RRR 2022 Telugu Movie Review

RRR

ఆర్ఆర్ఆర్ మూవీ రివ్యూ – RRR Movie Review

రాజమౌళి,  ఎన్టీఆర్,  రామ్ చరణ్ కలయికలో తెరకెక్కిన భారీ క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. కాగా ఈ సినిమా ఈ రోజే ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :




నిజాంను క‌ల‌వ‌డానికి వ‌చ్చిన బ్రిటిష్ దొర ఓ గోండు పిల్ల‌ను బలవంతంగా తీసుకువెళ్తాడు. ఆ గోండు జాతి కాప‌రి కొమురం భీమ్ (ఎన్టీఆర్) త‌మ‌ గూడెం పిల్ల కోసం దొరల ఏలుబ‌డిలో ఉన్న ఢిల్లీలో అడుగుపెడతాడు. కొమురం భీం (ఎన్టీఆర్) సంగతి తెలిసిన బ్రిటిష్ ప్రభుత్వం.. అతన్ని ప‌ట్టుకునే బాధ్య‌తను సీతారామ‌రాజు (రామ్ చరణ్)కు అప్పగిస్తోంది. రామ‌రాజు – కొమురం భీమ్ ఎవరి లక్ష్యాల వైపు వాళ్ళు సాగుతూ ఉండగా.. మధ్యలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఇద్దరు ప్రాణ స్నేహతులుగా మారతారు. అయితే, ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘనల అనంతరం ఇద్దరు ఒకరి పై ఒకరు దాడి చేసుకోవాల్సి వస్తోంది. ఆ తర్వాత ఏమి జరిగింది ? భీమ్ విషయంలో రామరాజు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు ? భీమ్ ను అనుకోకుండా కలుసుకున్న సీత‌ (అలియా భట్) అతనికి రామరాజు గతం గురించి ఏమి చెపుతుంది ? వీరి స్నేహం చివరకు ఎలాంటి మలుపు తీసుకుంది ? బ్రిటిష్ ప్రభుత్వం పై భీమ్, రామరాజు కలిసి ఏ విధంగా పోరాటం చేశారు ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

అత్యంత భారీ అంచనాలతో వచ్చిన ఈ అద్భుతమైన యాక్షన్ ఎమోషనల్ పీరియాడిక్ డ్రామాలో.. పవర్ ఫుల్ ఎమోషన్స్, భారీ తారాగణం మరియు రాజమౌళి డైరెక్షన్ వంటి అంశాలు కారణంగా ఈ సినిమా చాలా బాగా ఆకట్టుకుంది. ఎన్టీఆర్‌, చరణ్‌ ల నటన హృదయాలను హత్తుకుంది. ఇద్దరి పాత్రల మధ్య ఎమోషన్స్ గుండె బరువెక్కేలా ఉన్నాయి. ఇద్దరి ఐడియాలజీ పూర్తిగా వేరు అయినా.. రెండు పాత్రల మధ్య బాండింగ్ ను రాజమౌళి చాలా బాగా ఎలివేట్ చేశారు.

ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఫ్యాన్స్ కు ‘ఆర్ఆర్ఆర్’ రూపంలో గుర్తుపెట్టుకునే మంచి యాక్షన్ విజువల్ ట్రీట్ ఇచ్చారు రాజమౌళి. ఇక ఎన్టీఆర్ తన పరిపక్వతమైన నటనతో, చరణ్ తన ఎమోషనల్ కనెక్టివిటీతో ఈ చిత్రంలోనే ఇద్దరు ఉత్తమమైన నటనను కనబర్చారు. ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో హీరోలిద్దరూ తమ మార్క్ యాక్షన్ తో, నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచారు.

అలాగే ప్రధాన పాత్రలో నటించిన అజయ్ దేవగణ్ కూడా చాలా బాగా నటించాడు. హీరోయిన్స్ గా నటించిన అలియా భట్, ఒలీవియా మోరిస్ తమ నటనతో ఎమోషనల్ సీన్స్ లో అద్భుతంగా నటించారు. దర్శకుడు రాజమౌళి ఒక పాత్రకి మరో పాత్రకు మధ్య మంచి వైవిధ్యాన్ని చూపిస్తూ.. ప్రతి పాత్రను కథలో కలిసిపోయేలా ప్లే రాసుకోవటం కూడా బాగా ఆకట్టకుంది.

మెయిన్ గా ఎన్టీఆర్ – చరణ్ మధ్య వచ్చే సన్నివేశాలు కూడా చాలా బాగున్నాయి. అలాగే మిగిలిన స్టార్ల స్క్రీన్ ప్రెజెన్స్, వారి నటన మరియు భావోద్వేగమైన ఎమోషన్స్, మరియు డైలాగ్స్ సినిమాలోనే ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. అలాగే మిగిలిన నటీనటులు గెటప్స్ వారి పాత్రల తాలూకు ఎలివేషన్స్ కూడా బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :




అద్భుతమైన ఎమోషన్స్ తో విజువల్స్ తో వచ్చిన ఈ ‘హై యాక్షన్ ఎమోషనల్ ఎంటర్ టైనర్’ చాలా వరకు బాగా ఆకట్టుకున్నా.. కథ పరంగా వచ్చే కొన్ని సీన్స్ సినిమా స్థాయికి తగ్గట్లు పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. అలాగే సినిమాలో ఉన్నంత హైప్ ను సినిమా మొత్తం కంటిన్యూ చేయలేక పోయారు. మెయిన్ గా సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ స్థాయిలో ఎఫెక్టివ్ గా లేదు.

అలాగే అలియా భట్ – చరణ్ ల మధ్య లవ్ ట్రాక్ కూడా పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా లేదు. ఎన్టీఆర్ – చరణ్ రెగ్యులర్ మాస్ ను ఎక్కువగా ఎక్స్ పెక్ట్ చేసి వెళ్లితే మాత్రం అక్కడక్కడ కొంతవరకు నిరాశ తప్పదు. అలాగే సెకెండ్ హాఫ్ లో కూడా కొన్ని సీన్స్ స్లోగా సాగుతాయి.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు కీరవాణి సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. నిర్మాత డి.వి.వి దానయ్య ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి.

తీర్పు :

విజువల్ వండర్ గా సాగిన ఈ ఎమోషనల్ క్లాసిక్ డ్రామాలో.. గొప్ప యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఎన్టీఆర్ – చరణ్ నటన, రాజమౌళి దర్శకత్వ పనితనం, కీరవాణి సంగీత స్వరాలు.. మొత్తం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అయితే, సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోవడం, అలియా, అజయ్ పాత్రలు పూర్తి సంతృప్తికరంగా లేకపోవడం సినిమాకి బలహీనతలుగా నిలిచాయి. ఓవరాల్ గా ‘ఆర్ఆర్ఆర్’ ఆకట్టుకుంది. ఈ చిత్రం ఓ మంచి ఎమోషనల్ యాక్షన్ విజువల్ ట్రీట్ లా అనిపిస్తుంది.

English Review