Aravinda Sametha Review

Aravinda Sametha Review

             మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో తారక్ సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్నంటాలి. కానీ, అంతకంటే ముందు ‘అజ్ఝాతవాసి’ ప్లాప్ గుర్తొచ్చి కలవరపడిపోయారు అభిమానులు. ‘అరవింద సమేత’ ఫస్ట్ లుక్, టీజర్ తో ఆ అనుమానాలు పటాపంచలైపోయాయి. త్రివిక్రమ్ పూర్తిగా తారక్ దారిలోకి వచ్చి చేసిన సినిమా అని అర్థమైపోయింది.

        ఇక, అప్పటి నుంచి త్రివిక్రమ్ ఒరలో తారక్ ఎలా ఇమిడాడు అనేది చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ తర్వాత వచ్చిన పాటలు, ట్రైలర్, సాంగ్ ప్రోమోలు సినిమాపై అంచనాలని ఆకాశాన్నింటేలా చేశాయి. ఇలాంటి భారీ అంచనాల మధ్య దసరా కానుకగా ‘అరవింద సమేత వీర రాఘవ’డు ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చేశాడు. మరీ.. వీర రాఘవుడు ఎలా ఉన్నాడు ? ప్రేక్షకులని ఏ మేరకు మెప్పించాడు ?? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :

          నల్లగుడి గ్రామ పెద్ద బాసి రెడ్డి (జగపతి బాబు), కొమ్మద్ది ఊరి పెద్ద నారప రెడ్డి (నాగబాబు). ఈ రెండు గ్రామాలు ఫ్యాక్షన్ గొడవలతో రగిలిపోతుంటాయి. ఎప్పుడో ఓ చిన్ని గొడవతో ఈ రెండు గ్రామాల మధ్య చిచ్చు రాజుకుంది. ఈ గొడవలకి దూరంగా నారప రెడ్డి తన కొడుకు వీర రాఘవ రెడ్డి (ఎన్టీఆర్‌)ని లండన్ లో పెంచుతాడు. ఓ సందర్భంలో లండన్ నుంచి వచ్చిన కొడుకు వీర రాఘవ రెడ్డిని ఇంటికి తీసుకొస్తుండగా నారప రెడ్డిని ప్రత్యర్థులు చంపేస్తారు. నాయ‌న‌మ్మ‌(సుప్రియ పాత‌క్‌) మాట‌లకు ప్ర‌భావిత‌మై హింస‌కు, ర‌క్తపాతానికి దూరంగా ఉండాల‌ని హైద‌రాబాద్ వెళ్లిపోతాడు.

          అక్క‌డ అర‌వింద (పూజాహెగ్డే) ప‌రిచ‌యం అవుతుంది. అర‌వింద కూడా త‌న నాయ‌న‌మ్మ చెప్పిన‌ట్లు ‘హింస వ‌ద్దు.. ర‌క్త‌పాతం వ‌ద్దు’ అని చెబుతుంటుంది. ఒక‌సారి అర‌వింద‌పై అటాక్ జ‌రుగుతుంది. ఆ ప్ర‌మాదం నుంచి అర‌వింద‌ను ర‌క్షిస్తాడు వీర రాఘ‌వ‌. అప్ప‌టి నుంచి అర‌వింద‌కు సంర‌క్ష‌కుడిగా మార‌తాడు. అనుకోని ప‌రిస్థితుల్లో అర‌వింద ఇంటికి వెళ్లిన వీర రాఘ‌వకు అక్క‌డ ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర‌య్యాయి? ఆమె నేప‌థ్యం ఏంటి? నాయ‌న‌మ్మ చెప్పిన‌ మాట‌ను నిలబెట్టుకుంటూ హింస‌ను, ఫ్యాక్ష‌నిజాన్ని వీర రాఘ‌వ ఎలా అడ్డుకున్నాడు ? అనేది త్రివిక్రమ్ మార్క్ కథనంతో కూడిన మిగితా కథ.

ప్లస్ పాయింట్స్ :

* ఎన్టీఆర్, జగపతి బాబుల నటన

* నేపథ్య సంగీతం

* కథనం, మాటలు

మైనస్ పాయింట్స్ :

* త్రివిక్రమ్ మార్క్ వినోదం

* కొన్ని బోరింగ్ సీన్స్

ఎలా సాగింది ?

