అశ్వథామ మూవీ రివ్యూ – Aswathama Movie Review
నాగ శౌర్య, మెహ్రిన్ పిర్జా జంటగా దర్శకుడు రమణ తేజ తెరకెక్కించిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ అశ్వథామ. తన గత చిత్రాలకు భిన్నంగా నాగ శౌర్య ఓ సీరియస్ మాస్ ఎంటర్టైన్మెంట్ తో ముందుకు వచ్చారు. మరి ఈ చిత్రం ఎంత వరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో సమీక్షలో చూద్దాం
కథ :
చెల్లి ప్రియ(సర్గన్ కౌర్) అంటే అమితంగా ప్రేమించే అన్నయ్య గణ(నాగ శౌర్య)కి ఆమె పెళ్ళికి ముందే గర్భవతి అని తెలిసి షాక్ కి గురవుతాడు.ఐతే ఆమె గర్భానికి కారణం ఎవరో ప్రియకే తెలియకపోవడంతో అందుకు కారణమైన వాడిని పట్టుకొనే క్రమంలో కొన్ని షాకింగ్ నిజాలు తెలుసుకుంటాడు. వైజాగ్ వేదికగా అనేక మంది ఆడపిల్లలు కిడ్నాప్ అవుతూ ఉంటారు.ఇది తెలుసుకున్న గణ ఆ కిడ్నాప్ లు ఎందుకు జరుగుతున్నాయి అని తెలుసుకున్నాడా? ఈ కిడ్నాప్ల వెనుక ఎవరు వున్నారు? వాళ్లు ఎందుకు అమ్మాయిలను కిడ్నాప్ చేస్తున్నారు? మరి గణ వాళ్ళని పట్టుకొని శిక్షించాడా? అనేది తెరపైన చూడాలి.
ప్లస్ పాయింట్స్ :
తన ఇమేజ్ కి భిన్నంగా ఓ మాస్ రోల్ ట్రై చేసిన నాగ శౌర్య చాలా వరకు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. సాలిడ్ బాడీ తో యాక్షన్ సన్నివేశాలలో ఇరగదీసిన ఆయన, సీరియస్ ఎమోషనల్ సన్నివేశాలలో కూడా డిఫరెంట్ మేనరిజం తో అలరించారు. మాస్ హీరోగా నిరూపించుకోవాలన్న ఆయన ప్రయత్నం సఫలం అయ్యిందనే చెప్పాలి. అశ్వథామ చిత్రంలో యాక్షన్ చెప్పుకోదగ్గ అంశం. ఫస్ట్ హాఫ్ లో వచ్చే యాక్షన్ సన్నివేశాలతో పాటు క్లైమాక్స్ లో మెయిన్ విలన్ తో ఫైట్ సీన్ ఆకట్టుకుంది.
ఓ క్రైమ్ థ్రిల్లర్ ని దర్శకుడు చాలా వరకు కన్వీన్సింగ్ గా తీశాడు.తాను చెప్పాలనుకున్న స్టోరీని ఎక్కడా డీవియేట్ కాకుండా తెరకెక్కించిన విధానం బాగుంది. మొదటి సగంలో సస్పెన్సు క్యారీ చేసిన విధానం బాగుంది. ఇక ఈ చిత్రంలో విలన్ గా చేసిన బెంగాలీ నటుడు జిష్షు సేతు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. కామాంధుడైన సైకో విలన్ గా ఆయన నటన కట్టిపడేసింది.సెకండ్ హాఫ్ ని చాలా వరకు ఆయన నటన నడిపించింది. అయన బాడీ లాంగ్వేజ్ కి హేమ చంద్ర వాయిస్ బాగా సరిపోయింది.
హీరోయిన్ మెహ్రిన్ కి కథ రీత్యా నటనకు అంత స్కోప్ లేకపోయినా ఉన్న పరిధిలో చక్కగా నటించారు. పోలీస్ గా పోసాని, హీరో ఫ్రెండ్ పాత్రలో కనిపించిన సత్య, బావగా నటించిన ప్రిన్స్ తో పాటు సపోర్టింగ్ రోల్స్ చేసిన అందరు నటులు ఆకట్టుకున్నారు. ఇక చివరిగా హీరో చెల్లి పాత్ర చేసిన సర్గన్ కౌర్ నటన ఎమోషనల్ సన్నివేశాల్లో ఆకట్టుకుంది.
