ఏజెంట్ మూవీ రివ్యూ – Agent Movie Review
అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య జంటగా మాస్ అండ్ స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన సాలిడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ “ఏజెంట్”. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందో చూద్దాం..
కథ :
రిక్కీ అలియాస్ రామకృష్ణ (అఖిల్) తాను ఓ పవర్ ఫుల్ ‘రా’ ఏజెంట్ కావాలని చిన్నప్పటి నుంచి కల కంటూ.. రా కోసమే బతుకుతూ ఉంటాడు. అయితే, రిక్కీ ఉత్సాహం, అతి విశ్వాసం కారణంగా మూడు సార్లు రా ఏజెంట్ గా రిజెక్ట్ అవుతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో రా ఏజెన్సీ హెడ్ డెవిల్ మహాదేవ్ (మమ్ముట్టి)ను ఆకట్టుకోవడానికి గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ మధ్యలో రిక్కీ, వైద్య (సాక్షి వైద్య)తో ప్రేమలో పడతాడు. కానీ అంతలో డెవిల్ మహాదేవ్, రిక్కీకి ఒక డేంజరస్ మిషన్ అప్పగిస్తాడు. ఇంతకీ ఏమిటి ఆ మిషన్ ?, అసలు రిక్కీ ఎందుకు రా ఏజెంట్ కావాలనుకకుంటాడు?, చివరకు రిక్కీ, డెవిల్ మహాదేవ్ ఇచ్చిన మిషన్ ను పూర్తి చేశాడా? లేదా? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
వైల్డ్ సాలె రిక్కీగా ఈ సినిమాలో అక్కినేని అఖిల్ పవర్ ఫుల్ పాత్రలో తన టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. అఖిల్ అగ్రెసీవ్ బాడీ లాంగ్వేజ్, డామినేట్ చేసే తన క్యారెక్టరైజేషన్ అండ్ మాడ్యులేషన్ తో తన పాత్రకు ఫర్ఫెక్ట్ గా న్యాయం చేశాడు. పైగా తన గత సినిమాల్లో కంటే ఈ సినిమాలో అఖిల్ కొత్త లుక్స్ తో చాలా వైల్డ్ గా కనిపించాడు. ఇటు హీరోయిన్ తో ప్రేమ సన్నివేశాల్లో, అటు యాక్షన్ సన్నివేశాల్లో అఖిల్ చాలా సెటిల్డ్ గా చక్కగా నటించాడు.
హీరోయిన్ గా నటించిన సాక్షి వైద్య కూడా తన నటనతో ఆకట్టుకుంది. కొన్ని చోట్ల సందర్భానుసారంగా ఆమె పలికించిన హావభావాలు మరియు ఆమె నటన బాగుంది. ఈ చిత్రానికి మరో ప్రధానాకర్షణ మమ్ముట్టి. ఆయన ఎప్పటిలాగే తన టైమింగ్ తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో మమ్ముట్టి నటన చాలా బాగుంది. విలన్ గా డినో మోరియా నటన కూడా బాగుంది.
అఖిల్ కి తండ్రి పాత్రలో కనిపించిన మురళీ శర్మ తన నటనతో మెప్పించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. కొన్ని కీలక సన్నివేశలను దర్శకుడు సురేందర్ రెడ్డి హై టెక్నికల్ వేల్యూస్ తో బాగా తెరకెక్కించాడు.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాలో మెయిన్ ప్లాట్ వైవిధ్యమైనది కాకపోయినా.. కనీసం ఇంట్రస్ట్ గా అయిన సాగాలి. ఈ కథలో అది కూడా మిస్ అయింది. దర్శకుడిగా సురేందర్ రెడ్డి మంచి కథా నేపథ్యం రాసుకున్నప్పటికీ.. ఆసక్తికరమైన కథనంతో సినిమాని ఇంట్రెస్టింగ్ గా మలచలేకపోయారు. అక్కడక్కడ బోర్ గా సాగే సన్నివేశాలు కొంత ఇబ్బందిని కలిగిస్తాయి. పైగా ఈ చిత్రం చూస్తున్నంత సేపు రెగ్యులర్ యాక్షన్ డ్రామాలే గుర్తుకువస్తాయి.
అన్నిటికీ మించి సినిమాలో గుర్తు ఉండిపోయే ఒక్క ఎమోషన్ కూడా బలంగా ఎలివేట్ కాలేదు. నిజానికి క్లైమాక్స్ లో మమ్ముట్టి క్యారెక్టర్ ను ఎమోషనల్ గా డిజైన్ చేసినప్పటికీ.. అది పెద్దగా స్క్రీన్ మీద వర్కౌట్ కాలేదు. సినిమాలో ఎక్కువ భాగం యాక్షన్ అండ్ ఇన్విస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో సాగినా.. ఎక్కడా వాట్ నెక్స్ట్ అనే టెన్షన్ కూడా బలంగా లేకపోవడం ఈ సినిమాకి మరో బలహీనత.
సినిమా మెయిన్ గా మాస్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే జోనర్ అయినప్పటికీ.. దర్శకుడు మాత్రం అక్కడక్కడ ఆకట్టుకునే యాక్షన్ ను తప్ప.. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే ఎలిమెంట్స్ ను సినిమాలో ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. పైగా ఈ చిత్రంలో చాలా తేలికపాటి ఇన్విస్టిగేషన్ తోనే ముగించడం అంతగా రుచించదు.
సాంకేతిక విభాగం :
దర్శకుడు సురేందర్ రెడ్డి మంచి స్టోరీ ఐడియా తీసుకున్నారు గానీ, ఆ ఐడియాకు తగ్గట్టు అంతే కొత్తగా ట్రీట్మెంట్ ను మాత్రం రాసుకోలేదు. సినిమాలో సప్సెన్స్ తో ఇంట్రెస్ట్ పెంచే స్కోప్ ఉన్నప్పటికీ ప్లే సింపుల్ గా హ్యాండల్ చేశారు. మ్యూజిక్ విషయానికి వస్తే…హిప్ హాప్ తమిజా అందించిన సంగీతం అక్కడక్కడ పర్వాలేదనిపిస్తోంది. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫర్ పనితనం బాగుంది. సినిమా మూడ్ కి అనుగుణంగా రసూల్ దృశ్యాలని బాగా తెరకెక్కించారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాగున్నప్పటికీ కథకు అవసరం లేని సీన్స్ ను ట్రీమ్ చేసి ఉంటే బాగుండేది. ఇక సినిమాలోని ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.
తీర్పు :
ఏజెంట్ అంటూ వచ్చిన ఈ సినిమాలో కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ మరియు అఖిల్ వైల్డ్ పెర్ఫార్మెన్స్ బాగున్నాయి. అలాగే మమ్ముట్టి నటన మెప్పిస్తుంది. అయితే, బోరింగ్ ప్లేతో పాటు లాజిక్ లెస్ సీన్స్, ఇంట్రెస్ట్ కలిగించలేని యాక్షన్ డ్రామా సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ అక్కినేని అభిమానులకు నచ్చుతాయి. కానీ మిగిలిన వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ కాదు.