాగా పనిచేయాల్సింది. ఇక దర్శకుడు సుజోయ్ ఘోష్ విషయానికి వస్తే జానే జాన్ తో అతడు ఓకె అనిపించేలా మాత్రమే వర్క్ చేసారు. నటుల నుండి మంచి నటనని రాబట్టారు, అలానే ఫైనల్ పోర్షన్స్ బాగున్నాయి.
జపనీస్ నవల ఆధారంగా తెరకెక్కినప్పటికీ దృశ్యం సినిమాని ఇది చాలా వరకు గుర్తుచేయడం ఒప్పుకోవాల్సిన విషయం. దర్శకుడు స్క్రీన్ ప్లే ని మరింత ఇంట్రెస్టింగ్ గా రాసుకుని ఉంటె బాగుండేది.
తీర్పు :
మొత్తంగా జానే జాన్ పర్వాలేదనిపంచే క్రైమ్ థ్రిల్లర్. ఇందులో చివరి 40 నిమిషాల పోర్షన్ బాగుంటుంది. ఇది జపనీస్ నవలని బేస్ చేసుకుని తెరకెక్కిన కూడా మలయాళ సూపర్ హిట్ మూవీ దృశ్యం ని గుర్తు చేస్తుంది. అయితే మేకర్స్ మరొక పాయింట్ తో సినిమా తీసి ఉంటె బాగుండేది. ఎందుకంటే చాలా సీన్స్ అందులో చూసినవిగా అనిపిస్తాయి. కరీనా కపూర్, జైదీప్ అహ్లావత్ మరియు విజయ్ వర్మ తమ నటనతో ఆకట్టుకున్నారు. ఇక వారి అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌తో పాటు, కొన్ని బాగా ఎగ్జిక్యూట్ చేయబడిన సన్నివేశాలు ఈ సినిమాని పర్వాలేదనిపించేలా చేశాయి.