అమృతారామమ్ మూవీ రివ్యూ – Amrutharamam Movie Review
‘అమృతారామమ్’. నూతన దర్శకుడు సురేందర్ దర్శకత్వంలో రామ్ మిట్టికంటి హీరోగా అమితా రంగనాథ్ హీరోయిన్ గా వచ్చిన ఎమోషనల్ లవ్ ఎంటర్ టైనర్ ‘అమృతారామమ్’. కాగాఈ సినిమా నేడు ఓటీటీ ప్లాట్ ఫామ్ (జీ5)లో నేరుగా విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
అమృత (అమితా రంగనాథ్) మాస్టర్స్ చేయటానికి ఆస్ట్రేలియా వస్తోంది. అప్పటికే ఐదేళ్ల నుండి ఆస్ట్రేలియాలో ఉంటూ జాబ్ కోసం ట్రై చేస్తూ ఉన్న రామ్ (రామ్ మిట్టికంటి) అమృతను రిసీవ్ చేసుకోవటానికి వెళ్తాడు. మొదటి చూపులోనే అమృత, రామ్ తో ప్రేమలో పడిపోతుంది. రామ్ కూడా స్లోగా అమృతతో ప్రేమలో పడతాడు. ఇద్దరూ ప్రేమలో మునిగితేలతారు. ఆ తరువాత ఇద్దరు మధ్య చోటు చేసుకున్న సంఘటనలు ఏమిటి ? అమృత చూపించిన ప్రేమను రామ్ ఎలా అపార్ధం చేసుకున్నాడు ? ఇద్దరు మధ్య గొడవలు ఎలా స్టార్ట్ అయ్యాయి ? ఒకరికి ఒకరు ఎలా దూరమయ్యారు ? మళ్లీ ఎలా కలిశారు ? చివరగా ఒకరిలో ఒకరు ఎలా కలిసిపోయారు ? చివరికీ వీరి ప్రేమ కథ ఎలా మలుపు తీసుకుంది ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
‘అమృతారామమ్’ అంటూ నూతన దర్శకుడు సురేందర్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో మెస్మరైజ్ చేయకపోయినా ఇప్పటికే వచ్చిన కథను ఎమోషనల్ గా చెప్పడానికి ప్రయత్నం చేశాడు. కొన్ని ప్రేమ సన్నివేశాల్లో అలాగే క్లైమాక్స్ లో సురేందర్ దర్శకుడిగా పర్వాలేదనిపిస్తాడు. ఇక హీరోగా నటించిన రామ్ మిట్టికంటి తన లుక్స్ అండ్ యాక్టింగ్ పరంగా ఆకట్టుకోవడానికి బాగానే తాపత్రయ పడ్డాడు. అయితే అతని పాత్ర ఇంకా బలంగా ఉంటే అతనికి ప్లస్ అయ్యేది.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అమితా రంగనాథ్ తన నటనతో పాటు గ్లామర్ తోనూ బాగా ఆకట్టుకుంది. ప్రేమ సన్నివేశాలతో పాటు, కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో కూడా తన పెర్ఫార్మెన్స్ తో అమితా రంగనాథ్ మెప్పించింది. హీరోయిన్ కి ఫ్రెండ్ గా అన్నయ్య గా నటించిన నటుడు కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు.
అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. సినిమాలో ఎస్.ఎస్.ప్రసు అందించిన సంగీతం సినిమాకి ప్లస్ అయింది. అలాగే కొన్ని సన్నివేశాల్లో ఆయన అందించిన నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. ఇక ఎడిటింగ్ కూడా బాగుంది. సినిమా లెంగ్త్ పెరగకుండా ఎడిటర్ తన ఎడిటింగ్ తో మ్యానెజ్ చేశాడు.
మైనస్ పాయింట్స్ :
సినిమాలో ప్యూర్ లవ్ కి సంబంధించి మంచి స్టోరీ లైన్ ఉంది కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథాకథనాలను మాత్రం లేవు. అమృత, రామ్ ని చూడగానే మైమరచిపోయి అతనితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోతుంది. అతని మీద ప్రేమ పుట్టడానికి కారణం వయసు ప్రభావమే అని మనం సరిపెట్టుకున్నా.. చూడగానే ప్రేమలో పడిపోయే క్వాలిటీస్ హీరోలో ఏం ఉన్నాయో అనే ప్రశ్న మనకు తలెత్తకమానదు.
హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ పుట్టడానికి బలమైన కారణాలు ఎలా లేవో.. వారి మధ్య దూరం పెరగడానికి, వారి మధ్య కాన్ ఫ్లిక్ట్ పెరగడానికి కూడా సరైన కారణాలు పెద్దగా కనిపించవు. ఇక హీరోయిన్ మనోగతం కూడా ఆమె పాత్ర బలహీనతను స్పష్టంగా తెలియజేస్తోంది.
అదేవిధంగా హీరో కోసం హీరోయిన్ (అమృత) చేసే ఫెవర్స్ లో ప్రేమను అర్ధం చేసుకోలేని బలహీనమైన పాత్ర (రామ్) హీరోది. అసలు రామ్ అమృతను అంతగా ఎందుకు ద్వేషిస్తాడో.. అలాగే అమృత రామ్ ని ఎందుకు అంతగా ప్రేమిస్తోందో అన్న విషయాలను దర్శకుడు ఎక్కడా ఎఫెక్టివ్ గా ఎస్టాబ్లిష్ చెయ్యలేకపోయాడు.
పైగా సినిమాలో ఎక్కడా బలమైన సంఘర్షణ కూడా లేదు. దీనికి తోడు ఉన్న ప్రేమ సన్నివేశాలు కూడా పూర్తిగా ఆకట్టుకునే విధంగా ఉండవు. డైరెక్టర్ స్క్రిప్ట్ పై ఇంకా శ్రద్ద పెట్టి ఉంటే సినిమా లవ్ డ్రామాలను లైక్ చేసే వారికైనా రీచ్ అయ్యేది.
తీర్పు :
ప్రేమంటే.. ఒకరి కోసం ఒకరు ఉండటం కాదు, ఒకరిలో ఒకరు ఉండటం అనే భావాన్ని దర్శకుడు ఈ ఎమోషనల్ లవ్ డ్రామాతో చెబుదామని ప్రయత్నం చేసినా.. అదీ బలంగా ఎలివేట్ అవ్వలేదు. అయితే హీరో హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని లవ్ సీన్స్ అండ్ ఎమోషనల్ గా సాగే ఫీల్ గుడ్ క్లైమాక్స్ పర్వాలేదనిపిస్తాయి. కానీ ఇంట్రస్టింగ్ సాగని స్క్రీన్ ప్లేతో పాటు బోరింగ్ ట్రీట్మెంట్ అండ్ ఇన్ వాల్వ్ చేయగలిగే కాన్ ఫ్లిక్ట్ లేకపోవడంతో ఈ సినిమా బోర్ కొడుతోంది. కాకపోతే లవర్స్ కి సినిమాలోని కొన్ని అంశాలు నచ్చుతాయి. ఓవరాల్ ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మాత్రం అక్కట్టుకోదు.