Color Photo 2020 Telugu Movie Review





Color

కలర్ ఫొటో మూవీ రివ్యూ – Color Photo Movie Review

‘పడి పడి లేచె మనసు’, ‘మజిలీ’ సినిమాల్లో హీరో స్నేహితుడి పాత్రలో నటించిన సుహాస్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘కలర్ ఫొటో’. చాందిని చౌదరి హీరోయిన్. ఆమెకు అన్నయ్యగా విలన్ పాత్రలో సునీల్ నటించారు. ఈ సినిమా ప్రముఖ తెలుగు స్ట్రీమింగ్ యాప్ “ఆహా”లో ఈరోజు సాయంత్రం 6 గంటలకు రిలీజ్ కానుంది. మీడియాకి స్పెషల్ గా షో వేశారు. అది చూసి రివ్యూ ఇస్తున్నాం!

కథ :




జయకృష్ణ (సుహాస్) నల్లగా ఉంటాడు. కానీ, మనిషి మంచోడు. తొలి చూపులో దీపు అలియాస్ దీప్తి (చాందిని చౌదరి)ని చూసి ప్రేమిస్తాడు. కానీ, అమ్మాయికి విషయం చెప్పడు. నల్లగా ఉన్నానని నో అంటుందేమో అని మనసులో ఫీలింగ్ దాచుకుంటాడు. సీనియర్లు జయకృష్ణని బలిపశువును చేసి కాలేజీలో అందరి ముందు కొట్టడంతో దీపుతో పరిచయం ఏర్పడుతుంది. తరువాత ప్రేమగా మారుతుంది. ఈ విషయం ప్రేమకు, ప్రేమికులకు వ్యతిరేకం అయిన దీపు అన్నయ్య ఎస్సై రామరాజు (సునీల్)కి తెలుస్తుంది. ఆ తరువాత ఏం జరిగింది? అనేది మిగిలిన సినిమా.

ప్లస్ పాయింట్స్ :

సుహాస్ కామెడీతో కంటే పెర్ఫార్మన్స్ తో ఎక్కువ ఆకట్టుకున్నాడు. నిజాయతీగా చెప్పాల్సి వస్తే, ఒకటి రెండు సీన్లు మినహా అతడి క్యారెక్టర్లో కామెడీకి స్కోప్ లేదు. కానీ, ఎమోషనల్ సీన్లలో బాగా చేశాడు. తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. కథానాయికగా నటించిన చాందిని చౌదరి నాచురల్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది. స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. క్లైమాక్స్ సీన్లలో ఆడియన్స్ ని ఏడిపిస్తుంది. సునీల్ డిఫరెంట్ విలనిజం చూపించాడు. వైవా హర్ష తన కామెడీ టైమింగ్, డైలాగులతో ఆకట్టుకున్నాడు. సునీల్ వైఫ్ క్యారెక్టర్లో శ్రీవిద్య, హీరోయిన్ ఫ్రెండ్ గా దివ్య పాత్ర పరిధి మేరకు నటించారు. మిగతా నటీనటులు పర్వాలేదు. ఉన్నంతలో బాగా చేశారు.

టెక్నికల్ డిపార్ట్మెంట్ లో మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్. పాటలు బాగున్నాయి. మెలోడీలు మళ్ళీ మళ్ళీ వినాలని అనిపించేలా ఉన్నాయి. నేపథ్య సంగీతం సన్నివేశాల్లో ఎమోషన్ ఎలివేట్ చేసేలా ఉంది. సినిమాటోగ్రఫీ నీట్ గా ఉంది.

మైనస్ పాయింట్స్ :




ప్రొడ్యూసర్ కమ్ రైటర్ సాయి రాజేష్ నీలం ఇచ్చిన కథలో ప్యూర్ లవ్ స్టోరీ, కలర్ కాంఫ్లిక్ట్ ఉన్నాయి. దానికి డైరెక్టర్ సందీప్ రాజ్ బెటర్ డైలాగ్స్ రాశాడు. కానీ, ప్రేక్షకులు అందరిని ఆకట్టుకునేలా ట్రీట్మెంట్ రాసుకోలేకపోయాడు. దీనికి తోడు క్లైమాక్స్ దగ్గరకు వచ్చేసరికి ఎమోషన్ మరీ ఓవర్ అయిందని అనిపిస్తుంది. పైగా, సన్నివేశాలు సాగదీసినట్టు అనిపిస్తాయి.

ప్యూర్ లవ్ స్టోరీ అయినప్పటికీ పిల్లలతో కలిసి చూడాలంటే కొంచెం ఆలోచించుకోవాలి. ఓ కామెడీ సీన్లో డబల్ మీనింగ్ డైలాగ్స్ వచ్చాయి. మరో ఎమోషనల్ సీన్లో బూతు పదం దొర్లింది. ప్రతి లవ్ స్టోరీకి లవ్ ట్రాక్ హైలైట్ అవ్వాలి. దీనికి ఆ లవ్ ట్రాక్ స్ట్రాంగ్ గా లేదు. హీరోయిన్ ప్రేమలో పడటానికి మొదట బలమైన కారణం చూపించలేదు. అందువల్ల, కొన్ని సీన్లతో ఆడియన్స్ కనెక్ట్ కాలేరు. ఫస్టాఫ్ డీసెంట్ గా స్టార్ట్ అయినప్పటికీ తరువాత తరువాత సాగదీసినట్టు అనిపిస్తుంది. ఇంటర్వెల్ కార్డు వరకు ముందుకు కదలదు.

సాంకేతిక విభాగం :

స్టోరీలోని లవ్ ఫీల్ ని డైరెక్టర్ కంప్లీట్ గా ఎలివేట్ చెయ్యలేకపోయాడు. ఎమోషనల్ సీన్లు బాగా హ్యాండిల్ చేశాడు. వెంకట్ ఆర్. శాఖమూరి సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాను అందంగా, పెయింటింగ్ లా చూపించారు. ముందు చెప్పుకున్నట్టు కాలభైరవ పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్లస్ అయ్యాయి. కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ జస్ట్ ఓకే. ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్ ముందు సాగదీత సన్నివేశాలను కొంచెం ట్రిమ్ చేయాల్సింది. ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నాయి.

తీర్పు :

ప్యూర్ లవ్, ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో లవ్ ట్రాక్ అంతగా ఆకట్టుకోనప్పటికీ.. ఎమోషనల్ సీన్లు హార్ట్ టచింగ్ అనేలా ఉన్నాయి. లీడ్ పెయిర్ సుహాస్, చాందిని చౌదరి తమ పెర్ఫార్మన్స్ లతో ఆకట్టుకుంటారు. వాళ్ళ యాక్టింగ్, కాల భైరవ మ్యూజిక్ సినిమాకి ప్లస్ అయ్యాయి. కానీ, డ్రామా ఎక్కువ అవ్వడం.. బోరింగ్ ట్రీట్మెంట్ తో సినిమా ఇంట్రెస్టింగ్ గా సాగదు. కొన్ని ప్లస్ లు, కొన్ని మైనస్ లు ఉన్న ఈ సినిమా కొంతవరకు ఆకట్టుకుంటుంది. ఓటీటీలో ఫార్వార్డ్ చేసుకుంటూ చూడవచ్చు.

English Review