Sreekaram 2021 Telugu Movie Review

Sreekaram

శ్రీకారం మూవీ రివ్యూ – Sreekaram Movie Review

శర్వానంద్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా 14రీల్స్ ప్లస్ పతాకంపై నూతన దర్శకుడు కిషోర్ బి. దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ తో నిర్మించిన చిత్రం ‘శ్రీకారం’. కాగా ఈ చిత్రం విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :




కార్తీక్ (శర్వానంద్) సాఫ్ట్ వేర్ ఇంజనీర్. బెస్ట్ ఎంప్లాయర్ అవార్డు కూడా తీసుకుంటాడు. అయితే చిన్నప్పటి నుండి తన తండ్రి (రావు రమేష్) పెంపకంలో వ్యవసాయం పై ఇష్టం పెంచుకుంటాడు. దాంతో జాబ్ వదిలేసి..ఉమ్మడి వ్యవసాయం చేయడానికి ఊరు వస్తాడు. అది ఇష్టం లేని అతని తండ్రి కేశవులు (రావు రమేష్) కొడుకుతో మాట్లాడటం కూడా మనేస్తాడు. అయినా కార్తీక్ తన ఊరి జనాన్ని కలుపుకుని ఎలాంటి వ్యవసాయం చేశాడు ? అందులో భాగంగా అతను ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి ? వ్యవసాయానికి అతను ఇచ్చిన నిర్వచనం ఏమిటి ? ఈ మధ్యలో కార్తీక్ ను ప్రేమిస్తున్నా అంటూ అతని వెంట పడుతూ అతనితో వ్యవసాయం కూడా చేయడానికి వచ్చిన చైత్ర (ప్రియాంక అరుల్ మోహన్) ప్రేమ కథ ఏమిటి ? చివరకి ఈ శ్రీకారం ఎలా ముగిసింది అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

మనందరం దాదాపు వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినవాళ్లమే.. అంటూ సాగిన ఈ సినిమా కోర్ ఎమోషన్ కి మనం ఎక్కడో ఒక చోట కనెక్ట్ అవుతాము. అదే ఈ సినిమాకి బిగ్ ప్లస్ పాయింట్. అలాగే పల్లె మనుషులను అక్కడి పరిస్థితులను స్క్రీన్‌ మీద బాగా ప్రెజెంట్ చేశారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లోని కొన్ని ఊరు సీన్స్ అండ్ షాట్స్ చాలా బాగున్నాయి. పైగా అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ను సినిమాలో బాగానే మెయింటైన్ చేశారు.

ఇక శర్వానంద్ మరోసారి తన నటనతో అబ్బురపరుస్తారు. సాఫ్ట్ వేర్ గా, ఓ రైతుగా ఇలా రెండు విభిన్నమైన పాత్రల్లో.. డిఫరెంట్ షేడ్స్ తోనూ.. ప్రతి సీన్ లో వేరియేషన్స్ చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సెకెండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో శర్వానంద్ పలికించిన ఎక్స్ ప్రెషన్స్ కూడా సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రియాంక అరుళ్ మోహన్ తన స్టన్నింగ్ లుక్, గ్లామరస్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టింది.

అలాగే కీలక పాత్రలో నటించిన రావు రమేష్ సినిమాలోనే హైలెట్ గా నిలిచాడు. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో రావు రమేష్ నటన చాలా బాగుంది. అలాగే మరో ప్రధాన పాత్రలో నటించిన సాయి కుమార్ కూడా ఆ పాత్రకు తగ్గట్లు చాలా బాగా నటించాడు. అలాగే సత్య, మురళి శర్మ మరియు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. దర్శకుడు కిషోర్ బి ఎక్కడా కథను ఓవర్ ఎమోషనల్ చేయకుండా బ్యాలెన్స్ డ్ గా నడుపుతూ మంచి దర్శకత్వ పనితనం కనబర్చారు.

