హాయ్ నాన్న మూవీ రివ్యూ
చిత్రం : హాయ్ నాన్న
తారాగణం: నాని, మృణాల్ ఠాకూర్, కియారా ఖన్నా
దర్శకత్వం: శౌర్యువ్
నిర్మాతలు: మోహన్ చెరుకూరి, డా.విజేందర్ రెడ్డి తీగల
డి ఓ పి : సాను జాన్ వర్గీస్
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎడిటర్: ప్రవీణ్ ఆంథోని
కాస్ట్యూమ్ డిజైనర్లు: శీతల్ శర్మ, లక్ష్మి కిలారి
వి ఎఫ్ ఎక్స్ సూపర్వైజర్: అరుణ్ పవార్
కలరిస్ట్: వివేక్ ఆనంద్
కొరియోగ్రాఫర్: బోస్కో మార్టిస్
డైలాగ్స్: నాగేంద్ర కాసి
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
విన్యాసాలు: విజయ్, పృథ్వి
విడుదల తేదీ : 7 డిసెంబర్ 2023
నాని చేసిన మూవీ హాయ్ నాన్న. దీనికి శౌర్యువ్ దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
విరాజ్ (నాని) ఓ ఫేమస్ ఫొటోగ్రాఫర్. ముంబైలో ఓ ఫోటో స్టూడియో లీడ్ చేస్తుంటాడు. విరాజ్ తన కూతురు మహి (బేబీ కియారా ఖన్నా)తో కలిసి ఉంటాడు. ఐతే, మహి ఒక లంగ్ డిసీజ్‌తో బాధ పడుతుంది. ఎక్కువ రోజులు బతకదు అని డాక్టర్స్ చెప్పినా.. మహి తనను వదిలి వెళ్ళదు అని బలంగా నమ్ముతుంటాడు విరాజ్. మరోవైపు మహి తన తల్లి గురించి తెలుసుకోవాలని ఆశ పడుతూ ఉంటుంది. విరాజ్ మాత్రం తన భార్య గురించి కూతురికి చెప్పడు. అసలు విరాజ్ భార్య ఎవరు ?, ఆమె ఎందుకు విరాజ్ ను వదిలేసి వెళ్ళిపోయింది ?, అంతలో విరాజ్ జీవితంలోకి యశ్న ( మృణాల్ ఠాకూర్ ) వస్తోంది, ఇంతకీ, యశ్న (మృణాల్ ఠాకూర్ ) ఎందుకు విరాజ్ కి, అతని కూతురికి బాగా కనెక్ట్ అవుతుంది ?, ఆమె గతం ఏమిటి ?, చివరికి ఈ కథ ఎలా ముగిసింది ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్లు :
డీసెంట్ కాన్సెప్ట్ తో పాటు ఫీల్ గుడ్ ఫ్యామిలీ సీన్స్ మరియు ఎమోషనల్ గా సాగే తండ్రీకూతుళ్ల ఎమోషన్స్.. అలాగే సహజంగా అనిపించే నటీనటుల పనితీరు ఈ హాయ్ నాన్న సినిమాకి హైలైట్స్ గా నిలిచాయి. ముఖ్యంగా నాని – మృణాల్ ఠాకూర్ మధ్య జరిగిన సంఘర్షణ.. అలాగే మృణాల్ పాత్ర ప్రభావం ద్వారా కాన్ ఫ్లిక్ట్ ను పెంచడం చాలా బాగుంది. నాని, మృణాల్ ఠాకూర్ కూడా తమ పాత్రలకు ప్రాణం పోశారు. అలాగే, శౌర్యవ్ రాసిన కథ మరియు పాత్రలు కొన్ని చోట్ల ఆసక్తిగా సాగుతూ ఆకట్టుకుంటాయి.
