Dandupalyam 4 2019 Telugu Movie Review

Dandupalyam 4

దండుపాళ్యం 4 మూవీ రివ్యూ ఆడియో – Dandupalyam 4 Movie Review Audio




 

2012లో వచ్చిన దండుపాళ్యం సిరీస్ లో నాలుగవ భాగమైన దండుపాళ్యం 4 నేడు విడుదలైంది. యదార్ధ ఘటనల ఆధారంగా తెరకెక్కే ఈ క్రైమ్ డ్రామాకు కన్నడ తో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ఐతే సాంకేతిక నిపుణులతో పాటు కొత్త నటులతో తెరకెక్కిన దండుపాళ్యం 4 ప్రేక్షకుల అంచనాలు ఏ మేరకు అందుకుందో సమీక్షలో చూద్దాం.

కథ :

సుందరి (సుమన్ రంగనాథన్) అనే లేడీ బాస్ నేతృత్వం లోని ఎనిమిది మంది సభ్యుల దోపిడీ ముఠా ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళ పై దాడి చేసి పాశవికంగా వారి ధన, మాన ప్రాణాలు దోచుకుంటూ ఉంటారు. గతంలో ఇలాగే నేరాలు చేసి జైలు జీవితం గడుపుతున్న వారి గ్రూప్ సభ్యులను కాపాడు కోవడం కోసం, లాయర్ ఫీజులు చెల్లించడం కొరకు వీరు ఈ నేరాలకు పాల్పడుతూ ఉంటారు. వీరి నేరాలు మితిమీరి పోవడంతో కమీషనర్, అశోక్ కుమార్ అనే స్పెషల్ అధికారిని నియమించి వారిని పట్టుకోవాల్సినదిగా ఆదేశాలు జారీ చేస్తాడు. అశోక్ కుమార్ ఈ గ్యాంగ్ ని పట్టుకున్నాడా? ఈ గ్యాంగ్ ఎటువంటి నేరాలు చేశారు? ఈ గ్యాంగ్ అరాచకాలకు ఆ పోలీస్ ఎలా అడ్డుకట్ట వేశాడు? చివరికి ఈ గ్యాంగ్ కథ ఎలా ముగిసింది? అనేది మిగతా స్టోరీ.

ప్లస్ పాయింట్స్ :

ఈ మూవీలో ఆకట్టుకొనే అంశం ఏదైనా ఉందంటే అది క్రిమినల్ గ్యాంగ్ నటన అని చెప్పొచ్చు.గ్యాంగ్ లో ప్రధాన పాత్ర పోషించిన సుమన్ రంగనాధన్ నీచ సంస్కృతి, అలవాట్లు కలిగిన మహిళగా మెప్పించింది.గత చిత్రాలలో చేసిన పూజ గాంధీకి ఏమాత్రం తీసిపోకుండా ఆమె నటించారు.

గ్యాంగ్ లోని ఐదుగురు మగవాళ్ళు దయ, కరుణ లేని మృగాలుగా వారి నటన కాన్సెప్ట్ కి దగ్గరగా సహజంగా ఉంది.నేరాలు చేస్తున్నప్పుడు కానీ, మిగతా సన్నివేశాలలో అసలు నటులను చూస్తున్న భావన కలగదు. అంత సహజంగా వారి నటన సాగింది.తెలుగు సీనియర్ నటుడు బెనర్జీ ఆ దోపిడీ గ్యాంగ్ కి సహకరించే కాళీ పాత్రలో పర్వాలేదనిపించారు.

కథకు తగ్గట్టుగా లొకేషన్స్ ఎంచుకున్న తీరు బాగుంది.సెకండ్ హాఫ్ లో వచ్చే మొమైత్ ఖాన్ ఐటమ్ సాంగ్ హాట్ హాట్ గా ఫాస్ట్ బీట్ లో అలరిస్తుంది.




