2 అవర్స్ లవ్ మూవీ రివ్యూ ఆడియో – 2 Hours Love Movie Review Audio
శ్రీనిక క్రియేటివ్ వర్క్స్ నిర్మాణంలో శ్రీ పవార్ హీరోగా నటిస్తూ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘2 అవర్స్ లవ్’. కృతి గార్గ్ హీరోయిన్. కాగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ :
ఆదిత్ (శ్రీ పవార్), అవికా (క్రితి గార్గ్)ని చూడగానే ఆమెతో ప్రేమలో పడతాడు. అవికా కూడా ఆదిత్ ని అలాగే ప్రేమిస్తోంది. అయితే కేవలం సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటలు మాత్రమే ప్రేమిస్తానని కండిషన్ పెడుతుంది. అలా మొదలైన వారి ప్రేమ కథలో ఆ తరువాత వాళ్ళ మధ్య జరిగిన కొన్ని సంఘటనల అనంతరం లవ్ లో లీవ్ అని చెప్పి అవికా, ఆదిత్ ని రెండు నెలలు దూరం పెడుతుంది. ఈ క్రమంలోనే అవికా అసలు పేరు నయనా అని తెలుస్తోంది. మరి నయనా, అవికాగా ఎందుకు మారింది ? ఆదిత్ తో ‘2 అవర్స్ లవ్’ అని ఎందుకు అలా బిహేవ్ చేస్తోంది ? అసలు ఆదిత్ కి ఏమైంది ? అతని గతానికి నయనాకి ఉన్న సంబంధం ఏమిటి ? చివరికీ ఆదిత్ – నయనా ఒక్కటయ్యారా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర పై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
సినిమా పేరులోనే 2 అవర్స్ లవ్ ఉన్నట్లు.. ఈ సినిమా కూడా ఎక్కువుగా ఆ ‘2 అవర్స్ లవ్’ అనే పాయింట్ చుట్టే తిరుగుతుంది. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన శ్రీ పవార్ తన పాత్రకు తగ్గట్లు… తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచాడు. కొన్ని కీలక సన్నివేశాలతో పాటు హీరోయిన్ తో సాగే ట్రాక్ లో గాని, క్లైమాక్స్ సన్నివేశంలో గాని ఎంతో అనుభవం ఉన్న నటుడిలా చాలా బాగా నటించాడు.
ఇక హీరోయిన్ గా నటించిన కృతి గార్గ్ కొన్ని ఎమోషనల్ సీన్స్ లో అవలీలగా నటించడంతో పాటు అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. అలాగే రౌడీ గ్యాంగ్ కి లీడర్ గా నటించిన నూతన నటుడు శ్రీనివాస్ రాజు అద్భుతంగా నటించాడు. తన కామెడీ టైమింగ్ తో తానూ కనిపించిన నాలుగైదు సీన్స్ లోనూ ఆయన అలరిస్తారు. హీరో కమ్ దర్శకుడు శ్రీ పవార్ తీసుకున్న స్టోరీ పాయింట్ బాగుంది. ఆయన రాసుకున్న కొన్ని లవ్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. అలాగే మెయిన్ గా.. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ ట్రాక్ మరియు కుక్కపిల్లల సన్నివేశం కూడా ఆకట్టుకుంటుంది.
మైనస్ పాయింట్స్ :
దర్శకుడు సినిమాని ఇంట్రస్టింగ్ గా మొదలు పెట్టి.. ఆ తరువాత ఆసక్తి కరంగా సాగని సీన్స్ తో కథను డైవర్ట్ చేశారు. పైగా అనవసరమైన సన్నివేశాలు కూడా ఎక్కువైపోయాయి. పైగా ఆ సీన్స్ అన్ని కూడా.. ఒకేలా సాగడం కూడా విసుగు తెప్పిస్తోంది. అయితే దర్శకుడు రాసుకున్న థీమ్, కొన్ని ప్రేమ సన్నివేశాలు పర్వాలేదనిపించినప్పటికీ.. కథ కథనాల్లో మాత్రం ప్లో మిస్ అయింది. ముఖ్యంగా ఆయన రాసుకున్న కథనం ఆకట్టుకొన్నే విధంగా సాగలేదు. దీనికి తోడు సెకెండ్ హాఫ్ స్లోగా సాగుతూ బోర్ కొడుతోంది.
మొత్తంగా దర్శకుడు మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నా.. ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథాకథనాలను రాసుకోలేకపోయారు. అలాగే సినిమాలో ఉన్న కంటెంట్ ను కూడా బాగా ఎలివేట్ చేయలేకపోయారు. దీనికితోడు హీరో చుట్టూ సాగే డ్రామా కూడా బలహీనమైన సంఘటనలకు లోబడి బలహీనంగా సాగడంతో.. సినిమాలో బలమైన సంఘర్షణ మిస్ అయింది. స్క్రిప్ట్ లో కాన్ ఫిల్ట్ పై బాగా శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది.
సాంకేతిక విభాగం :
ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. సంగీత దర్శకుడు గ‌్యాని సింగ్ అందించిన నేపధ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా హీరోయిన్ లవ్ స్టోరీకి ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాల బాగుంది.
ఇక ఎడిటింగ్ బాగుంది గాని, సెకండాఫ్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. ప‌్రవీణ్ వనమాలి సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకున్నేలా ఉంది. ప్రేమ సన్నివేశాల్లోని విజువల్స్ ను ఆయన చాలా సహజంగా చూపించారు. ముఖ్యంగా కుక్కపిల్లల సన్నివేశం. ఇక శ్రీనిక క్రియేటివ్ వర్క్స్ పాటించిన నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్లే ఉన్నాయి.
తీర్పు :
శ్రీ పవార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆకట్టుకునే విధంగా సాగలేదు. కానీ శ్రీ పవార్ హీరోగా చేసిన ఈ తొలి ప్రయత్నం ఆయనకు మాత్రం మంచి ఫలితాన్నే ఇస్తుంది. సినిమాలో తన నటనతో, మ్యానరిజమ్స్ తో.. శ్రీ పవార్ హీరోగా తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. అయితే దర్శకుడుగా మాత్రం ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ఆయన రాసుకున్న స్టోరీ థీమ్ మరియు కొన్ని లవ్ సీన్స్ తో ఆకట్టుకున్నప్పటికీ.. ఓవరాల్ గా సినిమాని మాత్రం ఆయన ఆసక్తికరంగా మలచలేకపోయారు. మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నా.. ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథాకథనాలను రాసుకోలేకపోయారు. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు నిలబడుతుందో చూడాలి.