4 Letters 2019 Telugu Movie Review

4 Letters Review

4 లెట‌ర్స్‌ మూవీ రివ్యూ ఆడియో – 4 Letters Movie Review Audio

 

ఆర్‌.ర‌ఘురాజ్ ద‌ర్శ‌కత్వంలో ఈశ్వ‌ర్‌, టువ చ‌క్ర‌వ‌ర్తి, అంకిత మ‌హారాణా హీరో హీరోయిన్లుగా వచ్చిన చిత్రం ‘4 లెట‌ర్స్‌’. ‘కుర్రాళ్ళకి అర్ధమవుతుందిలే’ అన్నది ఉప శీర్షిక. ఈ చిత్రాన్ని దొమ్మ‌రాజు హేమ‌ల‌త‌, దొమ్మ‌రాజు ఉద‌య్‌కుమార్ నిర్మించారు. కాగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో ఒక్కసారి సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం..

కథ :

విజ్జు (ఈశ్వర్) టాప్ బిజినెస్ మెన్ కొడుకు. కొన్ని వందల కోట్లకు ఒక్కడే వారసుడు, అతను బి.టెక్ చదువుతుంటాడు. మోస్ట్ ఇంటిలిజెంట్‌ ఫెలో. అతను అడిగే ప్రశ్నలకు కాలేజీ లెక్చరర్స్ కూడా భయపడుతుంటారు. పైగా విజ్జు తండ్రి కూడా ఎన్ని కోట్లు అయిన ఖర్చు పెట్టి, లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చెయ్యమని కొడుకుని ఎంకరేజ్ చేస్తుంటాడు. కాగా ఈ క్రమంలో అనుకోకుండా పొరపాటున జరిగిన ఓ సంఘటన కారణంగా అంజలి (టువ చ‌క్ర‌వ‌ర్తి) అతను చెప్పినట్లు వినాల్సి వస్తోంది. ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటనల అనంతరం విజ్జుకి ఇంప్రెస్ అయిన అంజిలి అతన్ని ప్రేమిస్తుంది.

కానీ కొన్ని కారణాల చేత అంజలి అతనికి బ్రేక్ అప్ చెప్పి విడిపోతుంది. ఆ తరువాత విజ్జు లైఫ్ లోకి మరో అమ్మాయి (అంకిత మ‌హారాణా) వస్తోంది. వీరిద్దరూ ప్రేమిచుకుంటారు. కానీ అంతలో అంజిలి మళ్ళీ విజ్జు లైఫ్ లోకి రావటానికి ప్రయత్నిస్తోంది. చివరకి అతను ఏ అమ్మాయిని ప్రేమించాడు ? ఎవర్ని పెళ్లి చేసుకుంటాడు అనేదే ఈ సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో హీరోగా నటించిన ఈశ్వర్ అనుభవం ఉన్న నటుడిలా ఈజ్ తో సెటిల్డ్ గా నటించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా తన లవర్ తో అలాగే ఫ్రెండ్స్ తో సాగే సన్నివేశాల్లో గాని, మరో హీరోయిన్ తో ప్రేమలో పడే సన్నివేశంలో గాని ఈశ్వర్ నటన బాగుంది. ఇక బాగా అమాయికమైన అమ్మాయిగా నటించిన టువ చ‌క్ర‌వ‌ర్తి తన నటనతోనూ అలాగే తన గ్లామర్ తోనూ ఆకట్టుకుంది.

