మంచి రోజులొచ్చాయి మూవీ రివ్యూ – Manchi Rojulu Vachayi Movie Review
మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మెహ్రీన్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా “మంచి రోజులొచ్చాయి”. ఈ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్ ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
గోపాలం తిరుమలశెట్టి (అజయ్ ఘోష్) మహా భయస్తుడు. ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా ఊహించుకుని ఎప్పుడు భయపడుతూ ఉంటాడు. దీనికితోడు పక్కన ఉన్న వాళ్ళ మాటలకు కూడా గోపాలం ఎక్కువగా ప్రభావితం అవుతూ ఉంటాడు. ఈ క్రమంలో తన కూతురు పద్మ ( మెహ్రీన్ పిర్జాదా) సంతోష్ (సంతోష్ శోభన్)తో ప్రేమలో ఉందని.. అతన్ని పెళ్లి చేసుకుంటే.. తన కూతురు జీవితం నాశనం అవుతుందని గోపాలం ఊహించుకుని లేనిపోని సమస్యల్లో చిక్కుకుంటాడు. మొత్తానికి భయంతో గందరగోళంలోకి వెళ్లిన గోపాలంను సంతోష్ ఎలా మార్చాడు ? చివరకు గోపాలం కథ ఎలా ముగిసింది ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన అజయ్ ఘోష్ చాలా బాగా నటించాడు. తన పాత్రకు తగ్గట్లు.. కామెడీ సన్నివేశాల్లో బాగా ఆకట్టుకున్నాడు. అలాగే తనకు ఎదురయ్యే కొన్ని ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే క్రమంలో వచ్చే సీన్స్ లో లోలోపలే నలిగిపోతున్న ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ అజయ్ ఘోష్ చక్కగా అభినయించాడు.
అలాగే హీరోగా నటించిన సంతోష్ శోభన్ గత తన సినిమాల్లో కంటే ఈ సినిమాలో ఫ్రెష్ గా, స్టైలిష్ గా కనిపించాడు. తన క్యారెక్టరైజేషన్ తో, తన టైమింగ్ తో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేస్తూనే, ఇటు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన మెహ్రీన్ పిర్జాదా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు గ్లామర్ తోనూ మెప్పించింది.
సంతోష్ శోభన్ – మెహ్రీన్ పిర్జాదా మధ్య నడిచే సీన్స్ కూడా బాగున్నాయి. వెన్నెల కిషోర్ తన పాత్రతో మంచి వినోదాన్ని పంచాడు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.
మైనస్ పాయింట్స్ :
సినిమాలో ఫస్ట్ హాఫ్ ఆకట్టుకునేలా ఉంది. అయితే, ఫస్ట్ హాఫ్ బాగున్నా.. సెకండ్ ఆఫ్ మాత్రం ఇంట్రెస్ట్ గా సాగదు. దర్శకుడు మారుతి సెకండ్ హాఫ్ లో ఇంకా బెటర్ గా ఆసక్తికరమైన డ్రామాను జనరేట్ చేయడంలో విఫలమయ్యాడు. సెకండ్ హాఫ్‌లో చాలా సన్నివేశాలు ల్యాగ్ అయ్యాయి. కొన్ని పాత్రలకు ఎటువంటి ఉపయోగం లేకుండానే.. హైప్ చేశారు.
కీలక పాత్ర భయం తాలూకు విచారించే విధానంకు కూడా స్లో మిస్ అయింది. పైగా మెయిన్ క్యారెక్టరైజేషన్స్ మొదట్లో ఇంట్రెస్ట్ గా అనిపించినప్పటికీ.. చివరికి వచ్చే సరికి ఆ క్యారెక్టరైజేషన్స్ కి క్లారిటీ మిస్ అయి ఆకట్టుకోవు. అలాగే సినిమాలో కొన్ని చోట్ల నాటకీయత ఎక్కువవడంతో కథలో సహజత్వం లోపించింది.
సాంకేతిక విభాగం :
ఈ చిత్ర దర్శకుడు మారుతి మంచి కథాంశాన్ని ఎంచుకున్నాడు. అలాగే తన దర్శకత్వ పనితనంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేశాడు గానీ, అది పూర్తి సంతృప్తికరంగా సాగలేదు. ఆయన సెకండాఫ్ పై ఇంకా శ్రద్ధ పెట్టి ఉండి ఉండాల్సింది. సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు, కానీ సినిమాలోని సాగతీత సన్నివేశాలను తగ్గించి ఉంటే.. సినిమాకు ప్లస్ అయ్యేది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
తీర్పు :
‘మంచి రోజులొచ్చాయి’ అంటూ వచ్చిన ఈ కామెడీ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో కామెడీతో పాటు కీలక పాత్రల ఆలోచనా విధానం, అలాగే ప్రధాన పాత్రల భావోద్వేగాలతో పాటు బ్యాక్ డ్రాప్ సెటప్, పాత్రల ఎలివేషన్స్ చాలా బాగున్నాయి. కాకపోతే బోరింగ్ ట్రీట్మెంట్, ఆసక్తికరంగా సాగని స్క్రీన్ ప్లే వంటి అంశాలు సినిమాకు మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా జస్ట్ టైమ్ పాస్ కామెడీ ఎంటర్ టైనర్ ను చూడాలనుకుంటే.. ఈ సినిమాను హ్యాపీ గా చూడొచ్చు.