ఒరేయ్ బుజ్జిగా మూవీ రివ్యూ – Orey Bujjiga Movie Review
యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన యూత్ ఎంటర్‌టైనర్ ‘ఒరేయ్ బుజ్జిగా’. ఈ చిత్రం ప్రముఖ తెలుగు స్ట్రీమింగ్ యాప్ “ఆహా”లో ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
బుజ్జి (రాజ్ తరుణ్)ని తన తండ్రి కోటేశ్వరరావు(పోసాని) పెళ్లి చేసుకోమని బలవంతపెట్టడంతో చెప్పకుండా ఇంటి నుండి వెళ్ళిపోతాడు బుజ్జి. అదే సమయంలో అదే ఊరి నుండి పెళ్లి కూతురు కృష్ణవేణి (మాళవిక నాయర్) తన బావతో పెళ్లి ఇష్టం లేక పారిపోతుంది. దాంతో వీరిద్దరూ లేచిపోయారనే పుకారు ఆ ఊరంతా పాకి ఇరు కుటుంబాల మధ్య గొడవలకు దారితీస్తోంది. మరోపక్క ఇంటి నుండి పారిపోయే సమయంలో బుజ్జి – కృష్ణవేణి అనుకోకుండా ట్రైన్ లో కలుసుకోవడం.. ఇద్దరూ తమ మారు పేర్లతో పరిచయం అవుతారు. ఆ మారు పేర్లు అయినశ్రీను – స్వాతిగానే వాళ్ళు ప్రేమలో పడతారు. చివరకు వీరికి ఒకరికి ఒకరు ఎవరనేది ఎలా తెలుస్తోంది.అంతలో సృజన (హెబ్బా పటేల్)తో బుజ్జిగాడి సిల్లీ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ ఏమిటి ? ఈ మధ్యలో కృష్ణవేణికి బుజ్జికి వచ్చిన సమస్యలు ఏమిటి ? వీరిద్దరూ ఆడిన చిన్న అబద్దాలు కారణంగా వీరి జీవితాల్లో ఎలాంటి డ్రామా నడిచింది ? అంతిమంగా వీరు ఎలా ఒకటి అయ్యారు ? అనేదే మిగిలిన కథ.అనేదే మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
‘ఒరేయ్ బుజ్జిగా’ అంటూ రాజ్ తరుణ్ ఫుల్ ఎంటర్ టైన్మెంట్ తో మెస్మరైజ్ చేయకపోయినా తన కామెడీ టైమింగ్ తో అక్కడక్కడా బాగానే నవ్వించాడు. సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ సంగతి పక్కన పెడితే.. హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. ఎప్పటిలాగే సరదాగా తిరిగే కుర్రాడి పాత్రలో తన ఈజ్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. ఇక కథానాయకిగా నటించిన మాళవిక నాయర్ న్యాచురల్ ఆర్టిస్ట్ అని మళ్ళీ ప్రూవ్ చేసుకుంది. తన పెర్ఫార్మెన్స్ తో తన స్క్రీన్ ప్రెజెన్స్ తో బాగా ఆకట్టుకుంది ముఖ్యంగా ప్రేమ సన్నివేశాలతో పాటు, కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లోనూ మాళవిక తన నటనతో మెప్పించింది.
ఇక ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటించిన హెబ్బా పటేల్ తన నటన కంటే కూడా తన గ్లామర్ తోనే మెప్పించడానికి కృషి చేసింది. అలాగే మరో కీలక పాత్రలో నటించిన సప్తగిరి నవ్వించడానికి చాల కష్టపడ్డాడు. ఇక హీరోయిన్ తల్లిగా నటించిన వాణి విశ్వనాధ్ ముఖ్యమైన పాత్రలో కనిపించింది. అయితే ఆమెకు ఈ సినిమా తెలుగులో మంచి రీఎంట్రీగా అయితే మిగలకపోవచ్చు. ఇక పోసాని, నరేష్, సత్య తమ పాత్రలకు న్యాయం చేశారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. సినిమాలో అనూప్ అందించిన సంగీతం సినిమాకి బాగా ప్లస్ అయింది. ఇక సినిమాలో అన్ని క్యారెక్టర్స్ కి ఇచ్చిన జస్టిఫికేషన్ బాగుంది.
