47 డేస్ మూవీ రివ్యూ – 47 Days Movie Review
హీరో సత్యదేవ్, పూజా ఝవేరీ, రోషిణి ప్రకాష్ ప్రధాన పాత్రలుగా వచ్చిన సినిమా ’47 డేస్’. ఈ సినిమాకి ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించారు. ఈ లాక్ డౌన్ సమయంలో ఈ సినిమా ఓటిటిలో రిలీజ్ అయింది. ‘జీ5’లో అందుబాటులో ఉంది. మరి ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలోకి వెళ్లి చూద్దాం.
కథ :
సత్య (సత్యదేవ్) ఏసీపీ.. చిన్నప్పటి నుండి తనతో అనాధ ఆశ్రమంలో పెరిగిన పద్దూ (రోషిణి ప్రకాష్)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఇక అంతా హ్యాపీగా వెళ్తున్న వాళ్ల లైఫ్ లో సడెన్ గా పద్దూ ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. అసలు పద్దూ అలా ఎందుకు చేసిందో అర్ధం కాక సత్య డిప్రెషన్ లో వెళ్లి జాబ్ నుండి సస్పెండ్ అవుతాడు. ఈ మధ్యలో బిజినెస్ మెన్ శ్రీనివాస్ అనే వ్యక్తి ఆత్మహత్య కేసు సత్య దృష్టికి వస్తోంది. శ్రీనివాస్ ఆత్మహత్యకి పద్దూ ఆత్మహత్యకి సంబంధం ఉందేమోనని సత్యకి అనుమానం రావడంతో, శ్రీనివాస్ కేసు పై విచారణ చేస్తాడు. ఈ క్రమంలో సత్య ఎదురుకున్న సమస్యలు ఏమిటి ? ఇంతకీ పద్దూ ఎందుకు ఆత్మహత్య చేసుకుంది ? ఆమె చావు వెనుక ఉన్న రహస్యం ఏమిటి ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాని చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
సత్యదేవ్ వన్ మ్యాన్ షోతో నడిచిన ఈ సినిమాలో.. సత్యదేవ్ రెండు గెటప్స్ లో చక్కగా నటించాడు. ముఖ్యంగా తన డైలాగ్ డెలివరీ మరియు తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని ఎమోషనల్ అండ్ సప్సెన్స్ సీక్వెన్స్ స్ లో సత్యదేవ్ చాలా బాగా నటించాడు. సినిమాకే హైలైట్ గా నిలిచాడు. ఇక హీరోయిన్ గా నటించిన రోషిణి ప్రకాష్ తన క్యూట్ అండ్ హోమ్లీ లుక్స్ లో అందంగా కనిపిస్తూ.. తన నటనతోనూ ఆకట్టుకుంది.
సెకెండ్ హీరోయిన్ గా చేసిన పూజాజవేరి కూడా బాగానే నటించింది. విలన్ గా నటించిన నటుడు కూడా చాల బాగా నటించాడు. అలాగే హీరో ఫ్రెండ్ మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. ఇక దర్శకుడు తీసుకున్న స్టోరీ లైన్, రాసుకున్న కొన్ని లవ్ సీక్వెన్స్ బాగున్నాయి. అలాగే సెకెండ్ హాఫ్ లో ఆయన రాసుకున్న కొన్ని సస్పెన్స్ సీన్స్ మరియు విలన్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ట్విస్ట్ కూడా పర్వాలేదనిపిస్తోంది. చివర్లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సినిమాని ముగించడం కూడా పర్వాలేదు.
మైనస్ పాయింట్స్ :
ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తీసుకున్నపుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ రక్తి కట్టేలా సినిమా సాగితేనే.. ఆడియన్స్ ను ఆకట్టుకోగలం. ఈ సినిమాలో కొన్ని ఎమోషనల్ అండ్ సస్పెన్స్ సీన్స్ ఆకట్టుకున్నా.. మిగతా సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. దర్శకుడు సెకెండాఫ్ ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఇంట్రస్ట్ గా నడుపుదామని మంచి ప్రయత్నం అయితే చేశారు గాని, అది స్క్రీన్ మీద ఎఫెక్టివ్ గా వర్కౌట్ కాలేదు.
దీనికి తోడు మెయిన్ గా సినిమాలో ఇంట్రసింగ్ ప్లే మిస్ అయింది. కొన్ని సీన్స్ గందరగోళంగా సాగుతున్న ఫీలింగ్ కలిగిస్తాయి. సినిమాలో హీరో హీరోయిన్ల క్యారెక్టైజేషన్స్ కూడా ఇంకా ఎఫెక్టివ్ రాసుకోవాల్సింది. అలాగే సెకెండ్ హారోయిన్ క్యారెక్టర్ కూడా సినిమాకి మైనస్ అయింది. పైగా ఆమె ట్రాక్ బలహీనమైన ఎమోషన్ కి లోబడి బలహీనంగా సాగడం కూడా బాగాలేదు. పైగా సినిమాలో కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువడంతో ఆ సన్నివేశాల్లో సహజత్వం లోపించింది. మొత్తానికి దర్శకుడు ప్రదీప్ మద్దాలి మంచి అటెంప్ట్ చేశాడు గానీ, అది ఎఫెక్టివ్ గా వర్కౌట్ కాలేదు.
సాంకేతిక విభాగం :
టెక్నికల్ గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. మ్యూజిక్ సినిమాకు ప్లస్ ఆయింది. అదే విధంగా సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ పనితనం చాలా బాగుంది. సినిమాలోని నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు. అయితే దర్శకుడు ఆకట్టుకునే ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకుని ఉండి ఉంటే ఇంకా బాగుండేది.
తీర్పు :
’47 డేస్’ అంటూ వచ్చిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో మరియు ఫ్యూ ఎమోషనల్ సీన్స్ తో ఆకట్టుకున్నా.. ఇంట్రస్టింగ్ గా సాగని ట్రీట్మెంట్ తో పాటు మెయిన్ క్యారెక్టైజేషన్స్ బలహీనంగా ఉండటం, పైగా సినిమాలో ఫేక్ ఎమోషన్స్ వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. అయితే ఈ లాక్ డౌన్ లో ఖాళీగా ఉంటే మాత్రం.. సత్యదేవ్ నటన కోసమైనా ఈ సినిమాని చూడొచ్చు.