నేనే కేడీ నెం 1 మూవీ రివ్యూ ఆడియో – Nene Kedi No 1 Movie Review Audio
జాని దర్శకత్వంలో షకలక శంకర్ హీరోగా ముస్కాన్ హీరోయిన్ గా వచ్చిన చిత్రం `నేనే కేడీ నెం-1′. ఆర్ ఏ ఆర్ట్ ప్రొడక్షన్స్ బేనర్ పై ఎం.డి రౌఫ్ సమర్పణలో జాని స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ సినిమా ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
ఈ సినిమాలో ‘ఇదీ.. కథ’ అని చెప్పలేం (బహుశా ఈ సినిమా డైరెక్టర్ కూడా చెప్పలేకపోవచ్చు) కాకపోతే కథ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి.. కథ లేని ఈ సినిమాని ఒక కథగా చెప్పుకుంటే.. జాకీ (షకలక శంకర్) చిన్నప్పటి నుండి తల్లిదండ్రుల ప్రేమకు, బాధ్యతకు దూరమై.. వ్యసనాల భారిన పడి.. అవకాశం ఉన్న ప్రతి అమ్మాయితో తిరిగి.. చివరికీ, చేసిన తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నంలో ఆయనగారు తనలా తల్లిదండ్రుల ప్రేమకు దూరంగా పెరుగుతున్న పిల్లలను గుర్తించి, వారిని కిడ్నాప్ చేసేసి.. వారికి తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమను కురిపిస్తా ఉంటాడు (అని మనం అనుకోవాలి). ఇక ఈ క్రమంలో శంకర్ (షకలక శంకర్ సెకెండ్ రోల్) సీన్స్ మెయిన్ గా నడుస్తుంటాయి. అన్నట్లు ఈయన కూడా హీరోనే. కాకపోతే ఆ (జాకీ) శంకర్ కి, ఈ శంకర్ కి సినిమాలో ఎక్కడా సంబంధం గాని, లింక్ గాని ఉండవు. అలాగే మధ్యమధ్యలో ఓ లేడి పోలీస్ ఆఫీసర్ (నికిషా పటేల్) సీన్స్ కూడా వస్తాయనుకోండి. మరి ఆవిడ సీన్స్ సడెన్ గా ఎందుకొస్తాయి ? అసలు ఆవిడకి కథకు ఉన్న సంబంధం ఏమిటి ? జాకీ అండ్ శంకర్ పరిస్థితి ఏమిటి ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో హీరోగా నటించిన షకలక శంకర్ నటన పరంగా బాగానే ఆకట్టుకుంటాడు. అక్కడక్కడా తన కామెడీ టైమింగ్ తో అలరించాడు. ఇక హీరోయిన్ గా నటించిన ముస్కాన్ తన నటనతో పాటు తన గ్లామర్ తోనూ ఆకట్టుకున్నే ప్రయత్నం చేసింది. సినిమాలో ’30 ఇయర్స్ ఇండస్ట్రీ’ పృథ్వీరాజ్ అలాగే మిగిలిన కమెడియన్స్ తమ కామెడీ టైమింగ్ తో ఒకటి రెండు సీన్స్ లో నవ్వించే ప్రయత్నం చేశారు. అలాగే విలన్ బిజ్జులా నటించిన నటుడు కూడా తన ఆహార్యంతో కొన్ని సీన్స్ లోనైనా సీరియస్ నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఇక తల్లిదండ్రుల ప్రేమకు దూరంగా పెరుగుతున్న పిల్లల కష్టాన్ని చెప్పే సన్నివేశం సినిమాలో కాస్త ఎమోషనల్ గా పర్వాలేదనిపిస్తోంది. ఇక సినిమాలో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు నటించే ప్రయత్నం చేశారు.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాలో చెప్పుకోవడానికి చాలా క్యారెక్టర్స్ చాలా సీక్వెన్స్ స్ ఉన్నాయి కానీ.. ఏది ఇంట్రస్టింగ్ గా సాగదు. సినిమా చూశాక.. సినిమాలో చాల సన్నివేశాలను దర్శకుడు తనకు తోచినట్లు రాసుకుంటూ తీసుకుంటూ వెళ్ళిపోయాడా అన్న భావన కలుగుతుంది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో చాలా భాగం పోలీస్ లు అవినీతి చేస్తున్నారని చెప్పడానికే సరిపోయింది. దీనికి తోడు అనవసరమైన హీరో బిల్డప్ షాట్స్ ఒకటి. షకలక శంకర్ ను ఒక మాస్ హీరో రేంజ్ లో చూపించడానికే ఎక్కువ సమయం తీసుకున్న దర్శకుడు.. ఆ తరువాత కూడా ప్లో లేని సీన్లతో, అలరించని కామెడీతో సినిమాని నడిపాడు.
దాంతో సినిమాలో హీరోగా కనిపించటానికి షకలక శంకర్ అనవసరమైన హీరోయిజం చూపించడంతో ప్రేక్షకులకు కాస్త ఇబ్బందిగా అనిపిస్తోంది. అయినా షకలక శంకర్ నుండి కామెడీ కోరుకుంటారు గాని, యాక్షన్ కాదు. కానీ ఈ సినిమాలో కామెడీ కంటే.. యాక్షన్ సీన్స్ ఎక్కువ ఉంటాయి. దర్శకుడు ఉన్న కంటెంట్ ను చివరికీ ఆర్టిస్ట్ లను కూడా పూర్తిగా వాడుకోలేదు. మొత్తానికి దర్శకుడు ఏదో ప్రయత్నం చేసినప్పటికీ.. ప్రేక్షకులను మాత్రం ఈ సినిమా నిరుత్సాహ పరుస్తోంది.
సాంకేతిక విభాగం :
దర్శకుడు రాసుకున్న స్క్రిప్ట్ ఏ మాత్రం బాగాలేదు. దీనికి తోడు స్క్రీన్ మీదకు సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. పైగా ఆయన రాసుకున్న స్క్రిప్ట్ లో ఎక్కడా కథకథనాలు అంటూ పెద్దగా కనిపించవు. కెమెరామెన్ కెమెరా పనితనం కొన్ని సన్నివేశాలల్లో పర్వాలేదనిపిస్తుంది. అజయ్ పట్నాయక్ అందించిన పాటల్లో ఓ పాట ఆకట్టుకుంటుంది. ఆయన అందించిన నేపధ్య సంగీతం సినిమాకి తగ్గట్లే సాగింది. ఎడిటర్, దర్శకుడు అభిరుచికి తగ్గట్లే ఎడిటింగ్ చేసుకుంటూ వెళ్లిపోయారు. నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్లుగానే ఉన్నాయి.
తీర్పు :
నేనే కేడీ నెం-1 అంటూ షకలక శంకర్ హీరోగా వచ్చిన ఈ చిత్రం ఏమాత్రం ఆకట్టుకునే విధంగా సాగకపోగా.. నిరుత్సాహ పరుస్తోంది. షకలక శంకర్ నటన పర్వాలేదనిపించినప్పటికీ.. సినిమాలో కథాకథనాలు సరిగ్గా లేకపోవడం, ఉన్నదాంట్లో కూడా కన్వీన్స్ కానీ ట్రీట్మెంట్ ఉండటం, మరియు లాజిక్ లేని సన్నివేశాలు అలాగే ఏ మాత్రం ఆసక్తికరంగా సాగని ప్లే లాంటి అంశాలు కారణంగా ఈ సినిమా ఫలితం దెబ్బ తింది. మొత్తానికి ఈ సినిమా ఏ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకోదు.