అల వైకుంఠపురములో మూవీ రివ్యూ – Ala Vaikunthapuramulo Movie Review
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న ‘అల వైకుంఠపురములో’ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు భారీ అంచనాలతో ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఈ రోజు గ్రాండ్ గా విడుదల అయింది. మరి బన్నీ- త్రివిక్రమ్ కాంబినేషన్ హ్యాట్రిక్ హిట్ కొట్టారా.. అలాగే ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
వాల్మీకి (మురళి శర్మ) తన స్వార్థంతో చేసిన ఓ పొరపాటు వల్ల బంటు(అల్లు అర్జున్) వాల్మీకి కొడుకుగా ఒక సాధారణ మిడిల్ క్లాస్ అబ్బాయిగా బతకాల్సి వస్తోంది. చిన్నప్పటి నుంచీ అలాగే పెరిగిన బంటుకు తన పుట్టుక గురించి తన తల్లిదండ్రుల గురించి ఒక నిజం తెలుస్తుంది. ఈ మధ్యలో బంటు అమూల్య (పూజా హెగ్డే) దగ్గర జాబ్ లో జాయిన్ అవుతాడు. అలాగే ఆమెతో ప్రేమలో కూడా పడతాడు. ఇక ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటనల అనంతరం బంటు అసలు కుటుంబం కొన్ని సమస్యల్లో ఇరుక్కుంటుంది. దాంతో బంటు తన కుటుంబాన్ని ఆ సమస్యల నుండి ఎలా బయట పడేశాడు? ఇంతకీ బంటు తల్లిదండ్రులు ఎవరు? చివరికి తన ఒరిజనల్ తల్లిదండ్రులకు బంటు ఏమి చేశాడు?లాంటి విషయాలు తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెర పై చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా గుడ్ థీమ్ తో డీసెంట్ ట్రీట్మెంట్ అండ్ కామెడీతో మరియు అద్భుతమైన సాంగ్స్ తో అలాగే భారీ తారాగణంతో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. మొత్తానికి ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన బన్నీ ఫ్యాన్స్ కు త్రివిక్రమ్ గుర్తుపెట్టుకునే మంచి కామెడీతో సాగే ఎమోషనల్ అండ్ యాక్షన్ ట్రీట్ ఇచ్చారు.
సినిమా చూస్తున్నంతసేపూ ఎక్కడా బోర్ కొట్టకుండా సరదాగా సాగిపోతుంది అనే ఫీల్ కలుగుతుంది. ఇక బన్నీ తన నటనతో ఈ చిత్రంలోనే ఉత్తమమైన నటనను కనబర్చారు. ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని కామెడీ అండ్ యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ టైమింగ్ తో, నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచారు. ముఖ్యంగా స్టార్ హీరోస్ సాంగ్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఆఫీస్ సీన్ లో గాని… మరియు లవ్ స్టోరీ స్టార్టింగ్ లో వచ్చే లవ్ సీన్స్ లో అల్లు అర్జున్ ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్ తో ఫుల్ గా నవ్వించారు. పైగా చాలా స్టైలిష్ గా ఫ్రెష్ గా కనిపించాడు.
పూర్తి స్వార్థం నిండిన పాత్రలో మురళీశర్మ అద్భుతంగా నటించాడు. తన మాడ్యులేషన్ స్టైల్ ఆయన పలికించిన ఎక్స్ ప్రెషన్స్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సినిమాలో హీరోయిన్ పాత్ర అయిన అమూల్య పాత్రలో నటించిన హీరోయిన్ పూజా హెగ్డే చాలా చక్కగా నటించింది. తన అందంతో పాటు తన అభినయంతో కూడా మెప్పిస్తోంది.. అలాగే కొన్ని ప్రేమ సన్నివేశాల్లో ఆమె పలికించిన హావభావాలు బాగున్నాయి. అలాగే మరో మాజీ హీరోయిన్ టబు, జైరాం తమ పాత్రల్లో చాలా చక్కగా నటించారు.
అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు సనీల్, హర్షవర్ధన్, వెన్నెల కిషోర్ కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. ఇక గుడ్ థీమ్ తో త్రివిక్రమ్ రాసిన ట్రీట్మెంట్ అండ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే ఈ సినిమాకు మరో ప్రధాన బలం. త్రివిక్రమ్ ఎక్కడా కథను ఓవర్ ఎమోషనల్ చేయకుండా బ్యాలెన్స్ డ్ గా మంచి ఫన్ తో నడుపుతూ మంచి దర్శకత్వ పనితనం కనబర్చారు.
మైనస్ పాయింట్స్ :
కథలో చెప్పాలనుకున్న మెయిన్ థీమ్ తో పాటు చాల సన్నివేశాల్లో మంచి పనితీరుని కనబర్చిన దర్శకుడు త్రివిక్రమ్ మిగిలిన కొన్ని సన్నివేశాలను మాత్రం ఆ స్థాయిలో తీర్చిదిద్దిలేకపోయారు. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో ఇంట్లో వచ్చే సన్నివేశాలను ఇంకా ఆసక్తికరంగా మలిచి ఉంటే బాగుండేది. అలాగే సినిమా ఓపెనింగ్ నే మంచి ఎమోషనల్ గా ఓపెన్ చేసిన దర్శకుడు.. దాన్ని కంటిన్యూ చేయలేదు. లవ్ స్టోరీ కూడా ఇంకా ఆసక్తికరంగా ఉంటే బాగుండేది.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. త్రివిక్రమ్ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. మంచి పాయింట్, బలమైన వైవిధ్యమైన పాత్రలతో మంచి ఎమోషన్ అండ్ ఫన్ తో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. కానీ ఆయన సెకెండ్ హాఫ్ కొన్ని చోట్ల కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచి ఉంటే సినిమా ఇంకా బాగుండేది. సంగీత దర్శకుడు యస్ తమన్ సమకూర్చిన పాటలు, వాటి పిక్చరైజేషన్ కూడా అద్భుతంగా ఉన్నాయి. తమన్ కెరీర్ లోనే చెప్పుకోతగ్గ ఆల్బమ్ గా ఈ సినిమా ఆల్బమ్ నిలిచిపోతుంది. ఇక స్టంట్స్ మాస్ ప్రేక్షకులకు మంచి కిక్ ని ఇస్తాయి. సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. సినిమాలోని సన్నివేశాలన్నీ కెమెరామెన్ చాలా అందంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ పనితనం కూడా బాగుంది. సినిమాలో నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు.
తీర్పు :
హిట్ అండ్ క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన ఈ క్లీన్ ఎంటర్టైనర్ మంచి పాయింట్ తో గుడ్ ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లేతో బలమైన పాత్రలు మరియు భారీ తారాగణంతో అలాగే డీసెంట్ కామెడీతో బాగా అకట్టుకుంది. అయితే సెకెండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు, లవ్ సీన్స్ మాత్రం ఓకే అనిపిస్తాయి. కానీ బన్నీ తన నటనతో తన డాన్స్ అండ్ డైలాగ్ మాడ్యులేషన్ తో ఈ సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. మొత్తం మీద ఈ చిత్రం అల్లు అర్జున్ అభిమానులతో పాటు మిగిలిన అన్నివర్గాల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.