Godzilla 2 The King Of Monsters 2019 Hollywood Movie Review In Telugu

Godzilla 2

గాడ్జిల్లా 2 మూవీ రివ్యూ ఆడియో – Godzilla 2 Movie Review Audio





 

గతంలో రిలీజైన గాడ్జిల్లాకు సీక్వెల్‌గా గాడ్జిల్లా 2 కింగ్స్ ఆఫ్ మాన్‌స్టర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గాడ్జిల్లాకు దర్శకత్వం వహించిన గారెత్ ఎడ్వార్డ్స్ కొన్ని కారణాల వల్ల తప్పుకోవడంతో సీక్వెల్‌కు మైఖేల్ డాహెర్తీ దర్శకత్వం వహించారు. గాడ్జిల్లా సిరీస్‌లో ఇది 35వది. విడుదలకు ముందే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్లు సినిమాపై అంచనాలు పెంచాయి. విజువల్ ఎఫెక్ట్స్, ఇతర అంశాలపై మీడియాలో చర్చ భారీగానే జరిగింది. ఇలాంటి అంశాల మధ్య గాడ్జిల్లా2 కింగ్స్ ఆఫ్ మాన్‌స్టర్ మే 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలకు చేరుకొన్నాదా లేదా  అనే విషయాన్ని తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే.

కథ :

మార్క్ (కైలే చాండ్లర్), డాక్టర్ ఎమ్మా రస్సెస్ (వెరా ఫర్మింగా) ఇద్దరు భార్య భర్తలు. ఐదేళ్ల క్రితం గాడ్జిల్లా దాడిలో తన కుమారుడిని కోల్పోతారు. వ్యక్తిగత విభేదాల కారణంగా వారిద్దరూ విడిపోతారు. ఎమ్మా రసెల్ తన కూతురు మాడిసన్ (మిల్లీ బాబీ బ్రౌన్)తో కలిసి ఉంటుంది. ఈ క్రమంలో ప్రపంచాన్ని సర్వనాశనం చేయాలనే కోరికతో మోనార్క్ ఆర్గనైజన్‌‌ను నడిపే అలెన్ జానా (చార్లెస్ డ్యాన్స్)తో కలిసి ఎమ్మా రసెల్ పనిచేస్తుంటుంది. రాక్షస బల్లులు లాంటి భీకరమైన జంతువులను గుర్తించే పరికరాన్ని కనిపెడుతుంది. అలెన్ జానా దుష్ణపన్నాగాలను మార్క్ బృందం ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుంటారు. అలెన్ జానా, మార్క్ బృందాల మధ్య జరిగే పోరాటంలో మోత్రా, రోడాన్, కింగ్ గిడోరా లాంటి భయంకర జంతువులను గాడ్జిల్లా ఎలా ఎదుర్కొన్నది. తల్లి వద్ద నుంచి బయటకు వచ్చిన మాడిసన్ తండ్రి వద్దకు చేరిందా? ఎమ్మా, మార్క్ మళ్లీ కలుసుకొన్నారా? అలెన్ దుష్టపన్నాగాలకు ఎవరు? ఎలా అంతం పలికారు అనే ప్రశ్నలకు సమాధానమే గాడ్జిల్లా 2 కింగ్స్ ఆఫ్ మాన్స్‌స్టర్ చిత్ర కథ.

ప్లస్ పాయింట్స్ :

ఆది మానవుల కాలంలో ఉండే జంతువుల గురించి పరిశోధించే సంస్థ మోనార్క్ చుట్టే కథ తిరుగుతుంది. మంచు కొండల్లో బంధీలైన భయంకర జీవులను, గాడ్జిల్లాను విడిపించే క్రమంలో కథ సాగుతంది. మోత్రా, రోడాన్, కింగ్ గిడోరాను గాడ్జిల్లా అంతమొందించడానికి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చిందనే అంశాలు సినిమాలో ఆసక్తికరంగా ఉంటాయి. అద్భుతమైన విన్యాసాలతో, వార్ సీక్వెన్స్ పిల్లలకు ఆనందాన్ని కలిగిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. దర్శకుడు మైఖేల్ డాహెర్తీ పనితీరు యాక్షన్ మూవీస్ చూసే వారికి నచ్చుతుంది.

మైనస్ పాయింట్స్ :

గాడ్జిల్లా మూవీ చూడని ప్రేక్షకులకు కథలో ఏం జరుగుతందో అర్థం కాదు. గ్రాఫిక్స్ వర్క్స్ బాగున్నాయి. కాకపోతే ఓ రకమైన కలర్ బ్యాక్ డ్రాప్‌తో సినిమాను చిత్రీకరించడం ప్రేక్షకుడుని అసహనానికి గురిచేస్తుంది. కథలో పాత్రల వివరణ అసంపూర్తిగా, అసందిగ్ధంగా అనిపిస్తాయి. కథ కంటే గ్రాఫిక్,యాక్షన్ సన్నివేశాలనే నమ్ముకొన్నట్టు కనిపిస్తుంది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. అందులో మొదటగా చెప్పుకోవాల్సింది దర్శకుడు మైఖేల్ డాహెర్తీ
పోరాట సన్నివేశాలను ఎంతో అద్భుతంగా తీసాడు. ఇక లారెన్స్ షేర్ సినిమాటోగ్రఫీ బాగుంది. అలాగే సినిమాలో చేసిన గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ పరంగా కొంచెం స్లోగా సాగిన, సెకెండ్ హాఫ్ ను కట్ చేసిన విధానం బాగుంది. అలాగే నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

తీర్పు :

గాడ్జిల్లా2 కింగ్స్ ఆఫ్ మాన్‌స్టర్ చిత్రం టెక్నికల్‌గాను, నిర్మాణ పరమైన విలువలు పుష్కలంగా కనిపిస్తాయి. వేసవి సెలవుల్లో పిల్లలకు వినోదం అందించే చిత్రమని చెప్పవచ్చు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్లితే పెద్దలకు కూడా ఓ రకమైన అనుభూతికి లోనవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది చూడాలి.