మైనస్ పాయింట్స్ :
దర్శకుడు కొండా విజయ్‌కుమార్ యూత్ కి, ఫ్యామిలీస్ కి నచ్చే అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టడానికి స్కోప్ ఉన్న కంటెంట్ తీసుకున్నా.. ఆ కంటెంట్ కి తగట్లు పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ట్రీట్మెంట్ రాసుకోలేకపోయాడు. దీనికి తోడు ఉన్న డ్రామా మరియు కామెడీ సన్నివేశాలు కూడా పూర్తిగా ఆకట్టుకునే విధంగా ఉండవు. పైగా సినిమా స్క్రీన్ ప్లే కూడా బోరింగ్ గా సాగుతుంది.
యూత్ తో పాటు ఫ్యామిలీ అంతా సినిమా చూసి హ్యాపీ గా నవ్వుకున్నే సినిమా అంటూ చేసిన హడావుడికి, సినిమాలోని ఎంటర్ టైన్మెంట్ లెవల్ కి చాల వ్యత్యాసం ఉంది. ఫస్ట్ హాఫ్ లో డ్రామా సీన్స్ మినహా మిగతా సన్నివేశాలు అన్నీ ఆకట్టుకోవు. ఇక సెకెండాఫ్ ని కూడా ఫుల్ ఎంటర్ టైన్ గా నడుపుదామని దర్శకుడు బాగానే ప్రయత్నం చేశాడు, కాకపోతే ఎక్కడా ఆ ఫన్ వర్కౌట్ కాలేదు. ఒక్క సప్తగిరి హాస్పిటల్ సీన్ మాత్రం బాగా నవ్విస్తోంది.
ఇక సినిమాలోని మెయిన్ డ్రామాని ఇంకా ఆసక్తికరంగా నడిపే అవకాశం ఉన్నప్పటికీ.. విజయ్ కుమార్ మాత్రం తన శైలిలోనే సినిమాని మలిచారు. డైరెక్టర్ స్క్రిప్ట్ పై ఇంకా శ్రద్ద పెట్టి ఉంటే సినిమా అవుట్ ఫుట్ బెటర్ గా వచ్చేది. అలాగే అందరు మంచి టెక్నీషియన్స్ ఉన్నా.. దర్శకుడు కంటెంట్ బలంగా ఎలివేట్ అయ్యేలా వారి నుండి అవుట్ ఫుట్ ను రాబట్టుకోలేకపోయాడు.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగం గురించి చెప్పుకుంటే.. దర్శకుడు కథలోని డ్రామాని స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. ఆండ్రూ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ ఆయన చాలా అందంగా చూపించారు. సంగీత దర్శకుడుఅనూప్ అందించిన పాటల్లో రెండు బాగున్నాయి. అలాగే కొన్ని సన్నివేశాల్లో ఆయన అందించిన నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. ఇక ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాగున్నా, సెకండ్ హాఫ్ లోని సాగతీత సన్నివేశాలను ఇంకా కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. ఇక సినిమాలోని నిర్మాత కె.కె.రాధా మోహన్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
తీర్పు :
రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ అంటూ వచ్చిన ఈ సినిమా.. అక్కడక్కడా కొన్ని కామెడీ సీన్స్ తో మరియు కొన్ని లవ్ సీన్స్ తో కొన్ని చోట్ల బాగానే అలరిస్తుంది. ఇక మాళవిక నటన, రాజ్ తరుణ్ కామెడీ ఈజ్, హెబ్బా గ్లామర్ సినిమాకి ప్లస్ అయ్యాయి. కానీ నెమ్మదిగా సాగే కథనం, చాలా సన్నివేశాలు మరీ నాటకీయంగా ఉండటం, దీనికి తోడు బోరింగ్ ట్రీట్మెంట్ తో సినిమా ఇంట్రస్ట్ గా సాగదు. మొత్తం మీద ఈ సినిమాలో యూత్ కి నచ్చే అంశాలు కొన్ని ఉన్నా.. మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను మాత్రం ఈ సినిమా ఆకట్టుకోదు.