మైనస్ పాయింట్స్ :
మంచి సస్పెన్సు ఫ్యాక్టర్ తో మొదటిసగం ముగించిన దర్శకుడు సెకండ్ హాఫ్ ప్రారంభంలోనే సస్పెన్సు రివీల్ చేసి ప్రేక్షకుల ఆసక్తిని చంపివేశారు. అసలు అమ్మాయిలను ఎవరు కిడ్నాప్ చేస్తున్నారు, ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు అనే విషయం ముందుగానే తెలిసేలా చేయడం వలన సస్పెన్సు థ్రిల్లర్ కి కావలసిన సీక్రెసీ లేకుండా పోయింది.
ఇక మొదటి సగంలో అలరించిన యాక్షన్ సీక్వెన్స్ లు సెకండ్ హాఫ్ లో లేవు. కేవలం క్లైమాక్స్ ఫైట్ మినహా యాక్షన్ మిస్సయింది.
హీరోయిన్ మెహ్రిన్ కి కనీస ప్రాధాన్యత లేకపోవడం కూడా ఒక మైనస్.ఆమెను కేవలం రెండు పాటలకు, కొన్ని సన్నివేశాలకు పరిమితం చేశారు.
సెకండ్ హాఫ్ మొత్తం విలన్ క్యారెక్టర్ పై దృష్టి పెట్టిన దర్శకుడు హీరో.. విలన్ ని పట్టుకోవడానికి చేసే ఇన్వెస్టుగేషన్ సన్నివేశాలు ఇంకా కొంచెం లాజికల్ గా ఆసక్తికరంగా రాసుకోవాల్సింది. అసలు తన గురించి ఎవరికీ తెలియకూడదు అనుకునే విలన్, చంపిన శవాలు పోలీస్ స్టేషన్ ముందు ఎందుకు పడవేపిస్తాడో అర్థం కానీ అంశం.
పోసాని, సత్య, జయ ప్రకాష్ వంటి టాలెంటెడ్ యాక్టర్స్ ని సరిగా ఉపయోగించుకోకపోవడం, హీరో హీరోయిన్ మధ్య సరైన కెమిస్ట్రీ లేకపోవడం మైనస్ గా చెప్పవచ్చు.
సాంకేతిక విభాగం :
అశ్వథామ చిత్రానికి శ్రీచరణ్ పాకాల అందించిన పాటలు పరవాలేదు. అలాగే జిబ్రాన్ బీజీఎమ్ కూడా బాగుంది. మనోజ్ రెడ్డి కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ కూడా సినిమాకు చక్కగా కుదిరింది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి.
ఇక దర్శకుడు రమణ తేజ నూతన దర్శకుడు అయినప్పటికీ చాలా వరకు ప్రేక్షకులను మెప్పించడంలో విజయం సాధించారు. చెప్పాలనుకున్న కథకు కట్టుబట్టి ఎక్కడా గాడితప్పకుండా కథను నడిపించిన విధానం బాగుంది. ఐతే సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే ఇంకా బలమైన సన్నివేశాలతో గ్రిప్పింగ్ గా రాసుకొని ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది.
తీర్పు :
అశ్వథామ సినిమాతో యాక్షన్ హీరోగా మారాలన్న నాగ శౌర్య చాలా వరకు విజయం సాధించారు అని చెప్పాలి. యాక్షన్ తో పాటు మంచి ఎమోషన్స్ పండించి మాస్ హీరో రేంజ్ నటన కనబరిచారు. మొదటి సగం మంచి సస్పెన్సు తో కొనసాగిన ఈ చిత్రం సెకండ్ హాఫ్ కొంచెం నెమ్మదించింది. స్క్రీన్ ప్లే ఇంకా బలమైన సన్నివేశాలతో గ్రిప్పింగ్ గా రాసుకొని ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది.ఐతే ఎక్కడా నిరాశపరచకుండా మూవీ సాగింది. ఇక నాగ శౌర్య చేసిన ఈ నూతన ప్రయత్నం ఎంత వరకు ప్రేక్షకులకు నచ్చుతుందో చూడాలి.