విరాజ్ పాత్రలో నాని చక్కని నటనను కనబరిచాడు. సెకండ్ హాఫ్ లో ఓ సగటు తండ్రిగా చాలా బాగా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి నాని పూర్తి న్యాయం చేశాడు. మెయిన్ గా క్లైమాక్స్ సీక్వెన్స్ లో మరియు కూతురితో ‘నీకు నా ప్రేమ సరిపోవడం లేదా’ అని సీన్స్ లో నాని నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. అలాగే నానికి, మృణాల్ కి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే అలరిస్తుంది
ఇక కథానాయకగా నటించిన మృణాల్ ఠాకూర్ తన పాత్రలో చాలా చక్కగా నటించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. అతిధి పాత్రలో శృతి హాసన్, అలాగే తండ్రిగా జయరామ్ తమ నాచ్యురల్ నటనతో ఆకట్టుకున్నారు. ఎప్పటిలాగే తన శైలి పాత్రలో కనిపించిన ప్రియదర్శి కూడా బాగా నటించారు. అంగద్ బేడీతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.
మైనస్ పాయింట్లు :
దర్శకుడు శౌర్యవ్ తీసుకున్న కథాంశం బాగున్నప్పటికీ.. కథనం మాత్రం కొన్ని చోట్ల సింపుల్ గా స్లోగా సాగుతుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లోని కూనర్ సీక్వెన్స్ అలాగే సెకండాఫ్ స్టార్టింగ్ సీక్వెన్సెస్ ఆసక్తికరంగా సాగలేదు. ఇక హీరోహీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని లవ్ సీన్స కూడా రెగ్యులర్ గానే సాగుతాయి. మొత్తానికి దర్శకుడు తాను అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేసినా.. సినిమాలో కొన్ని రొటీన్ సీన్స్ ను ట్రిమ్ చేసి వుంటే సినిమాకి ఇంకా ప్లస్ అయ్యేది.
అలాగే, స్క్రీన్ ప్లే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సింది, ఇంటర్వెల్ లో ఓ చిన్న ట్విస్ట్ ఇచ్చి… సెకండాఫ్ పై కొంత ఇంట్రెస్ట్ పెంచే ప్రయత్నం చేసినా.. అది అంత ఎఫెక్టివ్ గా వర్కౌట్ కాలేదు. ప్రతీ సీన్ ను పొడగించడం వల్ల కొన్ని సీన్స్ బోర్ కొట్టాయి. ఇక క్లైమాక్స్ కూడా అందరూ ఊహించిన విధంగానే సాగింది.
సాంకేతిక విభాగం :
సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. శౌర్యవ్ దర్శకుడిగా మంచి కథాంశంతో ఆకట్టుకున్నాడు. అలాగే, ఆయన టేకింగ్ కూడా చాలా బాగుంది. కానీ, స్క్రీన్ ప్లే రాసుకోవడంలో ఆయన తడబడ్డారు. సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహద్ అందించిన పాటలు బాగున్నాయి. అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో చాలా బాగుంది.
ఇక ఎడిటర్ అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. షను వర్గీస్ సినిమాటోగ్రఫీ బాగుంది. వైరా ఎంటర్టైన్మెంట్స్ పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
తీర్పు :
‘ఫీల్ గుడ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా’గా వచ్చిన ఈ హాయ్ నాన్న చిత్రం ఎమోషనల్ గా సాగుతూ ఆకట్టుకుంది. గుడ్ కాన్సెప్ట్ తో పాటు డీసెంట్ గా సాగే ఫాదర్ – డాటర్ ఎమోషన్స్ మరియు ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ ఈ సినిమాలో హైలైట్స్ గా నిలిచాయి. ఐతే, ఈ సినిమాలో కొన్ని సీక్వెన్సెస్ స్లోగా సాగడం, అలాగే కొన్ని రొటీన్ సీన్స్ సినిమాకి మైనస్ అయ్యాయి. కాకపోతే, నాని – మృణాల్ తమ నటనతో సినిమాని మరో లెవల్ కి తీసుకువెళ్లారు. ముఖ్యంగా వారిద్దరీ కెమిస్ట్రీ చాలా బాగుంది.
ఓవరాల్ గా ఈ ‘హాయ్ నాన్న’ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ను చాలా బాగా మెప్పిస్తోంది.