మైనస్ పాయింట్స్ :




ఫస్ట్ హాఫ్ ను చాలా ఎఫెక్టివ్ గా బలమైన ఎమోషన్ తో అలాగే కథలో చెప్పాలనుకున్న మెయిన్ థీమ్ తో పాటు చాలా సన్నివేశాల్లో మంచి పనితీరుని కనబర్చిన దర్శకుడు.. సెకండ్ హాఫ్ లో మాత్రం నెమ్మదిగా కనిపించారు. ముఖ్యంగా సెకెండ్ హాఫ్ చాలా సన్నివేశాలను ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నపటికీ కిషోర్ మాత్రం వాట్ని సింపుల్ గా నడిపారు. అలాగే తనకు అనుకూలంగా సీన్స్ వేసుకుంటూ వెళ్ళిపోయాడు.

హీరో పాత్ర ఊరిలో అంత చేస్తుంటే.. అది అసలు జీర్ణయించుకోలేని తండ్రి పాత్రను చాలా వరకూ హైడ్ చేసేశాడు. కథకే కీలకం అయిన తండ్రి రియాక్షన్స్ చూపిస్తే బాగుండేది. అయితే సెకెండాఫ్ ని కాస్త ఎమోషనల్ గా నడుపుదామని దర్శకుడు బాగానే ప్రయత్నం చేసినప్పటికీ.. కొన్ని చోట్ల పెద్దగా వర్కౌట్ కాలేదు. మెయిన్ గా సెకెండ్ హాఫ్ మొదటి పార్ట్ లో కొన్ని సీన్స్ సాగతీతగా అనిపిస్తాయి. దీనికి తోడు లవ్ స్టోరీ కూడా పెద్దగా ఆసక్తికరంగా సాగదు. హీరో హీరోయిన్ల మధ్య లవ్ స్టోరీనే తక్కువ అనుకుంటే… ఉన్నదాన్ని కూడా సరిగ్గా ఎలివేట్ చెయ్యలేదు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. దర్శకుడిగా కిషోర్ బి ఈ చిత్రానికి న్యాయం చేశారు. మంచి కథ, బలమైన పాత్రలతో (హీరోయిన్ పాత్ర తప్ప) చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. కానీ ఆయన కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచి ఉంటే బాగుండేది. సంగీత దర్శకుడు సమకూర్చిన పాటలు బాగున్నాయి. విజువల్ గా వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. సినిమాలోని సన్నివేశాలన్నీ కథకి అనుగుణంగా చాలా అందంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ బాగున్నప్పటికీ.. సెకండ్ హాఫ్ కథనాన్ని ఇంకా సాధ్యమైనంత వరకు ట్రీమ్ చేసి.. సినిమాకి ప్లస్ అయ్యేది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వాళ్ళ నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

తీర్పు :

ముందుగానే చెప్పుకున్నట్లు శ్రీకారం సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల స్లో అనిపించినా.. మొత్తానికి అభిమానులను అయితే బాగా అలరిస్తుంది. ఎంచుకున్న సబ్జెక్ట్ తో పాటు అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్ తో అందరికీ కనెక్ట్ అయ్యే ఎంగేజింగ్ సోషల్ డ్రామాగా సాగుతూ ‘శ్రీకారం’ మెప్పిస్తోంది. అన్నిటికి మించీ శర్వానంద్, రావు రమేష్ మరోసారి తమ నటనతో అబ్బురపరుస్తారు. అయితే బలమైన కథతో, పాత్రలతో ఆకట్టుకున్నప్పటికి.. కొన్ని సన్నివేశాలను మాత్రం దర్శకుడు నెమ్మదిగా నడిపించారు. పైగా సినిమాలో లవ్ స్టోరీ కూడా పెద్దగా ఆకట్టుకోదు. కానీ డిస్కస్ చేసిన పాయింట్ అద్భుతంగా అనిపిస్తోంది. మొత్తం మీద ‘శ్రీకారం’ ఫ్యామిలీ అండ్ పల్లె ఆడియన్స్ ను చాలా బాగా ఆకట్టుకుంటుంది.

English Review