రిపబ్లిక్ మూవీ రివ్యూ – Republic Movie Review
సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమాతో నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. దేవా కట్టా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
పంజా అభిరామ్ (సాయి ధరమ్ తేజ్) చిన్న తనం నుంచి దారి తప్పిన సిస్టమ్ కి అపోజిట్ థాట్ ప్రాసెస్ తో పెరుగుతాడు. అమెరికాకి వెళ్ళాల్సిన వాడు కొన్ని కారణాల కారణంగా కలెక్టర్ కావాలని నిర్ణయించుకుంటాడు. మరోపక్క విశాఖవాణి (రమ్యకృష్ణ) పార్టీ అధికారంలోకి వస్తోంది. ఓటు బ్యాంక్ కోసం తెల్లేరును విషపూరితంగా మారుస్తారు. దాంతో లక్ష మంది వరకూ అనేక రకాలుగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే మైరా (ఐశ్వర్య రాజేష్) అన్నయ్య చనిపోతాడు. ఆ కేసుతో మొదలైన అభిరామ్ పోరాటం.. తెల్లేరు జాతకాన్ని ఎలా మార్చాడు.? ఆ తరవాత ఈ సిస్టమ్ వల్ల అతని జీవితం ఎలాంటి మలుపు తిరిగింది ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
ప్రస్తుత రాజకీయాల గురించి, సిస్టమ్ లోని లొసుగులు గురించి సినిమాలో చర్చించిన అంశాలు బాగున్నాయి. అలాగే రాజకీయ నాయకుల గురించి, అలాగే ఓటర్ల బలహీనతలు, తప్పుల గురించి ఈ చిత్రంలో దర్శకుడు దేవకట్టా ప్రస్తావించిన అంశాలు కూడా ఆలోచింపజేస్తాయి. ముఖ్యంగా ఆయన రాసుకున్న పొలిటికల్ సన్నివేశాలు, రమ్యకృష్ణ ట్రాక్.. జగపతిబాబు – సాయి తేజ్ మధ్య వచ్చే ఎమోషనల్ డ్రామా ఆకట్టుకుంటాయి.
సాయి తేజ్ గత చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం పక్కా పొలిటికల్ అండ్
ప్రాక్టికల్ డ్రామాగా సాగడం వల్ల సాయి తేజ్ నుంచి వచ్చిన డిఫరెంట్ సినిమాగా ఈ సినిమా నిలుస్తోంది. ఇక సాయి తేజ్ కూడా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. కీలక పాత్రలో నటించిన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ పాత్ర కేవలం సపోర్టింగ్ రోల్ కే పరిమితమైంది. కానీ ఉన్నంతలో తన పాత్ర పరిధి మేరకు ఆమె బాగానే నటించింది.
ఫిమేల్ లీడ్ లో మరో ప్రధాన పాత్రలో కనిపించిన రమ్యకృష్ణ రాజకీయ నాయకురాలిగా తన నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమాలో మరో ఇంపార్టెంట్ రోల్ లో కనిపించిన జగపతిబాబు కూడా తన నటనతో ఆకట్టుకున్నారు. ఆయన కొన్ని ఏమోషనల్ సీన్స్ ను చాలా బాగా పండించారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేసారు. డైలాగ్స్, అండ్ కొన్ని ఎమోషన్స్ బాగున్నాయి.
మైనస్ పాయింట్స్ :
దర్శకుడు దేవకట్టా రాజకీయాలకు సంబంధించి.. ప్రస్తుత సమాజంలోని వాస్తవ పరిస్థితుల గురించి మంచి డ్రామా తీసుకున్నా.. పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని రాసుకోలేకపోయారు. అయితే ఆయన రాసుకున్న సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు బాగున్నప్పటికీ, ఫస్ట్ హాఫ్ లో కొన్ని కీలక సన్నివేశాలు సాగతీసినట్లు, దానికి తోడు సినిమాటిక్ గా అనిపిస్తాయి.
ఇక ఈ సినిమాలో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు ఉన్నప్పటికీ, దర్శకుడు మాత్రం ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేసే దానికన్నా, ఓన్లీ పొలిటికల్ డ్రామానే ఎలివేట్ చెయ్యటానికే ఎక్కువ ఆసక్తి చూపించాడు. ఇక రమ్యకృష్ణ పై వచ్చే కొన్ని కీలక సన్నివేశాలు ఇంకా బలంగా ఉంటే బాగుండేది. సినిమాలో ఉన్న బలమైన కాన్ ఫ్లిక్ట్ ఎలివేట్ చేయడంలో కొన్ని చోట్ల ప్లే స్లో అయింది.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందే చెప్పుకున్నట్లు.. దర్శకుడు నేటి రాజకీయాలకు సంబంధించి మంచి పొలిటికల్ డ్రామా తీసుకున్నా, ఆ డ్రామాకి తగ్గట్లు సరైన కథనాన్ని రాసుకోలేకపోయారు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు పరవాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను ఎంతో రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో చూపించారు. ఎడిటింగ్ బాగుంది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.
తీర్పు :
రిపబ్లిక్ అంటూ వచ్చిన ఈ పొలిటికల్ అండ్ ప్రాక్టికల్ ఎమోషనల్
డ్రామాలో.. నేటి రాజకీయ వాస్తవ పరిస్థితులకు సంబంధించి ఇచ్చిన మెసేజ్, పొలిటికల్ డైలాగ్స్, అండ్ కొన్ని ఎమోషన్స్ వంటి అంశాలు ఆకట్టుకున్నాయి. అయితే, సినిమా సీరియస్ మోడ్ లో సాగడం, అక్కడక్కడా కథనం నెమ్మదిగా సాగడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమా, పొలిటికల్ జోనర్ లో సినిమాలను ఇష్ట పడే ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది.