Athade Srimannarayana 2020 Telugu Movie Review

Athade

అతడే శ్రీమన్నారాయణ మూవీ రివ్యూ – Athade Srimannarayana Movie Review




కొద్దిరోజులుగా బాగా ప్రచారంలో ఉన్న శాండల్ వుడ్ కి చెందిన డబ్బింగ్ మూవీ అతడే శ్రీమన్నారాయణ. రక్షిత్ శెట్టి, శాన్వి జంటగా నటించిన ఈ చిత్రం నేడు విడుదలైనది. మరి ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఎంత వరకు ఆ అంచనాలను అందుకుందో చూద్దాం..

కథ :

అధీరా అనబడే ఒక తెగ మరుగునపడిపోయిన ఓ నిధి కొరకు తీవ్ర అన్వేషణ చేస్తూ ఉంటారు. ఐతే వారు ఎంత ప్రయత్నించినా దాని జాడను కనిపెట్టలేకపోతారు. 15ఏళ్ల తరువాత శ్రీమన్నారాయణ( రక్షిత్ శెట్టి) అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఆ నిధి జాడను కనిపెట్టే ప్రయత్నాలు మొదలుపెడతాడు. అసలు ఈ శ్రీమన్నారాయణ నేపథ్యం ఏమిటీ? ఆ నిధికి శ్రీమన్నారాయణకు ఉన్న సంబంధం ఏమిటీ? ఆ నిధిని చేరుకునే క్రమంలో అతను ఎదుర్కొన్న ఒడిదుడుకులు ఏమిటీ? ఎవ్వరూ కనిపెట్టలేని ఆ నిధిని శ్రీమన్నారాయణ చేరుకున్నాడా? ….అనేదే మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :

సాధారణంగా అనేక సినిమాలలో నిధిని వెతికే కథలకు భిన్నంగా దర్శకుడు సచిన్ భిన్నమైన ట్రీట్మెంట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించి అందులో శ్రీమన్నారాయణ అనే పోలీస్ పాత్ర ద్వారా కథ నడిపిన తీరు బాగుంది.

ఉన్నతమైన నిర్మాణ విలువలు కలిగిన ఈ సినిమా విజువల్స్ పరంగా గ్రాండ్ గా ఉంది. పజిల్ లా నడిచే ఈ మూవీ ఆసక్తిగా కరంగా సాగుతూ వెళుతుంది. కథలోని చాలా మలుపులు తెరపై చక్కగా ఆవిష్కరించారు.
హీరో రక్షిత్ శెట్టి ఎనర్జిటిక్ పోలీస్ అధికారిగా భిన్నమైన పాత్రలో జీవించారు. తెరపై ఆయన ప్రజెన్స్ మరియు మేనరిజం బాగా పేలాయి.

తన గత చిత్రాలకు భిన్నంగా శాన్వి నటనకు ప్రాధాన్యం ఉన్న రోల్ దక్కించుకోవడమే కాకుంగా ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసింది. మూవీ నిర్మాణ విలువలతో పాటు, కెమెరా వర్క్ అభినందించాల్సిన విషయాలు.




మైనస్ పాయింట్స్ :

ఈ సినిమా ప్రధాన బలహీనత అయోమయానికి గురిచేసే నెరేషన్. చాలా సంధర్భాలలో ఈ కథ, దానిని చెప్పిన విధానం ప్రేక్షకుడిని అయోమయానికి గురిచేస్తుంది. కథలో చాలా లాజిక్స్ సాధారణ ప్రేక్షకుడికి అంతుబట్టవు.

ఇక మూడు గంట సుదీర్ఘమైన సినిమా చాలా చోట్ల ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. ఇక చాల వరకు కన్నడ ఫ్లేవర్ లో సాగే ఈ చిత్రం తెలుగు నేటివిటీకి దూరంగా సాగింది.

నెమ్మదిగా సాగే స్క్రీన్ ప్లే ఒకింత నిరాశ కలిగించే విషయం. మొదటి నుండి నిధి కొరకు జరిగిన సంఘర్షణ, దాని గురించి జరిగిన చర్చ చూసిన ప్రేక్షకుడికి నిధిని కనిపెట్టే సన్నివేశాలు పతాక స్థాయిలో చాలా రిచ్ గా ఆసక్తి కరంగా ఉంటాయి అని అందరూ భావిస్తారు. కానీ దానికి భిన్నంగా నిధిని ఛేదించే సన్నివేశాలు సంఘర్షణ లేకుండా తేల్చివేశారు.

సాంకేతిక విభాగం :

ముందుగా చెప్పిన విధంగా అతడే శ్రీమన్నారాయణ చిత్రంలో నిర్మాణ విలువలు చాల ఉన్నతంగా ఉన్నాయి. రిచ్ విజువల్స్ ప్రేక్షకుడికి ఆహ్లాదం పంచుతాయి . తెలుగు డబ్బింగ్ బాగా కుదిరింది. పీరియాడిక్ కథకు తగ్గట్టుగా పాత్రల పేర్లు తెలుగు నేటివిటీకి దగ్గట్టుగా పెట్టడం ఆకట్టుకుంది.

ఇక మూవీలో బీజీఎమ్ హైలైట్ గా ఉంది. దర్శకుడు సచిన్ గురించి చెప్పాలంటే గత చిత్రాలకు భిన్నంగా ట్రెజర్ హంటింగ్ కథకు భిన్నమైన ట్రీట్మెంట్ ఇచ్చాడు. ఐతే కథను పట్టులేని స్క్రీన్ ప్లే తో అత్యధిక నిడివితో మెల్లగా నడిపి ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టాడు.

తీర్పు :

భారీ అంచనాల మధ్య విడుదలైన అతడే శ్రీమన్నారాయణ ఆ అంచనాలు అందుకోలేదనే చెప్పాలి. ఆసక్తికరమైన కథకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ పసలేని స్క్రీన్ ప్లే, పరిమితికి మించిన నిడివి, అర్థం కాని కథా మలుపులు చిత్రాన్ని దెబ్బ తీశాయి. ఐతే రక్షిత్ శెట్టి పాత్ర, మూవీ నిర్మాణ విలువలు, విజువల్స్ ప్రేక్షకుడికి మంచి అనుభూతిని ఇస్తాయి. పతాక సన్నివేశాలతో పాటు, బలమైన స్క్రీన్ ప్లే రాసుకొని ఉంటే ఈ చిత్ర ఫలితం మరోలా ఉండేది.

English Review