అలాగే మరో హీరోయిన్ అంకిత మ‌హారాణా నటన పరంగా కంటే.. అందచందాలను ప్రదర్శించడంలోనే ఎక్కువగా ఆకట్టుకుంటుంది. అలాగే క్లైమాక్స్ లో సుధ, తన కొడుకు సురేష్ ను ఎదిరించి మాట్లాడే సన్నివేశం కూడా బాగుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే కౌసల్య‌, అన్న‌పూర్ణ‌, సుధ‌, స‌త్య‌కృష్ణ‌, విద్యుల్లేఖా రామ‌న్‌, సురేష్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, కృష్ణ‌భ‌గ‌వాన్‌, గౌతంరాజు, అనంత్‌, వేణు వంటి ప్రతిభావంతమైన నటీనటులు ఉన్న ఈ చిత్రంలో వాళ్ళు తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

మైనస్ పాయింట్స్ :

యూత్ కి కనెక్ట్ అయ్యే అంశాలు పెడుతున్నామనుకొని దర్శకుడు ఆర్‌.ర‌ఘురాజ్ ప్రతి సన్నివేశంలో అవసరం ఉన్నా లేకపోయినా బూతులు కుళ్ళు జోకులు ఇరికించి చికాకు పుట్టించారు.

పైగా ప్రతి సీన్ కథలో మిళితమయ్యే ఉంటుందిగాని, ఏ సీన్ కూడా కథను మాత్రం పరుగులు పెట్టించదు. కథనం కూడా స్లోగా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. ఇక అక్కడక్కడ నవ్వించారు గాని, అది ఎంతో కష్టపడి నవ్వించన్నట్టే ఉంటుందిగాని సహజంగా ఉండదు.

ముఖ్యంగా దర్శకుడు కథలోని మెయిన్ కాన్ ఫ్లిట్ ను వదిలేసి, అనవసరమైన కామెడీ ట్రాక్ లతో సినిమాని నింపడం సినిమా ఫలితాన్ని దెబ్బ తీసింది. దీనికి తోడు బలం లేని కథలో బలహీన పాత్రలను సృష్టించి సినిమా మీద కలిగే ఆ కాస్త ఇంట్రస్ట్ ని కూడా దర్శకుడు నీరుగార్చాడు.

అయినా, సినిమాను దృశ్యంతో చెప్పాలి గాని డైలాగ్ లతో చెప్పకూడదు. కానీ దర్శకుడు ఆర్‌.ర‌ఘురాజ్ మాత్రం ప్రతి దృశ్యాన్ని డైలాగ్ లతోనే చెప్పడానికి శతవిధాలుగా ప్రయత్నం చేశాడు. పైగా ప్రతి సన్నివేశం సినిమాటెక్ గానే సాగుతుంటుంది.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాలో సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే సినిమాటోగ్రఫర్ గా పని చేసిన చిట్టిబాబు.కె తన కెమెరా పనితనంతో మంచి విజువల్స్ అందించి ప్రేక్షకులకు కొంత ఊరట కలిగించాడు. భీమ్స్ సిసిరోలియో తన నేపధ్య సంగీతంతో సినిమాని కొంత నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ఎడిటర్ సినిమాను ఇంకా ట్రీమ్ చేసి ఉంటే బాగుండేది. నిర్మాతలు దొమ్మ‌రాజు హేమ‌ల‌త‌, దొమ్మ‌రాజు ఉద‌య్‌కుమార్ ల నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

తీర్పు:

ఆర్‌.ర‌ఘురాజ్ ద‌ర్శ‌కత్వంలో ఈశ్వ‌ర్‌, టువ చ‌క్ర‌వ‌ర్తి, అంకిత మ‌హారాణా హీరో హీరోయిన్లుగా వచ్చిన ఈ చిత్రం ఆసక్తికరంగా సాగలేదు. అవసరం ఉన్నా లేకపోయినా బూతులు మరియు బాగా కుళ్ళి పోయిన పాత జోకులతో సాగుతూ విసిగిస్తోంది. పైగా కథలో మెయిన్ కాన్ ఫ్లిట్ ను వదిలేసి దర్శకుడు అనవసరమైన కామెడీ ట్రాక్ లతో సినిమాని నింపేశాడు. కథాకథనాలు కూడా స్లోగా సాగుతూ బోర్ కొట్టిస్తాయి. మరి ఇలాంటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది చూడాలి.