God Father 2022 Telugu Movie Review

Godfater

గాడ్ ఫాదర్ మూవీ రివ్యూ – God Father Movie Review

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకుడిగా వచ్చిన చిత్రం ‘గాడ్ ఫాదర్’. భారీ అంచనాల మధ్య ఈ వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :




బ్రహ్మ (చిరంజీవి) తక్కువ సమయంలోనే రాష్ట్రంలో బలమైన వ్యక్తిగా ఎదుగుతాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి పి.కె.అర్ వెనుక అండగా నిలబడతాడు. అయితే, చిన్న తనం నుంచి పి.కె.అర్ కుమార్తె సత్యప్రియ (నయనతార) బ్రహ్మను ద్వేషిస్తూ ఉంటుంది. దాంతో తన భర్త జయ్ దేవ్ (సత్య దేవ్) ను ముఖ్యమంత్రి చేయాలని ప్రయత్నం చేస్తోంది. మొత్తానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు ? అనే నేపథ్యంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య బ్రహ్మ ఏం చేశాడు ?, అసలు బ్రహ్మ ఎవరు ?, గాడ్ ఫాదర్ గా అతని గత జీవితం ఏమిటి?, ఈ మధ్యలో మసూన్ భాయ్ (సల్మాన్ ఖాన్) పాత్ర ఏమిటి ?, చివరకు బ్రహ్మ ఎవర్ని ముఖ్యమంత్రిని చేశాడు? దాని కోసం ఎలాంటి పరిస్ధితులను ఎదురుకున్నాడు? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర పై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

గాడ్ ఫాదర్ గా, బ్రహ్మ గా నటించిన మెగాస్టార్ చిరంజీవి ఎప్పటిలాగే తన నటనతో ఈ సినిమాలో ఉత్తమమైన నటనను కనబర్చారు. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ అండ్ యాక్షన్ సన్నివేశాల్లో అలాగే క్లైమాక్స్ లో తీవ్రమైన భావోద్వేగాలను పండించిన ఆయన నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. ముఖ్యమంత్రి కుమార్తెగా నటించిన నయనతార తన నటనతో కీలకమైన తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా కొన్ని కీలకమైన దృశ్యాల్లో ఆమె నటన ఆకట్టుకుంటుంది.

ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించిన సత్యదేవ్ ఎప్పటిలాగే తన నటనతో మెప్పించాడు. ముఖ్యంగా తన నిజ స్వరూపం గురించి నయనతార కు చెప్పే సన్నివేశంలో సత్యదేవ్ నటన చాలా బాగుంది. అతిధి పాత్రలో నటించిన సల్మాన్ ఖాన్ తన యాక్షన్ తో అదరగొట్టాడు. మాస్ ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇచ్చాడు. సునీల్, బ్రహ్మాజీ కూడా తమ పాత్రల్లో చక్కగా నటించారు.

మురళీమోహన్, అనసూయ అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే చేశారు. దర్శకుడు మోహన్ రాజా సినిమాలో చెప్పాలనుకున్న స్టోరీ థీమ్ బాగుంది. అలాగే ఆయన టేకింగ్ కూడా చాలా బాగుంది.

మైనస్ పాయింట్స్ :




మోహన్ రాజా మంచి స్టోరీ థీమ్ తీసుకున్నప్పటికీ.. టిపికల్ నేరేషన్ తో, కొన్ని చోట్ల ఈ పొలిటికల్ డ్రామాను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా మలచలేకపోయారు. అయితే కొన్ని ఎమోషనల్‌ సన్నివేశాలతో దర్శకుడు ఆకట్టకునే ప్రయత్నం చేసినప్పటికీ.. సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు స్లోగా సాగుతాయి.

ఇక కంటెంట్ మరియు ఆర్టిస్ట్ ల పరంగా చూసుకుంటే సినిమా మీద ప్రేక్షకుడికి పూర్తి స్థాయిలో ఇంట్రస్ట్ పుట్టించే స్కోప్ ఉన్నపటికీ దర్శకుడు ఆ ఎలిమెంట్స్ ను వదిలేసి అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపేశాడు. మొత్తానికి సినిమా నిండా ఎమోషన్ ఉన్నా.. ప్రేక్షకుడు ఇన్ వాల్వ్ అయ్యే విధంగా మాత్రం, ఆ ఎమోషన్ సరిగ్గా ఎలివేట్ కాలేదు.

♦ ట్రైలర్ : గాడ్ ఫాదర్ – చిరంజీవి, నయనతార – 05/10/2022 – God Father Trailer – Chiranjeevi, Nayanthara

సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. ముందే చెప్పుకున్నట్లు దర్శకుడు మోహన్ రాజా టేకింగ్ బాగుంది. అయితే, మంచి కంటెంట్ తీసుకున్నా దాన్ని పూర్తిగా వాడుకోలేకపోయారు. ఆయన రాసిన స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల స్లోగా సాగుతుంది. సంగీత దర్శకుడు థమన్ ఎస్ అందించిన సంగీతం పర్వాలేదు. ఐతే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కొన్ని కీలక సన్నివేశాల్లో అక్కట్టుకున్నేలా ఉంది. నీరవ్ షా సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. ఇక ఎడిటర్ ఎడిటింగ్ వర్క్ కూడా పర్వాలేదు. నిర్మాత పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

తీర్పు :

గాడ్ ఫాదర్ అంటూ వచ్చిన ఈ పొలిటికల్ డ్రామా బాగానే ఆకట్టుకుంది. మెగాస్టార్ చిరంజీవి తన నటనతో సినిమా స్థాయిని పెంచారు. నయనతార, సల్మాన్ ఖాన్ ఈ సినిమాకి ప్లస్ అయ్యారు. కానీ కొన్ని చోట్ల స్లో నేరేషన్, బోరింగ్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ పొలిటికల్ డ్రామాలో కొన్ని ఎలిమెంట్స్ మాత్రం బాగా ఆకట్టుకుంటాయి. మెగా ఫ్యాన్స్ కి ఈ సినిమా ఫుల్ మాస్ మీల్స్ లాంటిది.

English Review