Zombie Reddy 2021 Telugu Movie Review

Zombie

జాంబి రెడ్డి’ మూవీ రివ్యూ – Zombie Reddy Movie Review

ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జాంబి రెడ్డి’. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో చిత్రాల్లో కనిపించి అలరించిన నటుడు తేజ సజ్జ హీరోగా వచ్చిన సినిమా ఇది. కాగా ‘జాంబి జోనర్‌లో వచ్చిన తొలి తెలుగు సినిమా కూడా ‘జాంబి రెడ్డి’నే. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :




మ్యారియో (తేజ సజ్జా) తన టీమ్ తో ఒక గేమ్ డిజైన్ చేస్తాడు. అయితే, ఆ గేమ్ లో కోడ్ సరిగ్గా లేకపోవడంతో గేమ్ కరెక్ట్ గా ప్లే అవ్వదు. ఆ గేమ్ లో కోడ్ రాసిన తన ఫ్రెండ్ అండ్ టీం మెంబర్ కర్నూలులో పెళ్లి చేసుకుంటూ ఉండగా.. హీరో తన టీమ్ తో కర్నూలుకి వెళ్తాడు. అయితే దారిలో ఒక చిన్న సంఘటన వల్ల హీరో ఫ్రెండ్ జాంబీకి గురి అవుతాడు. దాంతో ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం అందరూ జాంబిలుగా మారతారు. చివరకు హీరో ఆ జాంబిల నుండి ఎలా తప్పించుకుంటాడు ? అలాగే ఆ జాంబిలను తిరిగి మళ్లీ మాములు మనుషులుగా ఎలా మార్చాడు ? అనేదే మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

సీక్రెట్ విష ప్రయోగాల వ‌ల్ల వచ్చే జాంబీ వైరస్ లాంటి వింత రోగాలు వస్తే ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడతారు ? అలాగే వైరస్ బారిన పడిన ప్రజలు ఎలా ప్రవర్తిస్తారో అనే కాన్సెప్ట్‌ తో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆకట్టుకునే అంశాలతో పాటు ఇంట్రస్ట్ గా సాగే డ్రామాతో కూడా సినిమా పర్వాలేదు అనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన తేజ తన పాత్రకు తగ్గట్లు చాల బాగా నటించాడు. ముఖ్యంగా జాంబీ సీన్స్ అండ్ సీక్వెన్స్ లో అలాగే హీరోయిన్ ను సేవ్ చేసే సీన్ లో మరియు కొన్ని హారర్ అండ్ ఎమోషనల్ సన్నివేశాల్లో చక్కని పెర్ఫార్మెన్స్ కనబర్చాడు.

హీరోయిన్ గా నటించిన ఆనంది చాల బాగా నటించింది. క్లిష్టమైన కొన్ని జాంబి యాక్షన్ సన్నివేశాల్లో మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో తన నటనతో ఆకట్టుకుంది. అలాగే విలన్స్ గా నటించిన నటులు కూడా తమ గంబీరమైన నటనతో బాగా నటించారు. అదేవిధంగా ఇతర కీలక పాత్రల్లో నటించిన హర్షవర్ధన్, హరితేజ మరియు మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో మెప్పిస్తారు. కాగా దర్శకుడు మంచి పాయింట్ తో తెరకెక్కించిన ఈ సినిమాలో నేటి పరిస్థితులకు కల్పితాలు జోడించి వింత రోగాల సమస్యలను కళ్లకు కట్టినట్లు చూపించారు. మెయిన్ గా ప్రతి పాత్రను కథలో కలిసిపోయేలా ప్లే రాసుకోవటం బాగుంది.

మైనస్ పాయింట్స్ :




దర్శకుడు మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నా.. ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లేని రాసుకోలేకపోయారు. సినిమాని ఇంట్రస్టింగ్ గా మొదలు పెట్టి.. ఆ తరువాత ఆసక్తి కరంగా సాగని ట్రీట్మెంట్ తో కథను డైవర్ట్ చేశారు. పైగా అనవసరమైన సన్నివేశాలు కూడా ఎక్కువైపోయాయి. పైగా ఆ సీన్స్ అన్ని కూడా.. ఒకేలా సాగుతాయి. ఇంటర్వెల్ కి గాని కథ ముందుకు కదలదు.

అయితే సెకెండ్ హాఫ్ లో జాంబీ సీన్స్ అన్ని ఆసక్తికరంగా సాగిన, కొన్ని హారర్ సన్నివేశాలు మాత్రం జస్ట్ పర్వాలేదనిపిస్తాయి. ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ లాంటి జాంబీ యాక్షన్ హారర్ సీక్వెన్స్ స్ బాగున్నా.. కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే సాగతీసినట్లు చాల స్లోగా సాగుతుంది. పైగా సీరియ‌స్ గా ఎమోషనల్ గా సాగే క‌థలో కుళ్లు జోకులు ఇరికించడంతో సినిమా పై ఆసక్తిని చంపేస్తోంది. ఇక బిసి ప్రేక్షకుల ఆశించే ఎలిమెంట్స్, ట్విస్టులు సినిమాలో కావాలని ఇరికించినట్టు ఉంది.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. సంగీత దర్శకుడు అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను కెమెరామెన్ ఎంతో రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. అయితే ఎడిటర్ సినిమాలోని సాగతీత సన్నివేశాలను తగ్గించి ఉంటే.. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ మరియు జాంబీ సీన్స్ లోని కొన్ని సీన్స్ ను ట్రీమ్ చేసి ఉంటే సినిమాకి బాగా ప్లస్ అయ్యేది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి. ఇక దర్శకుడు ప్రశాంత్ వర్మ మంచి స్టోరీ లైన్ తో అలాగే మంచి టేకింగ్ తో ఆకట్టుకున్నా, సరైన కథనాన్ని మాత్రం రాసుకోలేకపోయారు.

తీర్పు :

‘జాంబి రెడ్డి’ అంటూ వచ్చిన ఈ చిత్రంలో ఆకట్టుకునే అంశాలతో పాటు మంచి టేకింగ్ మరియు ఇంట్రస్ట్ గా సాగే కొన్ని ట్రాక్స్ మరియు కొన్ని జాంబి హారర్ సీన్స్ సినిమాలో బాగా ఆకట్టుకుంటాయి. కాకపోతే రెగ్యులర్ కామెడీ, రొటీన్ హర్రర్ ఎలిమెంట్స్ కొన్ని చోట్ల బోర్ గా అనిపించినా… ఓవరాల్ గా ఆడియన్స్ కు మాత్రం ఈ సినిమా నచ్చుతుంది.

English Review