         తెలుగు తెరపై రాయల ఫ్యాక్షన్ నేపథ్యంలో చాలా సినిమాలే వచ్చాయ్. ఐతే, వాట‌న్నింటికీ భిన్నంగా త్రివిక్ర‌మ్ కొత్త అంశాన్ని ఎంచుకున్నారు. క‌త్తి ప‌ట్టుకుని బ‌య‌లుదేరిన భ‌ర్త గురించి అత‌ని భార్య, తండ్రి గురించి పిల్ల‌లు ఎంత త‌ల్ల‌డిల్లిపోతారో వాళ్ల కోణంలో చూపించారు. మొద‌టి ఇర‌వై నిమిషాల క‌థ చాలా ప‌క‌డ్బందీగా సాగుతుంది. కథ హైదరాబాద్ కు తర్వాత కాస్త డౌన్ అయినట్టు అనిపిస్తుంది. ఇక సమరమే అనే ఇంటర్వెల్‌ కార్డుతో యాక్షన్ మూడ్‌లో వెళ్లిన ప్రేక్షకుడికి డిఫరెంట్ ట్రీట్‌మెంట్‌ను అందించాడు.

         ఊహించని విధంగా మాస్, మసాలను పక్కన పెట్టి కథ, కథనాలనే నమ్మకొన్నాడు. ఇంటర్వెల్ తర్వాత వచ్చే రావు రమేష్ ఎపిసోడ్‌తో బాగా వచ్చింది. ప్రీ క్లైమాక్స్ కాస్త‌ సాగ‌దీసిన‌ట్లు అనిపించినా, క్లైమాక్స్‌లో మ‌ళ్లీ క‌థ‌ను ఫామ్‌లోకి తీసుకొచ్చాడు త్రివిక్రమ్. ఎన్టీఆర్‌ను అభిమానులు ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారో అంతకు మించి చూపించే ప్రయత్నం చేశాడు త్రివిక్రమ్. ఎన్టీఆర్‌ మార్క్‌ డైలాగ్స్‌, ఎమోషన్స్‌, మాస్‌ ఎలిమెంట్స్‌ మిస్ కాలేదు. ఐతే, ఈసారి త్రివిక్రమ్ వినోదం మిస్సయ్యింది.

నటీనటుల ఫర్ ఫామెన్స్ :

           యంగ్ టైగర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగితే ఎట్టుట్టదో అందరికీ తెలుసు. ఎమోషన్స్‌, యాక్షన్‌, రొమాన్స్‌ ఇలా ప్రతీ భావాన్ని అద్భుతంగా పలికించాడు. రాయలసీమ యాసలో తారక్ డైలాగ్స్‌ అదుర్స్. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ తారక్ నోటీతో చెబుతుంటే అద్భుతంగా అనిపిస్తాయి. యాక్షన్ల సీన్లలో కొత్తరకమైన ఎన్టీఆర్‌ను చూస్తాం. కీలక సన్నివేశాల్లో ఎన్టీఆర్ హావభావాలు ప్రేక్షకుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. పూజా చాలా క్యూట్ గా కనిపించింది. కథకు అవసరమైన మార్గదర్శకత్వాని చూపించడంలో పూజా హెగ్గే అరవింద పాత్రలో ఒదిగిపోయింది. ఎన్టీఆర్ తర్వాత ఆ రేంజ్ లో ఆకట్టుకొనే పాత్ర జగపతిబాబు. లుక్స్ తో భయపెట్టాడు బాబు. తారక్ తండ్రి పాత్రలో నాగబాబు నటన బాగుంది. మిగితా నటీనటులు తమ తమ పరిధి మేరకు నటించారు.

సాంకేతికంగా :

          ఈ సినిమా విషయంలో సంగీత దర్శకుడు థమన్ పేరు గట్టిగా వినిపిస్తోంది. నేపథ్య సంగీతంతో ఆయన చేసిన మాయ అలాంటిది. అది సినిమాని మరో రేంజ్ కి తీసుకెళ్లింది. థమన్ అందించిన పాటలు సినిమా విడుదలకు ముందే సూపర్ హిట్ అనే టాక్ వినిపించింది. తెరపై చూడ్డానికి కూడా బాగున్నాయి. పీఎస్‌ విందా సినిమాటోగ్రఫీ బాగుంది. రాయలసీమ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టుగా తెర మీద ఆవిష్కరించాడు విందా. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా : త్రివిక్రమ్ సమేత తారక్ చాలా బాగున్నాడు