Edaina Jaragochhu 2019 Telugu Movie Review

Edaina

ఏదైనా జరగొచ్చు మూవీ రివ్యూ ఆడియో – Edaina Jaragochhu Movie Review Audio




 

సీనియర్ నటుడు రవిరాజా కుమారుడు విజయ్ రాజా హీరోగా పరిచయమవుతూ తెరకెక్కిన చిత్రం ఏదైనా జరగొచ్చు. ఈ చిత్రాన్ని హారర్ థ్రిల్లర్ గా నూతన దర్శకుడు రమాకాంత్ తెరకెక్కించారు. పూర్తిగా నూతన నటీనటులతో తెరకెక్కిన ఈ చిత్రం నేడు విడుదలైంది. మరి ఏదైనా జరగొచ్చు చిత్రం ఎలా ఉందో ఇప్పుడు సమీక్షలో చూద్దాం.

కథ :

సులభంగా డబ్బు సంపాదించి జీవితంలో ఎదగాలని ఎప్పుడూ ఆలోచించే జై (విజయ్ రాజా) అందుకోసం, తన చిన్న నాటి మిత్రులైన రాఘవ,రవి శివ తేజ తో కలిసి స్థానికంగా పెద్ద రౌడీ అయిన కాళీ జోలికి వెళతారు. ఆ రౌడీ నుండి తమని తాము కాపాడుకొనే క్రమంలో ఈ ముగ్గురు మిత్రులు కాళీ వ్యక్తిగత జీవితాన్ని డిస్టబ్ చేస్తారు.దీనితో ఈ ముగ్గురు కాళీ కోపానికి కారకులవుతారు. అసలు కాళీ ఎవరు? ఈ ముగ్గురు యువకులు కాళీ నుండి ఎలా తప్పించుకొని బయటపడతారు? సమాజంలో ఫూల్స్ గా పేరుపడిన ఈ ముగ్గురి కథ ఎలా ముగుస్తుంది? అనేది తెరపైన చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

ముఖ్యంగా ఈ మూవీలో రొటీన్ కి భిన్నంగా ప్రత్యేకంగా హీరో అంటూ ఎవరూ ఉండరు. కథలో అన్ని పాత్రలకి సమాన పరిధి, ప్రాముఖ్యత ఉంటుంది. ఫూల్స్ పాత్రలు చేసిన ముగ్గురు యువకులకు కథలో కీలక పోర్షన్ ఉంటుంది. తమిళ నటుడు బాబీ సింహాదే ఈ చిత్రంలో కీలకపాత్ర, మాస్ అవతార్ లో కనిపించే సీరియస్ విలన్ పాత్రలో ఆయన అలరించారు. బాబీ సింహా పై వచ్చే కొన్ని సన్నివేశాలు ఉత్కంఠత కలిగిస్తాయి. బాబీ సరసన చేసిన నటి తన పాత్రకు 100 శాతం న్యాయం చేసింది .

ఇక చిత్రంలో హీరోగా చేసిన విజయ్ రాజా పాత్రను ఎలివేట్ చేశేలా ఎటువంటి ఇంట్రడక్షన్ సాంగ్, ఫైట్స్ లేకుండా కథకు తగ్గట్టుగా పరిచయం చేసిన విధానం బాగుంది. ఉత్కంట కలిగే సన్నివేశాలతో పాటు, సీరియస్ గా నడిచే సన్నివేశాలలో విజయ్ రాజా కొత్తవాడైనప్పటికీ చాలా వరకు మెప్పించారు. ఇక విజయ్ రాజా స్నేహితులుగా చేసిన రాఘవ, రవి శివ తేజ మొదటి సగంలో చక్కని వినోదాన్ని పంచడంతో పాటు, రెండవ భాగంలో వచ్చే సీరియస్ సన్నివేశాల్లో కూడా నటనతో ఆకట్టుకుంటారు.

ఇక హీరోయిన్ పూజా సోలంకి ప్రాధాన్యం ఉన్న పాత్రలో తన పరిధిమేర మంచి నటనను కనబరిచింది. పతాక సన్నివేశాలలో ఆమె నటన ఆకట్టుకుంటుంది. యాక్టర్ అజయ్ ఘోష్ తక్కువ నిడివి గల పాత్రలో పతాక సన్నివేశాలలో కీలకంగా మారిన తీరు బాగుంది. ఇక చివరిగా స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ క్రేజి డైరెక్టర్ పాత్రలో తెరపై కొంత సేపు నవ్వులు పూయించారు.




