Degree College 2020 Telugu Movie Review

Degree

డిగ్రీ కాలేజ్ మూవీ రివ్యూ – Degree College Movie Review




వరుణ్, దివ్యా రావు జంటగా దర్శకుడు నరసింహ నంది తెరకెక్కించిన చిత్రం డిగ్రీ కాలేజ్. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం నేడు విడుదలైంది. మరి ఈ చిత్రం ఎంత వరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో సమీక్షలో చూద్దాం




కథ :

శివ (వరుణ్) పార్వతి (దివ్యా రావు) ఒకే కాలేజీలో చదువుకుంటారు. పేదవాడైన తక్కువ వర్గానికి చెందిన శివ హోదా పలుకుబడి కలిగిన పోలీస్ అధికారి కూతురు పార్వతిని ప్రేమిస్తాడు. ఈ విషయం తెలిసిన పార్వతి తండ్రి వీరి ప్రేమను వ్యతిరేకిస్తాడు. దీనితో శివ పార్వతి లేచి పోయి పెళ్లి చేసుకుంటారు. దీనితో రగిలిపోయిన పార్వతి తండ్రి తీవ్రంగా వెతికి కూతురు పార్వతిని పట్టుకొస్తాడు. మరి శివ మళ్ళీ ఆమెను కలిశాడా? పార్వతి తండ్రి మనసు మారిందా? వీరిద్దరి ప్రేమ కథ ఎలా ముగిసింది? అనేది తెరపైన చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో హీరోయిన్ దివ్యా రావ్ నటన స్క్రీన్ ప్రెజెన్స్ హైలైట్ అని చెప్పాలి. తెలంగాణా స్లాంగ్ లో ఆమె డైలాగ్స్ తోపాటు, బోల్డ్ ఇంటిమసీ సన్నివేశాలలో ఆమె నటన ఆకట్టుకుంటుంది. దివ్యా రావ్ పార్వతి పాత్రలో చాల క్యూట్ గా ఉన్నారు. ఇక హీరో వరుణ్ నటనలో పర్వాలేదు అనిపించారు. ఆయన నటన పరంగా ఇంకొంత పరిపక్వత సాధించాలని అనిపిస్తుంది.

సినిమాలో హీరో హీరోయిన్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ మరియు ఇంటిమసీ సాంగ్ ఆహ్లాదం కలిగించాయి.

బాడ్ పోలీస్ అధికారిగా హీరోయిన్ తండ్రి పాత్ర చేసిన నటుడు, అలాగే హీరో హీరోయిన్ స్నేహితుల పాత్రలు చేసిన వారు ఆకట్టుకున్నారు.




మైనస్ పాయింట్స్ :

ఈ మూవీ ప్రధాన బలహీనత నెమ్మదిగా సాగే కథనం, మరియు కొత్తదనం లేని కథ అని చెప్పాలి. పేద ధనిక వర్గానికి చెందిన వారు ప్రేమలో పడటం, వారి ప్రేమను పెద్దలు వ్యతిరేకించడం అనేది అనేక సినిమాలో ఇప్పటికే చూడడం జరిగింది.

హీరో హీరోయిన్ పాత్రలను కొత్తగా మరియు ఆహ్లాదంగా పరిచయం చేయడంతో ఓ కొత్త తరహా మూవీ చూడబోతున్నాం అనే ఆలోచన కలుగుతుంది. ఐతే సినిమా నేపథ్యం వరంగల్ డిగ్రీ కాలేజ్ కి మారాక పూర్తిగా గతి తప్పుతుంది.

ఇక రొమాంటిక్ సన్నివేశాలు చాలా వరకు అర్జున్ రెడ్డి మూవీ స్పూర్తితో తెరకెక్కించారనిపిస్తుంది. అలాగే ఈ చిత్ర పతాక సన్నివేశం కూడా వాస్తవానికి దూరంగా లాజిక్ లేకుండా సాగుతుంది.

సాంకేతిక విభాగం :

పేద ధనిక వర్గాల మధ్య ప్రేమ, దీనివలన ఎదురయ్యే సమస్యలు అనే ఆసక్తికరమైన పాయింట్ తీసుకున్నటికీ ఇదివరకే అనేక సినిమాలు ఇదే పాయింట్ పై రావడంతో కొత్తగా ఏమి అనిపించదు. ఆయన ఈ సినిమాకు రాసుకున్న స్క్రీన్ ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది.

నిర్మాణ విలువలు పర్వాలేదు. సునీల్ కశ్యప్ సంగీతం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఆయన ఇచ్చిన బీజీఎమ్ సన్నివేశాలను ఎలివేట్ చేసింది. వి నాగిరెడ్డి ఎడిటింగ్, మురళి మోహన్ రెడ్డి సినిమాటోగ్రఫీ పర్వాలేదు.

తీర్పు :

సొసైటీ లో ధనిక పేద వర్గాల మధ్య అంతరాలు వంటి సోషల్ కాన్సెప్ట్ తీసుకున్న దర్శకుడు నెమ్మదిగా సాగే కథనంతో ప్రేక్షకులకు ఆహ్లాదం పంచలేకపోయాడు. దివ్యా రావ్ నటన, హీరో హీరోయిన్ మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు ఈ సినిమాలో చెప్పుకోదగ్గ అంశాలు. కొత్తదంలేని కథకు దర్శకుడి బోరింగ్ ట్రీట్మెంట్ సినిమా ఫలితాన్ని దెబ్బతీసింది. డిగ్రీ కాలేజ్ మూవీ మొత్తంగా అంత ఆసక్తిగా సాగలేదు.

English Review