Check 2021 Telugu Movie Review

Check

చెక్ మూవీ రివ్యూ – Check Movie Review

“భీష్మ” సినిమాతో కమెర్షియల్ గా మంచి హిట్ తో కం బ్యాక్ ఇచ్చిన యూత్ స్టార్ నితిన్ ఇప్పుడు ప్రయోగాత్మక చిత్ర దర్శకుడు చంద్రశేఖర్ యేలేటితో చేసిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ “చెక్” తో ముందుకొచ్చారు. రకుల్ ప్రీత్ మరియు ప్రియా ప్రకాష్ వారియర్ లు కీలక పాత్రల్లో నటించిన ఈ థ్రిల్లర్ చిత్రం ఎంత వరకు ప్రేక్షకులను మెప్పించిందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

కథ :




కథలోకి వెళ్లినట్టయతే ఆదిత్య(నితిన్) కు అలాగే మరికొంత మందికి ఓ కేసు విషయంలో న్యాయ స్థానం ఉరి శిక్షను విదిస్తుంది. మరి ఇక్కడ ఓ జైలుకు ఆదిత్య తరలించబడతాడు. ఆ జైలులో తన సహచర ఖైదీగా చెస్ ఆటలో ప్రావీణ్యం కలిగిన నటుడు సాయి చంద్ పరిచయం అవుతాడు. వీరి కలయిక తర్వాత నుంచి ఆదిత్య అంచెలంచెలుగా ఓ ఖైదీగానే చెస్ లో ఎలా ఎదుగుతాడు? అసలు అతను చేసిన నేరం ఏంటి? ఈ కథలో ప్రియా ప్రకాష్ రోల్ కు ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంది? అలాగే రకుల్ పాత్ర ఎలాంటి మలుపులు తిప్పింది? చివరిగా ఆదిత్య కేసు ఏమయ్యింది అన్న ప్రశ్నలకు యేలేటి ఎలా సమాధానం ఇచ్చారో తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :

మొదటి నుంచీ కూడా ఈ పర్టిక్యులర్ కాంబో పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా అయితే యేలేటి టేకింగ్ కోసమే చర్చ అంతా..మరి ఈ అంచనాలను యేలేటి అంచెలంచెలుగా టేక్ చేసారని చెప్పాలి. ఇక అలాగే నితిన్ ఈ ప్రయోగాత్మక చిత్రంలో మరింత పరిణితి చెందిన నటనను కనబరిచాడు. ఓ చెస్ ఇంటెలిజెన్స్ లానే కాకుండా ఖైదీగా ఎండింగ్ వరకు కూడా మంచి సెటిల్డ్ నటనతో ఆకట్టుకుంటాడు. అలాగే కొన్ని యాక్షన్ సీన్స్ లో కూడా బాగా కనిపించాడు.

ఇక రకుల్ అయితే ఇప్పటి వరకు చేసిన రోల్స్ కన్నా ఇది కాస్త భిన్నంగా అనిపిస్తుంది. తన నటనకు మంచి స్కోప్ కూడా ఇందులో కనిపిస్తుంది. లాయర్ గా తాను ఎంటర్ అయ్యిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు మంచి నటనను ఆమెలో మనం చూస్తాం. మరో హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ కనిపించింది కాసేపే అయినా తన గ్లామర్ మరియు సినిమాలో కీలక పాయింట్ తో ఆకట్టుకుంటుంది. నటుడు సాయి చంద్, సంపత్ లు కూడా మంచి రోల్స్ లో కనిపించడమే కాకుండా ఆ రోల్స్ కు వారు పూర్తి న్యాయం చేశారు.

మొదట్లో చెప్పుకున్నట్టుగానే యేలేటి ఎంచుకున్న స్క్రిప్ట్ ఒకింత ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. అంతే కాకుండా ఇంటర్వెల్ ట్విస్ట్ నుంచి సెకండాఫ్ కు వచ్చిన తర్వాత నుంచి సినిమా మరింత ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. ముఖ్యంగా కథానుసారం వచ్చే ట్విస్టులు అయితే ఇంప్రెసివ్ గా అనిపిస్తాయి. అలాగే మొదటి నుంచి హైలైట్ చేసిన చెస్ ఛాంపియన్ ఎపిసోడ్ సీక్వెన్స్ లు అయితే మాంచి ఆసక్తికరంగా కూడా అనిపిస్తాయి. వాటికి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాటిని మరింత ఎలివేట్ చేస్తుంది.

