యురేక మూవీ రివ్యూ – Eureka Movie Review
కార్తీక్ ఆనంద్,డింపుల్ హయతి, సయ్యద్, సోహైల్ రియాన్, షాలిని, ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘యురేక’. కార్తీక్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.
కథ :
కాలేజీ లో యువ (కార్తీక్ ఆనంద్), రేవంత్ (మున్నా) ల మధ్య ఆధిపత్య పోరు నడుస్తూ ఉంటుంది. తరచుగా వీరి గ్యాంగ్స్ మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. కాలేజ్ వార్షికోత్సవం నాడు వీరి మధ్య గొడవ తారాస్థాయికి చేరుతుంది. కొన్ని నాటకీయ పరిణామాలనంతరం వీరి కథలో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. ఏమిటా ట్విస్ట్? యువ, రేవంత్ ల కథ ఎలా ముగిసింది? అనేది మిగతా కథ..
ప్లస్ పాయింట్స్ :
ఇంటర్వెల్ ట్విస్ట్ అనేది సినిమాకు హైలెట్ అని చెప్పాలి. ప్రేక్షకుల ఊహకు అందకుండా సాగిన ఆ సన్నివేశం మంచి అనుభూతి పంచుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో సస్పెన్సు సన్నివేశాలను తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంది.
హీరోలుగా చేసిన కార్తీక్ ఆనంద్ మరియు మున్నాల స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. ముఖ్యంగా కార్తీక్ ఆనంద్ మేక్ ఓవర్ అండ్ లుక్ చాల బాగుంది.
హీరోయిన్స్ గా నటించిన షాలిని, డింపుల్ హయాతి పరవాలేదనిపించారు. షాలిని కథలో కీలకమైన రోల్ దక్కించుకోగా, డింపుల్ హయాతి మున్నా గర్ల్ ఫ్రెండ్ రోల్ చాల క్యూట్ గా అనిపించింది. ఇక కాలేజీ ప్రొఫెసర్ గా బ్రహ్మాజీ రోల్ తెరపై నవ్వులు పంచింది. నటుడు రఘు బాబు, పెళ్లి చూపులు ఫేమ్ అజయ్ తమ పాత్రల పరిధిలో చక్కగా నటించారు.
మైనస్ పాయింట్స్
ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ పరవాలేదు అనిపించినప్పటికీ లాజిక్ లేని సన్నివేశాలతో సాగింది. డెడ్ బాడీ ని కాలేజీ ఆఫీస్ లో దాచిపెట్టడం వంటివి ఆ కోవకు చెందినవే.
ఇక కాలేజీ బ్యాక్ డ్రాప్ తో నడిచే కథలు జోష్ ఫుల్ సాంగ్స్ కానీ, లీడ్ పెయిర్ మధ్య ఆహ్లాదకరమైన రొమాన్స్ లేకపోవడం నిరాశపరిచే అంశం.
సినిమా ఇంటర్వెల్ వరకు ఎంటువంటి మలుపులు ఆసక్తికర అంశాలు లేకుండా ఫ్లాట్ గా సాగిపోతుంది. కథలోని పాత్రల మధ్య బలమైన సంఘర్షణ లేకపోవడం వలన ప్రేక్షకుడు సినిమాలో సీరియస్ గా ఇన్వాల్వ్ కాలేడు.
సాంకేతిక విభాగం :
హీరోగా దర్శకుడిగా రెండు భాద్యతలు తీసుకున్న కార్తీక్ ఆనంద్ పూర్తి స్థాయిలో విజయం సాధించలేకపోయారు. తాను ఎంచుకున్న కథను విస్తృతంగా చెప్పగల పరిధి ఉన్నప్పటికీ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు. ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే కథను ఆసక్తికరంగా మలచలేకపోయింది.
ఇక సంగీతం బాగుంది, ముఖ్యంగా బీజీఎమ్ చాల సన్నివేశాలకు ఆకర్షణ చేకూర్చింది. ఎడిటింగ్ ఆకట్టుకోదు. మొదటి సగంలో కొన్ని సన్నివేశాలు తగ్గించాల్సింది. కేమెరా పనితనం పరవాలేదు. ఇక నిర్మాణ విలువలు ఓ చిన్న సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
తీర్పు :
మొత్తం మీద, ఓ మర్డర్ మిస్టరీ చుట్టూ సాగిన ఈ చిత్రం.. రెండవ భాగంలో కొన్ని సీన్స్ తో ఆకట్టుకుంది. అయితే బోరింగ్ ప్లేతో పాటు చాలా సన్నివేశాల్లో కనీస ఇంట్రస్ట్ లేకపోవడంతో సినిమా పై ప్రేక్షకుల ఉన్న ఆసక్తిని నీరుగారుస్తోంది. ఓవరాల్ ఈ సినిమా ఆకట్టుకోదు.