మైనస్ పాయింట్స్ :

దండుపాళ్యం సిరీస్ లో వచ్చిన సినిమాలలో మొదటి భాగం తరువాత వచ్చిన చిత్రాలు ఆదరణ దక్కించుకున్నప్పటికీ ఆ స్థాయి విజయం అందుకోలేదు.దానికి కారణం మొదటి భాగం అనేది అప్పటి వరకు ప్రేక్షకులకు తెలియని నేర ప్రవృత్తిని, భయంకరమైన ఓ గ్యాంగ్ దోపిడీలను కళ్ళకు కట్టినట్టుగా చూపించింది.అంత మాత్రాన పదే పదే అదే చూపిస్తే జనాలకు విసుగు పుడుతుంది.

గత చిత్రాలకు మించి ఘోరంగా మర్డర్ లు, మాన భంగాలు చూపిస్తే చాలు జనాలకు నచ్చుతుంది అన్నరీతిలో జుగుప్సాకరం దోపిడీ సన్నివేశాలు తెరకెక్కించాడు.ముఖ్యంగా మానభంగాలు ఒక స్థాయి ప్రేక్షకులు చూడలేని రీతిలో ఉన్నాయి.

ఒక ప్రణాళిక లేకుండా బుద్ధిపుట్టినప్పుడల్లా హత్యలు చేసే ముఠా పదుల సంఖ్యలో నేరాలు చేస్తున్నప్పటికీ పోలీసులు పట్టుకోలేకపోవడం అతిశయోక్తి అనిపిస్తుంది.ఇంతటి ఆధునిక పరిజ్ఞానం, సాంకేతిక ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వారిని పట్టుకొనడానికి తలలు పట్టుకోవడం విడ్డురం. వరుస నేరాలు చేస్తున్న వారి వెనుక నిస్సహాయులుగా పోలీస్లు పడటం నవ్వుతెప్పిస్తుంది.

గత చిత్రాలలో ఉన్న స్టార్ క్యాస్ట్ పూజ గాంధీ, మార్కండ్ దేశ్ పాండే, రవి కాలే వంటి నటులు లేకపోవడం మరొక మైనస్ గా చెప్పవచ్చు. నటుడు రవి శంకర్ ని కూడా కొద్ది సన్నివేశాలకు పరిమితం చేశారు.

సాంకేతిక విభాగం :

గతంలో దండుపాళ్యం చిత్రాలకు శ్రీనివాస రాజు దర్శకత్వం వహించగా ఈ సారి ఆ బాధ్యతను కె టి నాయక్ తీసుకున్నారు. కానీ ఈ చిత్రంలో దర్శకత్వ ప్రతిభ ఏ కోశాన కనిపించదు. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ మొత్తం గ్యాంగ్ అకృత్యాలతో చుట్టిపడేశాడు.ఎటువంటి లాజిక్ లేకుండా పోలీసులను ముప్పతిప్పలు పెట్టే ఇంటెలిజెంట్ గ్యాంగ్ గా నరరూప రాక్షసులుగా చూపించారు. విసుగు పుట్టించే స్క్రీన్ ప్లే తో సినిమా తెరకెక్కించాడు.

ఇక సినిమాటోగ్రఫీ పరవాలేదు.ఎడిటింగ్ చాలా ఘోరంగా ఉంది. సంగీత దర్శకుడు ఆనంద్ రాజ విక్రమన్ స్వరాలు ఏమంతగా అలరించవు. బీజీఎమ్ కూడా చాలా ఆర్డినరీగా ఉంది.

తీర్పు :

గత మూడు చిత్రాలు చూసిన ప్రేక్షకులకు దండుపాళ్యం 4లో ఆస్వాదించాడని కొత్తగా ఏమీలేదు, మితిమీరిన మానభంగ సన్నివేశాలు మర్డర్ లు తప్ప. మోతాదుకు మించిన దోపిడీ సన్నివేశాలు ఏమంత ఆహ్లాదం కలిగించవు. ఒక స్థాయి ప్రేక్షకులు తట్టుకోలేనంత వయిలెన్స్ తో ఈ చిత్రాన్ని దర్శకుడు దట్టించి తీశారు. పాత్రల తీరు, సహజమైన చిత్రీకరణ మాత్రం ఆకట్టుకుంటుంది. దానికి మించి దండుపాళ్యం 4 లో కొత్తగా చూడాల్సిన సంగతులేవి లేవు.

English Review