అతిధి వెబ్ సిరీస్ రివ్యూ – Athidhi Web Series Movie Review
నటీనటులు: వేణు తొట్టెంపూడి, అవంతిక మిశ్రా, వెంకటేష్ కాకుమాను, అదితి గౌతమ్, రవివర్మ, భద్రం
దర్శకుడు : భరత్ Y.G.
నిర్మాత : ప్రవీణ్ సత్తారు
సంగీతం : కపిల్ కుమార్
సినిమాటోగ్రఫీ : మనోజ్ కటసాని
ఎడిటర్ : ధర్మేంద్ర కాకరాల
టీవల వెండితెరపైకి రీ ఎంట్రీ ఇచ్చిన వేణు తొట్టెంపూడి, ఇప్పుడు తన ఓటీటీ తొలి సిరీస్ ‘అతిధి’లో మెరిశారు. భరత్ రచన మరియు దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో అవంతిక మిశ్రా, వెంకటేష్ కాకుమాను ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ ప్రస్తుతం పలు భారతీయ భాషల్లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోంది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో చూద్దాం.
కథ :
రవివర్మ (వేణు తొట్టెంపూడి) ఒక రచయిత, పక్షవాతంతో బాధపడుతున్న తన భార్య సంధ్య (అదితి గౌతమ్)తో కలిసి ఒక భవనంలో రవివర్మ నివసిస్తూ ఉంటాడు. ఐతే, ఓ వర్షం కురుస్తున్న రాత్రి, మాయ (అవంతిక మిశ్రా) అనే మర్మమైన మహిళ రవివర్మ ఇంటికి వచ్చి, ఆ రాత్రి మాన్షన్‌లో ఉండవచ్చా అని అడుగుతుంది. రవివర్మ దానికి అంగీకరించి, ఆమెను లోపలికి అనుమతిస్తాడు. మరోవైపు, సాధారణంగా దెయ్యాల వేటపై వీడియోలు చేసే సవారి (వెంకటేష్ కాకమాను) అనే యూట్యూబర్ దెయ్యాన్ని చూసి భయపడిపోతాడు. అతను కూడా రవి మాన్షన్‌లో ఆశ్రయం పొందుతాడు. సవారి అక్కడ మాయను చూస్తాడు. అనంతరం జరిగిన నాటకీయ సంఘటనలు ఏమిటి ?, ఇంతకీ మాయ ఎవరు?, ఆమె నిజంగా దెయ్యమేనా ?, అసలు ఆమె చుట్టూ ఉన్న మిస్టరీ ఏమిటి ?, చివరకు రవివర్మ, సవారి ఏం చేశారు ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్లు :
కథ ప్రారంభ సన్నివేశం నుంచి ఎలాంటి ఆలస్యం చేయకుండా దర్శకుడు డైరెక్ట్ గా కథలోకి వెళ్ళిపోయాడు. మరియు కీలక పాత్రలను చక్కగా పరిచయం చేశాడు. దీనికితోడు బ్యాక్‌డ్రాప్‌లోని భయానక అంశాలు కూడా ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఇక ఈ హారర్ థ్రిల్లర్‌లో వేణు తొట్టెంపూడి అద్భుతమైన నటనను ప్రదర్శించారు. కీలక సన్నివేశాలలో ఆయన నటించిన విధానం కూడా చాలా బాగుంది.
అవంతిక మిశ్రాకు చక్కని పాత్ర లభించింది. ఆమె కూడా తన పాత్రకు తగ్గట్టు చాలా బాగా నటించింది. పైగా అవంతిక మిశ్రా చాలా అందంగా కనిపించింది. అలాగే ఆమె పాత్ర ద్వారా సమాజానికి ఇచ్చిన సందేశం కూడా బాగుంది. యూట్యూబర్ పాత్రలో వెంకటేష్ కాకమాను కూడా మెప్పించాడు. అతని సరళమైన శైలి బాగుంది. ప్రభావవంతమైన నటుడు అని అతను నిరూపించుకున్నాడు.