మైనస్ పాయింట్స్ :




ఇక ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే..ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ పై తెచ్చిన హైప్ ను సినిమా చూసాక పూర్తి స్థాయిలో అందుకోలేదని అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి థ్రిల్లింగ్ ఎక్స్ పెరిమెంట్స్ వచ్చినపుడు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రతీ నిమిషం థ్రిల్ చేసే ఎలిమెంట్స్ ను ఆశిస్తారు కానీ ఇందులో సినిమా స్టార్టింగే కాస్త స్లో గా ఉంటుంది.

ఇంటర్వెల్ వరకు వచ్చేసరికి సోసో గానే అనిపిస్తుంది. దీనితో ఎక్కువగా అంచనాలు పెట్టుకున్నవారికి ఆ అంచనాలు రీచ్ అవ్వలేదు అనిపిస్తుంది. అలాగే ఇందులో మరో పెద్ద డ్రా బ్యాక్ ఏంటి అంటే సినిమా అంతా కూడా ఒకే సీరియస్ టోన్ లో అనిపిస్తుంది కానీ ఎక్కడా బలమైన ఎమోషన్స్ కనిపించవు పైగా కాస్త బోరింగ్ అనిపించే సీన్స్ కొన్ని పాత్రల అనవసరపు ఫోర్సెడ్ నటన ఇవన్నీ ఖచ్చితమైన నిరాశ పరిచే అంశాలే..

మరి వీటితో పాటుగా క్లైమాక్స్ కాస్త భిన్నంగా అనిపిస్తుంది కానీ అది కూడా ఏదో కావాలని కల్పించి పెట్టినట్టు అనిపిస్తుంది. అలాగే కొన్ని జైల్లోని సన్నివేశాలు కాస్త బోరింగ్ సన్నివేశాలను కట్ చేసి ఉంటే బాగుండేది. ముఖ్యంగా అయితే ఇంకా ఏదో మిస్సవుతున్నట్టు కూడా అనిపిస్తుంది.

సాంకేతిక వర్గం :

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు ఓవరాల్ గా ఓకే అనిపించే స్థాయిలో ఉంటాయి. ఆ జైలు సెటప్ మరియు కోర్ట్ సెటప్ అంతా పర్వాలేదనిపిస్తాయి. అలాగే కళ్యాణి మాలిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అక్కడక్కడా మంచి ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ, డైలాగ్స్ నీట్ గా అనిపిస్తాయి. కానీ ఎడిటింగ్ విషయంలో మేకర్స్ కాస్త జాగ్రత్త వహించి కొన్ని సన్నివేశాలను తగ్గించి ఉంటే బెటర్ అవుట్ ఫుట్ వచ్చి ఉండేది.

ఇక దర్శకుడు చంద్ర శేఖర్ యేలేటి విషయానికి వస్తే..మొదట్లో చెప్పినట్టుగా తన డైరెక్షన్ మరియు టేకింగ్ పై ఎక్కువ అంచనాలు పెట్టుకుంటే వాటిని అందుకోవడంలో కాస్త నిరాశ ఎదుర్కోవడం తప్పదని చెప్పాలి. నటీ నటుల నుంచి మంచి నటనను రాబట్టారు, ట్విస్టులు సహా స్క్రీన్ ప్లే బాగున్నా ఇంతకు ముందు సినిమాల్లో కనిపించిన మ్యాజిక్ ఇందులో మిస్ అవుతున్నామన్న భావన ఆడియెన్స్ లో కలుగుతుంది.

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే స్పోర్ట్స్ అండ్ క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ “చెక్” కాస్త స్లో స్టార్ట్ తీసుకున్నా నితిన్ మరియు రకుల్ ల నటన అక్కడక్కడా ఆకట్టుకునే కథనం మరియు ట్విస్టులు వాటిని డిజైన్ చేసిన విధానం చాలా బాగుంటుంది. కానీ సరైన ఎమోషన్స్ లేకపోవడం కొన్ని బోరింగ్ సన్నివేశాలు మినహాయిస్తే ఈ కాంబో పై ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా చూస్తే ఈ వారాంతానికి అయితే చెక్ మంచి ఛాయిస్ గా నిలుస్తుంది.

English Review