మైనస్ పాయింట్స్ :

ఆసక్తికరంగా సాగిన మొదటి సగంతో పాటు, ఉత్కంఠ రేపే విరామం తరువాత ప్రేక్షకుడుకి రెండవ భాగంలో మంచి హారర్ కామెడీ చూడబోతున్నామనే భావన కలుగుతుంది. దానికి భిన్నంగా విరామం తరువాత చిత్రం పట్టుకోల్పోయింది.

కాళీ గతాన్నీ చెప్పే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అలరించినప్పటికీ నిడివి ఎక్కువైనట్లు అనిపించింది. ఇక క్లైమాక్స్ ముందు వచ్చే ఐటెం సాంగ్ చిత్రానికి అదనపు ఆకర్షణ కాకపోగా, సినిమా మూడ్ ని దెబ్బతీసేలా సాగింది.

మూవీ పతాక సన్నివేశాలు హడావిడిగా ముగించినట్లుగా అనిపించింది. అలాగే క్లైమాక్స్ లో వచ్చిన కొన్ని వి ఎఫ్ ఎక్స్ సన్నివేశాలు కథకు అవసరం లేదన్న భావన కలిగించాయి.

సాంకేతిక విభాగం :

ఓ క్రైమ్ నేపథ్యంలో సాగే కథని కామెడీ తో మిక్స్ చేసి దర్శకుడు రమాకాంత్ తెరకెక్కించారు. క్రైమ్ సంబందించిన సన్నివేశాలను తెరకెక్కించడంలో విజయం సాధించిన ఆయన సెకండ్ హాఫ్ లో మాత్రం కథలోని వేరియేషన్స్ చెప్పే క్రమంలో అక్కడక్కడా తడబడ్డాడు. అనుకున్న కథకు ఆయన ఇంకొంచెం బలమైన స్క్రీన్ ప్లే రాసుకొని ఉంటే మూవీ మరోలా ఉండేది.ట్రెండ్ కి తగ్గట్టుగా అక్కడక్కగా పేలే కొన్ని డైలాగ్స్ మంచి అనుభూతినిస్తాయి.

ఎడిటింగ్ వర్క్ పర్వాలేదని పించింది. థ్రిల్లర్స్ ఎప్పుడైనా తక్కువ నిడివి ఉన్నప్పుడే ప్రేక్షకుడికి మంచి అనుభూతి కలుగుతుంది. ఇక కథకు తగ్గట్టుగా కెమెరా వర్క్ సాగింది. చేసింగ్, క్యాచింగ్ సన్నివేశాలలో కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది.

ఇక శ్రీకాంత్ పెండ్యాల అందించిన సంగీతం బీజీఎమ్ వరకు బాగుంది. ఆయన అందించిన బీజీఎమ్ కొన్ని సన్నివేశాలకు మంచి ఫీల్ ని యాడ్ చేసింది. కానీ చిత్రంలోని ఏ ఒక్క పాట కూడా ప్రేక్షకుడికి ఆహ్లాదం కలిగించదు. చిన్న బడ్జెట్ చిత్రాల నుండి భారీ నిర్మాణ విలువలు ఆశించకూడదు కాబట్టి, చిత్ర పరిధిలో నిర్మాణ విలువలు పర్వాలేదు అనిపించాయి.

తీర్పు :

మొత్తంగా చెప్పాలంటే ఏదైనా జరగొచ్చు అక్కడక్కడా అలరించే క్రైమ్ నేపథ్యంలో సాగే హారర్ కామెడీ చిత్రం. బాబీ సింహా,శశి సింగ్ ల నటనతో ఆసక్తికరంగా సాగే మొదటిసగం తరువాత కీలమైన రెండవ భాగం ప్రేక్షకుడికి అంచనాలను పూర్తిగా అందుకోలేదు. మంచి కథను ఎంచుకున్న దర్శకుడు దానికి తగ్గ స్క్రీన్ ప్లే రాసుకోకపోవడంతో ఏమైనా జరగొచ్చు ఆద్యంతం అలరించడంలో విఫలం చెందింది.

English Review