నేనింతే బ్యూటీ అదితి గౌతమ్ కూడా తనకు ఇచ్చిన పాత్రలో డీసెంట్‌గా నటించింది. భద్రం బాగానే నవ్వించే ప్రయత్నం చేశాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ హారర్ నేపథ్యానికి అనుగుణంగా ఉంది. సిరీస్‌లో కొన్ని చిన్న కథలు ప్రభావవంతంగా ఉన్నాయి.
మైనస్ పాయింట్లు :
ఈ సిరీస్ కథ విషయానికి వస్తే..స్క్రిప్ట్ పరంగా చాలా బాగుంది అనిపిస్తోంది, కానీ ఈ కథను అంతే ప్రభావవంతంగా తెరపైకి తీసుకురాలేకపోయారు. నిజానికి కథలో కొన్ని భయానక ఎలిమెంట్స్ ద్వారా ప్రేక్షకులకు మరింత థ్రిల్ ను అందించడానికి కథలో భారీ స్కోప్ ఉంది, కానీ స్క్రీన్ పై మాత్రం దర్శకుడు ఆ థ్రిల్ ను ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు. దీనికితోడు కథలోని ట్విస్ట్‌లను రివీల్ చేసిన విధానం కూడా బాగాలేదు.
అసలు ఒక సిరీస్ ఈ ట్విస్ట్లపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. వాటిని సరసమైన పద్ధతిలో రివీల్ చేసి ఉంటే, ఈ సిరీస్ ఇంకా మెరుగ్గా ఉండేది. అలాగే సిరీస్ లో కీలక సన్నివేశాల్లో కాన్ ఫ్లిక్ట్ కూడా ఆకట్టుకునే విధంగా లేదు. పైగా ప్రధాన క్యారెక్టర్ తాలూకు జర్నీ గ్రాఫ్ కూడా బాగాలేకపోవడం వంటి అంశాలు సిరీస్ కి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. అలాగే సిరీస్ ముగిసే విధానం కూడా నిరాశపరిచింది. చివరి ఎపిసోడ్లో చాలా సంఘటనలు జరిగినా.. కారణం లేకుండా ఏదో హడావుడి చేనట్టు అనిపిస్తోంది. అలాగే కొన్ని సన్నివేశాలు కూడా అకస్మాత్తుగా ముగిశాయి.
సాంకేతిక విభాగం :
కపిల్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చక్కగా ఉంది. అతని స్కోర్ కారణంగా కొన్ని సన్నివేశాలు చాలా బాగా ఎస్టాబ్లిష్ అయ్యాయి. మనోజ్ కటసాని సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఈ సిరీస్ వేగంగా నడుస్తున్న ఫీలింగ్ ను సినిమాటోగ్రఫీ వర్క్ సస్టైన్ చేసింది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. రచయిత-దర్శకుడు భరత్ విషయానికి వస్తే, అతను మంచి కథతో వచ్చాడు, అయితే స్క్రీన్ పై ప్రెజెంటేషన్‌కు సంబంధించి అతను ఇంకా బాగా చేసి ఉంటే బాగుండేది.
తీర్పు :
మొత్తమ్మీద, ఈ ‘అతిధి’ సిరీస్ లో కొన్ని హారర్ ఎలిమెంట్స్, అలాగే కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ బాగానే ఉన్నాయి. వేణు తొట్టెంపూడి, అవంతిక మిశ్రా, వెంకటేష్ కాకమాను మంచి నటనను కనబరిచారు. ఐతే, ఆసక్తికరమైన కథ ఉన్నప్పటికీ, సిరీస్ లోని ప్లే అండ్ ట్రీట్మెంట్ ఆశించిన స్థాయిలో థ్రిల్ చేయలేకపోయాయి. కీలకమైన ట్విస్ట్‌లను వెల్లడించిన విధానం కూడా బాగాలేదు. మొత్తానికి అతిధి కొన్ని చోట్ల మాత్రమే బాగుంది.